ఐటీలో కావాలి మేటి | New IT policy prepared by Telangana government | Sakshi
Sakshi News home page

ఐటీలో కావాలి మేటి

Published Sun, Mar 27 2016 3:36 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఐటీలో కావాలి మేటి - Sakshi

ఐటీలో కావాలి మేటి

- కొత్త ఐటీ పాలసీని సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఐదేళ్లలో రూ.1.36 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు లక్ష్యం
- కొత్తగా నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు

- ఏప్రిల్ 4న కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం
 
సాక్షి, హైదరాబాద్:
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఐటీ విధానానికి రూపకల్పన చేసింది. అయిదేళ్లలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఉన్న రూ.68,200 కోట్ల ఐటీ ఎగుమతుల టర్నోవర్‌ను ఐదేళ్లలో రూ.1.36 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించుకుంది. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే రాష్ట్రంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను ఐటీ హబ్స్‌గా మార్చాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కొత్త కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా నూతన విధానాన్ని సిద్ధం చేసింది.

ఇప్పటికే తయారైన ఈ ముసాయిదా ప్రకారం.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించనుంది. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, సంస్థలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 25 శాతం నుంచి 50 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. భూమి ధరలో రాయితీ కల్పించనుంది. కంపెనీలు చెల్లించే విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, బదిలీ పన్ను(ట్రాన్స్‌ఫర్ డ్యూటీ), రిజిస్ట్రేషన్ రుసుం, పేటెంట్ చార్జీలను ప్రభుత్వమే తిరిగి రీయింబర్స్‌మెంట్ చేయనుంది. ఉద్యోగ నియామకాలను ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లా కేంద్రాల్లో కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించనుంది.

స్టార్టప్‌లకు చేయూత
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్ కంపెనీలకు 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్ కంపెనీలను నెలకొల్పేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అంతర్జాతీయ రుణ సంస్థల ద్వారా దాదాపు 2 వేల కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. 2,500 స్టార్టప్ కంపెనీలకు రాబోయే ఐదేళ్లలో ఇంక్యుబేషన్ అండ్ మెంటార్‌షిప్ సాయం అందించనుంది.
 
నాలుగు అనుబంధ పాలసీలు
ఏప్రిల్ 4న ఐసీటీ పాలసీని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీ సెంటర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ కొత్త ఐటీ విధానాన్ని ప్రకటించనున్నారు. ఐటీతోపాటు అనుబంధ రంగాలకు చెందిన మరో నాలుగు విధానాలను కూడా ప్రభుత్వం రూపొందించింది. స్టార్టప్ కంపెనీలను ఆకర్షించేందుకు ఇన్నోవేషన్ పాలసీ, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఈఎస్‌డీఎం(ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్) పాలసీ, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు రూరల్ టెక్ పాలసీ, యానిమేషన్ అండ్ గేమింగ్ పాలసీ ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ అదే వేదికపై సీఎం ఆవిష్కరించనున్నారు.

సాఫ్ట్‌వేర్‌కు ఇప్పటికే చిరునామాగా మారిన హైదరాబాద్‌ను హార్డ్‌వేర్‌లోనూ అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ విధానంలో ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,300కుపైగా ఐటీ కంపెనీలున్నాయి. ఏటా 80 నుంచి 90 కంపెనీలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. వీటిలో దాదాపు 3.71 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
 
గ్రామీణ యువత లక్ష్యంగా రూరల్ టెక్
గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం కొత్త విధానంలో పెద్దపీట వేసింది. ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అంతగా అమల్లో లేని రూరల్ బీపీవోల ఏర్పాటుపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇంగ్లిష్‌లో మాట్లాడే నైపుణ్యం, ఉన్నత విద్య పరిజ్ఞానం అవసరం లేకుండానే కేవలం ఇంటర్మీడియెట్, డిగ్రీతో తెలుగులో సంభాషించే అభ్యర్థులకు బీపీవో కాల్ సెంటర్లలో ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

 

ఈ విధానంలో భాగంగా ప్రతి జిల్లాలో రూరల్ టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో జిల్లాకు 2,500 మంది యువతీయువకులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇందుకు జిల్లాకు 10 వేల మంది గ్రామీణ యువతకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)లో శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేయనుంది. డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్‌మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్, వాయిస్ రిలేటెడ్ సర్వీసెస్, ఇ-సర్వీసెస్, కస్టమర్ సపోర్ట్, హెచ్‌ఆర్ ఫైనాన్స్, లీగల్ సర్వీసెస్ తదితర సేవలుండే బీపీవోల ఏర్పాటును ప్రోత్సహించేలా రూరల్ టెక్ పాలసీని రూపొందించారు.
 
డిమాండ్‌కు అనుగుణంగా ఈఎస్‌డీఎం
ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ఈఎస్‌డీఎం పాలసీ రూపొందించారు. ఈ రంగంలో ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశంలో మొత్తం ఎలక్ట్రానిక్ రంగ ఉత్పత్తుల్లో పదో శాతం తెలంగాణ నుంచే ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ రంగం ద్వారా ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది.

 

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల డిమాండ్ అత్యధికంగా ఉంది. కంప్యూటర్లు, టీవీలు, మొబైల్ ఫోన్లు, విడిభాగాల దిగుమతులు పెరిగిపోయాయి. దీంతో భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యం చెల్లించాల్సి వస్తోంది. అందుకే కేంద్రం సైతం ఎలక్ట్రానిక్ పరికరాల తయారీపై పన్ను రాయితీలు ప్రకటించింది. అందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కొత్త విధానం తయారు చేశారు. ఐటీలో శరవేగంగా విస్తరించిన రంగం యానిమేషన్, గేమింగ్. దీనికున్న ప్రత్యేకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలు, కంపెనీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement