ఐటీ అనుబంధ విధానాలు
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానంతోపాటు అనుబంధంగా నాలుగు విధానాలను ప్రభుత్వం ప్రకటించింది. స్టార్టప్ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్ పాలసీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఈఎస్‌డీఎం (ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్) పాలసీ, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూరల్ టెక్ పాలసీ, యానిమేషన్ అండ్ గేమింగ్ కంపెనీలకు ఇమేజ్ పాలసీలను ఆవిష్కరించింది.
ఎలక్ట్రానిక్స్‌లో అగ్రస్థానం వైపు..
వినూత్నంగా ‘ఈఎస్‌డీఎం’ విధానం
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఈ పాలసీ ప్రభుత్వం ప్రకటించింది.
లక్ష్యాలు: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ఆదర్శ గమ్య స్థానంగా తెలంగాణను మార్చడం, మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 1.6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ఒక బిలియన్ డాలర్ల నుంచి 7.5 బిలియన్ డాలర్లకు పెంచడం.
రాయితీలు: పబ్లిక్ అండ్ ప్రైవేటు సంస్థలతో సమన్వయం, నాణ్యమైన రహదారులు, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన. కార్మికుల శిక్షణకు సబ్సిడీ, ట్యాక్స్ అండ్ ఫిస్కల్ రాయితీలు, లీజు డీడ్, మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీల్లో 100% రీయింబర్స్, ఐదేళ్ల వరకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు, తెలంగాణలో కేంద్ర కార్యాలయం ఉన్న సంస్థలకు పేటెంట్ ఖర్చు, క్వాలిటీ సర్టిఫికేషన్‌కు అయ్యే ఖర్చుల్లో 50% రీయింబర్స్ (గరిష్టంగా రూ.2లక్షల వరకు), 100% వ్యాట్/సీఎస్టీ, ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, మొదటి 25 మెగా కంపెనీలకు 20% పెట్టుబడి రాయితీ ( రూ.2కోట్లవరకు), మొదటి 50 సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలకు గరిష్టంగా రూ.50లక్షలు, అర్హత కలిగిన కంపెనీలకు 25% సబ్సిడీతో పదేళ్ల వరకు లీజు పద్ధతిన భూమి కేటాయింపు, డార్మిటరీల నిర్మాణానికి 20% భూమి కేటాయింపు.
‘కళ’కు తోడ్పాటుగా..
ఇమేజ్ (గేమింగ్ అండ్ యానిమేషన్) పాలసీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, గేమింగ్ పరిశ్రమ (ఏవీసీజీఐ) కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఇమేజ్ పాలసీకి శ్రీకారం చుట్టింది.
లక్ష్యాలు: రంగారెడ్డి జిల్లాలో టీఎస్‌ఐఐసీ సహకారంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇమేజ్ సిటీని ఏర్పాటు చేస్తారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అకాడమీని నెలకొల్పుతారు.
రాయితీలు: రూ.5 కోట్లకు పైగా పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు గరిష్టంగా రూ.25లక్షలు లేదా 25శాతానికి మించకుండా పెట్టుబడి రాయితీ. యానిమేషన్ ఫిల్మ్‌లు, కార్టూన్‌లు, గేమ్‌ల తయారీకయ్యే వ్యయంలో 20 శాతం రీయింబర్స్‌మెంట్. తెలంగాణలోనే పూర్తిస్థాయిలో తయారయ్యే వీఎఫ్‌ఎక్స్ చిత్రానికి వంద శాతం వినోదపు పన్ను మినహాయింపు. మూడేళ్ల పాటు రూ.3 లక్షలకు మించకుండా ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ చార్జీల రీయింబర్స్‌మెంట్.
ఔత్సాహికులకు ప్రోత్సాహం..
స్టార్టప్‌ల కోసం ఇన్నోవేషన్ పాలసీ
ఐటీ విధానంలో స్టార్టప్ కంపెనీలకు పెద్దపీట వేసింది.
లక్ష్యాలు: వచ్చే ఐదేళ్లలో స్టార్టప్‌ల కోసం 10లక్షల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ల అభివృద్ధి, వచ్చే ఐదేళ్లలో 900 స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తూ రెండో దశ టీ-హబ్. 1000 ఐటీ, 300 ఎలక్ట్రానిక్స్, 400 గ్రీన్‌టెక్ స్టార్టప్‌లతో కలిపి 5 వేల స్టార్టప్‌ల అభివృద్ధికి కృషి, దీనికి రూ.2వేల కోట్ల నిధుల సేకరణ.
రాయితీలు: ఇంక్యుబేటర్లకు 2 జీబీపీఎస్ ఇంటర్నెట్ సదుపాయం, టీ-హబ్ తో అనుసంధానమైన స్టార్టప్‌ల కార్యకలాపాలను అందరికీ అందుబాట్లోకి తేవడం, స్టార్టప్‌ల ద్వారా యువతకు అవసరమైన ఇంటర్న్‌షిప్, కెరీర్ అవకాశాలు. వ్యాపారాభివృద్ధికి ఇన్నోవేషన్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా పరిశోధ నాభివృద్ధి కోసం సాంకేతిక సంస్థలను ప్రోత్సహించడం. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల సహకారంతో నిధులు.
గ్రామ యువతకు చేయూత
‘రూరల్ టెక్నాలజీ సెంటర్స్’ విధానం
స్థూల దేశీయోత్పత్తిలో సుమారు 10% వాటా కలిగిన ఐటీ సుమారు 35లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో ఎక్కువ మంది పల్లెల నుంచి వస్తున్న వారే. దీంతో ప్రభుత్వం గ్రామీణ సాంకేతిక కేంద్రాల (రూరల్ టెక్నాలజీ సెంటర్లు-ఆర్‌టీసీలు) ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. కేవలం ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
లక్ష్యాలు: రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఒక్కో రూరల్ టెక్నాలజీ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 2,500 మంది యువతకు ఉపాధి కల్పిస్తారు. ప్రతి జిల్లా నుంచి 10 వేల మంది గ్రామీణ యువతకు ‘తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)’లో శిక్షణ ఇస్తారు.
రాయితీలు: మొదటి మూడేళ్ల పాటు తొలుత ఏర్పాటయ్యే ఐదు ఐటీ కంపెనీలకు పంచాయతీలు విధించే పన్నులు రీయింబర్స్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఐటీ ప్రమోషన్ కార్యక్రమాల నిర్వహణకయ్యే ఖర్చులో 50శాతం లేదా గరిష్టంగా రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ రాయితీ ఇస్తారు. గరిష్టంగా రూ.40లక్షల పెట్టుబడితో ముందుకు వచ్చే తొలి మూడు పరిశ్రమలకు 50శాతం, తర్వాత వచ్చే వాటికి 10శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. మూడేళ్ల పాటు ఇంటర్నెట్, టెలిఫోన్ చార్జీల్లో 25శాతం తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగం కల్పించేవారికి శిక్షణ రాయితీ కింద నెలకు రూ.2,500 చెల్లింపు.