పేద విద్యార్థుల కోసం...
నేను సైతం...
ఇక్కడ పిల్లలతో కనిపిస్తున్న అమ్మాయి పేరు జెన్నీఫర్. ఆస్ట్రేలియాకి చెందిన ‘తర ఎడ్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ఆస్ట్రేలియాలోని టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీ విద్యార్థులను ఇన్‌టర్న్‌షిప్‌గా భారతదేశంలోని మారుమూల పల్లెలకు పంపుతోంది. అందులో భాగంగా మహరాష్ట్ర, రాజస్థాన్‌లోని గ్రామాలకు ఓ శిక్షణలో ఉన్న ఓ 30 మంది ఉపాధ్యాయులను ‘తర ఎడ్’ పంపింది. అందులో ఒకరే జెన్నీఫర్.
ఇరవై ఏళ్ల జెన్నీఫర్ ఆ సంస్థ తరపున టీచర్‌గా పనిచేయడానికి రాజస్థాన్‌కి వచ్చి మూడేళ్లు దాటింది. జెన్నీఫర్ తన విధి నిర్వహణతో పాటు స్వచ్ఛందంగా కొందరు పేద విద్యార్థుల్ని, అనాథ పిల్లల్ని, బాలకార్మికులను పాఠశాలలో చేర్పించే పనిలో పడింది. రాజస్థాన్‌లోని జైపూర్ చుట్టుపక్కల పల్లెలన్నీ తిరిగి 1500 మంది విద్యార్థుల్ని ఆ చుట్టుపక్కల పాఠశాలల్లో చేర్పించి, ఉత్తమ యువ స్వచ్ఛంద సేవకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందింది జెన్నీఫర్. పేదపిల్లలను గుర్తించి, వారిని ఒప్పించి పాఠశాలలో చేర్పించే క్రమంలో జెన్నీఫర్ చాలా కష్టాలను ఎదుర్కొంది. పలు గ్రామాలకు వెళ్లినపుడు రాత్రులు అక్కడే ఉండాల్సి వచ్చేది. ‘‘ఒకసారి నేను ఓ గిరిజన తండాకు వెళ్లాను. అప్పుడు చాలా వర్షం వచ్చింది. అక్కడ నేను ఒక చిన్నగదిలో వారంరోజుల పాటు ఉండాల్సి వచ్చింది. అప్పుడు వరదనీరంతా నా గదిలోకి వచ్చేసేది.
ఆ ఊరి పిల్లల్ని పాఠశాలలో చేర్పించకుండా వెనక్కి తిరిగి రాకూడదనుకున్నాను. అలాగే ఓ వారం రోజులు ఉండి నా పని ముగించుకుని వచ్చాను. ఇంకొన్ని ప్రాంతాల్లో బాలకార్మికులను కలవడానికి వెళ్లినపుడు పెద్దవాళ్లు నన్ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. నేను భయపడకుండా ఆ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థల సాయంతో నేననుకున్న పని చేసుకొచ్చేదాన్ని. అప్పుడే మూడేళ్లు గడిచిపోయిందా అనిపిస్తోంది ’’ అని చెప్పింది జెన్నీఫర్. 2020 నాటికి మన దేశంలో 20 వేలమంది పేదవిద్యార్థులను పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందించాలన్న ‘తర ఎడ్’ లక్ష్యంతో నేనుసైతం అంటూ జెన్నీఫర్ భాగం కావడం మరెందరికో ఆదర్శం కదూ!