మన లక్ష్యం 1 | it policy targets in telangana | Sakshi
Sakshi News home page

మన లక్ష్యం 1

Published Tue, Apr 5 2016 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM

మన లక్ష్యం 1

మన లక్ష్యం 1

 వినూత్నంగా ఐటీ విధానం

 సాక్షి, హైదరాబాద్
: ప్రపంచంలోనే తెలంగాణను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించింది. ఐటీలో నూతన సాంకేతిక విజ్ఞానానికి ప్రధాన చిరునామాగా, దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణను నిలపాలని లక్ష్యంగా
 నిర్దేశించుకుంది. పౌర సేవల వినియోగం, వినిమయంలో ఐటీని గణనీయంగా విస్తరించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ప్రధానంగా పది అంశాల ఎజెండాను ప్రకటించింది. ఐటీ కంపెనీల విస్తరణ, ఎలక్ట్రానిక్స్, కొత్త పరిశ్రమల స్థాపన (ఎంటర్ ప్రెన్యూర్‌షిప్), శిక్షణ నైపుణ్యం (స్కిల్లింగ్), ప్రభుత్వపరంగా ఐటీ సేవలు (ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ఐటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్), కొత్త ఆవిష్కరణలు (న్యూ ఇనీషియేటివ్స్), ఈ-గవర్నెన్స్, ఎం-గవర్నెన్స్, డిజిటల్ తెలంగాణ, ఉత్పత్తుల
 ప్రాచుర్యం(ప్రమోషన్స్), జీవన ప్రమాణాల పెంపు అంశాలను ఇందులో పొందుపరిచింది.   
 
 ప్రధాన అంశాలివీ..
► కొత్త ఐటీ క్లస్టర్ల ఏర్పాటు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు, బీపీవోల ఏర్పాటుకు ప్రోత్సాహం. చిన్న, సూక్ష్మ కంపెనీలకు కొత్త టవర్స్ నిర్మాణంతో పాటు ఆర్థిక చేయూతనివ్వడం.
► ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు 15 రోజుల్లో అనుమతులు. రెండు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు. 600 ఎకరాల్లో ఈ-సిటీ, 310 ఎకరాల్లో సైన్స్ పార్కు.
► స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్ విస్తరణ. ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్, ఐఐటీ, బిట్స్‌తో ప్రభుత్వం భాగస్వామ్య పద్ధతిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మేనేజ్‌మెంట్, లా వివిధ విభాగాల్లో ఔత్సాహికులకు ప్రోత్సాహం. ఇంక్యుబేటర్స్, యాక్సిలేటర్స్, సీడ్ ఫండ్స్ ఏర్పాటుకు అండ.
► తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ. ఉపాధి కల్పన
► ప్రభుత్వ విభాగాల్లో ఐటీ సేవల విస్తరణ. ప్రభుత్వ రంగ సంస్థల ఆవిష్కరణలను ఆధునికీకరించేందుకు ఐటీ కంపెనీలతో అనుబంధం.
► గేమింగ్, యానిమేషన్, డేటా ఎనలిటిక్స్ కంపెనీలకు వీలుగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి,కొత్త పరిజ్ఞానం రూపకల్పనకు చేయూత.
► పౌర సేవలను మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ అప్లికేషన్ల వినియోగం. టెలికం ప్రొవైడర్లు, మొబైల్ స్టోర్స్ ద్వారా సర్కారు సేవలు.
► తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం. ప్రధాన పట్టణాలు, నగరాల్లో వైఫై సదుపాయం. రాబోయే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం. ప్రతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు కంప్యూటర్ విద్య.
► రాష్ట్రంలో పెట్టుబడులకు ఐటీ కంపెనీలకున్న అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం. అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శనలు, ట్రేడ్ షోలు, సదస్సులు, సెమినార్లలో పాల్గొనడం.
► జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా ‘బ్రాండ్ హైదరాబాద్’ను నిలబెట్టడం.
 
 ఐటీ/ఐటీఈఎస్ విస్తరణకు ప్రోత్సాహకాలు
 మెగా కంపెనీలు, ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలు, ద్వితీయ శ్రేణి నగరాల్లో నెలకొల్పే ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ సేవలందించే కంపెనీలు, మధ్యతరహా, చిన్న, సూక్ష్మ కంపెనీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నెలకొల్పే కంపెనీలుగా వర్గీకరించింది. భూముల కేటాయింపు, విద్యుత్ చార్జీల రాయితీ, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ, పేటెంట్ చార్జీల్లో రాయితీ, నాణ్యత సర్టిఫికెట్లలో రాయితీలను అన్ని కంపెనీలకు వర్తింపజేసింది.

► మెగా కంపెనీలకు స్వీయ అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు లెసైన్స్ ఇస్తారు. వంద కిలోవాట్లకు మించిన సౌర విద్యుత్ యూనిట్ నెలకొల్పుకునేందుకు రూ.20 లక్షలు లేదా మూలధనంలో పది శాతం.. ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఏటా వంద మంది విద్యార్థులను క్యాంపస్ రిక్రూట్‌మెంట్ చేసుకుంటే రూ.10 వేల చొప్పున నియామక సాయం అందిస్తారు.
► రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీల్లో పరిశోధనకయ్యే ఖర్చులో పది శాతం గ్రాంటుగా చెల్లిస్తారు. ప్రతిభ ఆధారంగా 25 శాతం పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.25 వేలు స్టైఫండ్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు రూ.20 వేల చొప్పున సాయం.
 
 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో..
 హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పితే మొదటి మూడేళ్లు మున్సిపల్ ట్యాక్స్ రీయింబర్స్ చేస్తారు. రూ.20 వేల చొప్పున రిక్రూట్‌మెంట్ సాయం. బీపీవోలు నెలకొల్పితే 50 శాతం లేదా గరిష్టంగా రూ.20 లక్షలకు మించి పెట్టుబడి రాయితీ. అభ్యర్థులకు శిక్షణ భృతి ఇస్తారు.
 
 మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం..
 రూ.5లక్షలలోపు టర్మ్, పెట్టుబడి రుణాల్లో ఐదేళ్లపాటు మహిళలకు 5 శాతం వడ్డీ రాయితీ, ఎస్సీ ఎస్టీలకు 8.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున రీయింబర్స్‌మెంట్. మూలధనంలో 25 శాతం ( మహిళలకు రూ.20 లక్షలకు మించకుండా, ఎస్సీ ఎస్టీలకు రూ.25 లక్షలకు మించకుండా) సబ్సిడీ అందిస్తారు. ఏడాదికి 50 మంది ఐటీ నిపుణులను రిక్రూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున నియామక సాయం అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement