సాక్షి, హైదరాబాద్: త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రస్తుతమున్న పాలసీ త్వరలో ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కొత్త ఐటీ పాలసీ తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీతో ఐటీ పరిశ్రమలో పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం పనితీరుపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆరేళ్లుగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు ‘2021–26’మధ్య ఐదేళ్ల పాటు అమల్లో ఉండే నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు.
పౌరుడే కేంద్రంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని, కొత్తగా సాంకేతిక అభివృద్ధిని ఆలంబనగా చేసుకుని సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అందే పౌర సేవలను రాబోయే తరానికి చేరువయ్యేలా ఐటీ శాఖ దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా అందించాల్సిన కార్యక్రమాలపైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, దీని ద్వారా తమ గడప నుంచే ప్రభుత్వ సేవలు పొందేలా చూడాలని సూచించారు. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్)
ఆవిష్కరణల వాతావరణం బలోపేతం..
ఆరేళ్లుగా రాష్ట్రంలో బలమైన ఆవిష్కరణల వాతావరణం (ఇన్నోవేషన్ ఎకో సిస్టం) ఏర్పడిందని, దీనిని మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ఆరేళ్లుగా నూతన పెట్టుబడులను రాష్ట్రానికి ప్రత్యేకించి హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించామని పేర్కొన్నారు. ఇప్పటికే స్థానిక యువతకు ఎక్కువ మొత్తంలో ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment