సాక్షి, అమరావతి: వచ్చే నెలలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ రానుండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఏపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రంగానికి చెందిన మూడు సంస్థలు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిట), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడీటీ)లకు ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను త్వరలో సీఈవోలుగా నియమించనుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సీఈవోను ఎంపిక చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: బోస్‌కు సముచిత స్థానం)
► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రమోటింగ్ ఏజెన్సీగా అపిట వ్యవహరిస్తుంది.
► కొత్త కొత్త పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ సొసైటీ కృషి చేస్తుంది.
► తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐడీటీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులను అందిస్తుంది.
► ఇలా మూడు సంస్థలకు సమర్థవంతమైన కొత్త సీఈవోలను ఎంపిక చేయడం ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై సర్వే
కృష్ణా, ప.గోదావరి జిల్లాల్లో 27 ప్రాంతాల్లో అధ్యయనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సైసెఫ్ (సెంటర్ ఫర్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ) కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజుల క్రితం సర్వే కార్యక్రమాలను పూర్తి చేసింది. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఆరుగురు నిపుణులు 27 ప్రాంతాలను 10 రోజులు పరిశీలించారు. మత్స్యకారులకు వేటలో లభిస్తున్న మత్స్య సంపద, మత్స్యసంపద నిల్వ, మార్కెటింగ్ పరిస్ధితులను అధ్యయనం చేశారు. మత్స్యకారుల మరపడవలు, పడవలు లంగరు వేసుకోడానికి వార్ఫు, ఫ్లాట్‌ఫారాలు, కోల్డుస్టోరేజి ప్లాంట్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి ఏర్పాటు తరువాత ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు ఉంటుంది, మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయి అనే అంశాలపైనా పరిశీలన చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, ఈలచెట్ల దిబ్బ, ఎదర్లంక, గొల్లలమోద, క్యాంప్‌బెల్‌పేట, పల్లెతుమ్మలపాలెం, ప.గో. జిల్లా దెయ్యపుదిబ్బ వంటి ప్రాంతాలపై అధ్యయనం చేశారని మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖరం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment