ఐదేళ్ల క్రితం 2016లో ప్రారంభించిన తొలి ఇన్ఫర్మేషన్, కమ్యూనిటీ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీ లక్ష్యాలకు కొనసాగింపుగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండో ఐసీటీ పాలసీని గురువారం ప్రకటించింది. 2021 నుంచి 2026 వరకు అమల్లో ఉండే ఈ పాలసీలో 12 రంగాలు, ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. – సాక్షి, హైదరాబాద్
5 అంశాలివీ..
►పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, డిజిటల్ సేవలు, ఆవిష్కరణలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఐసీటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, కోవిడ్ సంక్షోభ పరిస్థితి ఆధారంగా ఐటీ పరిష్కారాలు కనుగొని అభివృద్ధి బాటలో సాగడం లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించినట్టు వెల్లడించింది.
12 రంగాలివీ..
►ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఆధారిత ఇతర ఉత్ప త్తులు, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, కాగిత రహిత పాలన, డిజి టల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అక్షరాస్యత, ఎమర్జింగ్ టెక్నాలజీ, క్లౌడ్ పాలసీ, టెక్నా లజీ వినియోగాన్ని పెంచేలా ఐటీ శాఖను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాలకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పన.
రెండో ఐసీటీ పాలసీ విశేషాలు..
►ఐటీ రంగం ద్వారా 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాల కల్పన, రూ.3 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యం.
►ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్టోరేజీ ఎనర్జీ వ్యవస్థలు, ఐటీ హార్డ్‌వేర్, టెలికాం ఉపకరణాలు, సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, మెడికల్ డివైజెస్, ఆటోమోటివ్, రక్షణ రంగ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీకి ప్రోత్సాహం.
►8వేలకు పైగా స్టార్టప్‌ల ద్వారా రూ.10 వేలకోట్ల మేర పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. రూ.1,300 కోట్లతో స్టార్టప్ ఫండ్, రూ.100 కోట్లతో క్షేత్రస్థాయి ఆవిష్కరణల నిధి ఏర్పాటు.
►స్థానికులకు ఐటీ నైపుణ్యాల్లో శిక్షణ. కనీసం 80శాతం మందికి నైపుణ్య శిక్షణ. ఏటా 50వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు.
►పౌరసేవలను వంద శాతం ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తేవడం. వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలను మొబైల్ ఫోన్ల ద్వారా అందజేయడం.
►రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవలు, టీఫైబర్ ద్వారా 2026 నాటికి ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వంద శాతం ఇంటర్నెట్ సౌకర్యం.
►ఐదు ప్రాంతీయ కేంద్రాల ద్వారా జిల్లాల్లో ఆవిష్కరణల వాతావరణం కల్పించడం.
►ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కనీసం 5శాతం ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించడం.
Comments
Please login to add a commentAdd a comment