
సాక్షి, పాపన్నపేట(మెదక్): ‘కష్టంతో కాదు.. ఇష్టంతో చదివినప్పుడే ఆ చదువులకు సార్థకత.’ కానీ కొందరు చిన్నారులకు బడి అంటే బందీఖానాల కనిపిస్తుంది. విద్యార్థిలో భయాన్ని పార
ద్రోలేందుకు డీఈఓ రవికాంత్‌రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’ అనే పేరుతో కృత్యాధార బోధన పద్ధతి ప్రవేశపెట్టారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తద్వారా పాఠశాల అంటే విద్యార్థిలో ఉన్న భయం తొలగిపోయి, చురుకుగా విద్యాభ్యాసం చేస్తాడు.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తారు. దీంతో స్థాయికి తగిన సామర్థ్యాలు సాధిస్తారు. ఈ విధానాన్ని పోలిన‘హ్యాపినెస్ కరికులం’పై కూడా అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొంతమంది టీచర్లను, హెచ్‌ఎంలను ఢిల్లీకి పంపేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కృత్యాధార విధానంతో ఖుషీ.. ఖుషీ
కృత్యాధార బోధన ద్వారా పాఠ్యాంశంలో విద్యార్థులు పాల్గొనేలా చేస్తూ వారిని ఆకట్టుకునే విధంగా బోధించడం, బడి అంటే ఆటల ఒడిగా తీర్చిదిద్దడం ‘జాయ్‌ఫుల్ లెర్నింగ్’ ముఖ్య ఉద్దేశ్యం. పదో తరగతి చదువుతున్నా కొంత మంది విద్యార్థులు తెలుగు.. హిందీలు చదవులేక పోవడం, కూడికలు.. తీసివేతలు చేయలేక పోవడం.. కనీస సామర్థ్యాలు సాధించలేక పోవడం చూసిన సిద్దిపేట, మెదక్ జిల్లాల విద్యాధికారి ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం 30 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసుకొన్నారు. 1నుంచి 10వ తరగతి వరకు గల పాఠ్యాంశాలపై అనుబంధ కార్యక్రమాలను రూపొందించారు.స్థానికంగా దొరికే, ఖర్చు లేని వస్తువులు, వాడి పారేసిన పరికరాలు, ఉచితంగా దొరికే భాగాలను ఉపయోగించుకొని ఆకర్షణీయమైన బోధనోపకరణాలు తయారు చేసుకోవాలని నిర్ణయించారు. వాటితో విద్యార్థులను ఆకట్టుకునేలా కృత్యాధార బోధన కొనసాగించాలి.
ఆటలు, పాటలు, నాటికలు, కథలు చెప్పడం, కథలు రాయడం, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఆకట్టుకునేలా బోధించడంతో ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ఆశిస్తున్నారు. ఈ మేరకు తయారు చేసిన ప్రణాళికలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పాఠ్యాంశాన్ని నిత్య జీవితంలోని సంఘటనలతో, లభ్యమయ్యే వనరులతో అనుసంధానం చేస్తూ కృత్యాధార కార్యక్రమాలు కొనసాగించాలి. విద్యార్థులు స్వయంగా కృత్యాలలో పాల్గొనడం ద్వారా వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరగడం, కృత్యాల పట్ల ఆసక్తి నెలకొనడం, నాయకత్వ లక్షణాలు అలవడటం లాంటి చర్యలతో బడి అంటే బందీఖాన కాదని.. ఆట పాటల ఒడి అనే భావం అలవడుతుంది. ప్రతీ పాఠాన్ని విద్యార్థి ద్వారా బోధించేలా చూస్తారు. పుస్తకాల బరువును తగ్గించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుంది.
విద్యార్థి కేంద్రంగా బోధన కొనసాగాలి
బడి అంటే భయం పోవాలి. బట్టీ విధానం మాయం కావాలి. విద్యార్థి పాత్ర పెరగాలి. ఇందుకు కృత్యాధార విధానమే మేలు. అందుకు పలు అధ్యయనాలు జరిపి, పలువురి అభిప్రాయలు సేకరించి ‘జాయ్ ఫుల్ లెర్నింగ్’ విధానానికి రూపకల్పన చేశాం. విద్యార్థి కేంద్రంగా ఈ విధానం కొనసాగుతుంది. ఆట పాటలతో పాటు, కథలు వినడం, కథలు రాయడం, నాటికలు లాంటి కార్యక్రమాలకు విద్యార్థి ఆకర్షితుడవుతాడు. పాఠ్యాంశాలను స్థానికంగా ఉన్న వనరులతో.. సంఘటనలతో సమన్వయం చేసి కళ్లకు కట్టుకునేలా బోధన కొనసాగిస్తారు. ఫీల్డ్ ట్రిప్స్ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులు పూర్తి స్థాయి పరిజ్ఞానం పొందుతారు. స్వయంగా పాఠ్యాంశాన్ని బోధిచండం ద్వారా నాయకత్వ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి.
– రవికాంత్‌రావు, ఇన్‌చార్జి డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment