kona sashidhar
-
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుతో ఎలక్ట్రానిక్ పద్ధతిన వినియోగదారుల రేషన్ కార్డుల అనుసంధానం చేసే (ఈ–కేవైసీ) గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మంగళవారం ప్రకటించారు. లబ్ధిదారులెవరూ ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ–కేవైసీ నమోదు గడువు ఆగస్టు 31తో ముగిసింది. వరుస సెలవులు, పండుగలు రావడం, సర్వర్లు సరిగా పని చేయక పలు చోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు పని చేయలేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గడువు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌తో అనుసంధానం అవసరం లేదన్నారు. ఆపై వయసున్న పిల్లలకు సెప్టెంబర్ వరకు గడువు ఉందని, పెద్దలు మాత్రం సెప్టెంబర్ 15లోగా చేయించుకోవచ్చని వివరించారు. ఇవీ చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్ ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. -
మూడు సంస్థలకు కొత్త సీఈవోలు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్ పాలసీ రానుండటంతో అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఏపీ ప్రభుత్వం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రంగానికి చెందిన మూడు సంస్థలు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిట), ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ (ఐఐడీటీ)లకు ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్న వ్యక్తులను త్వరలో సీఈవోలుగా నియమించనుంది. ఒక్కొక్క సంస్థకు సంబంధించి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సీఈవోను ఎంపిక చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. (చదవండి: బోస్‌కు సముచిత స్థానం) ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రమోటింగ్ ఏజెన్సీగా అపిట వ్యవహరిస్తుంది. ► కొత్త కొత్త పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇన్నోవేషన్ సొసైటీ కృషి చేస్తుంది. ► తిరుపతి కేంద్రంగా ఉన్న ఐఐడీటీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులను అందిస్తుంది. ► ఇలా మూడు సంస్థలకు సమర్థవంతమైన కొత్త సీఈవోలను ఎంపిక చేయడం ద్వారా ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై సర్వే కృష్ణా, ప.గోదావరి జిల్లాల్లో 27 ప్రాంతాల్లో అధ్యయనం సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన జట్టీలు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సైసెఫ్ (సెంటర్ ఫర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ) కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు రోజుల క్రితం సర్వే కార్యక్రమాలను పూర్తి చేసింది. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి ఇంజనీరింగ్, ఫిషరీస్ విభాగాలకు చెందిన ఆరుగురు నిపుణులు 27 ప్రాంతాలను 10 రోజులు పరిశీలించారు. మత్స్యకారులకు వేటలో లభిస్తున్న మత్స్య సంపద, మత్స్యసంపద నిల్వ, మార్కెటింగ్ పరిస్ధితులను అధ్యయనం చేశారు. మత్స్యకారుల మరపడవలు, పడవలు లంగరు వేసుకోడానికి వార్ఫు, ఫ్లాట్‌ఫారాలు, కోల్డుస్టోరేజి ప్లాంట్ల నిర్మాణాలకు అయ్యే ఖర్చుపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి ఏర్పాటు తరువాత ఈ ప్రాంతాల అభివృద్ధి ఏమేరకు ఉంటుంది, మత్స్యకారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయి అనే అంశాలపైనా పరిశీలన చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, ఈలచెట్ల దిబ్బ, ఎదర్లంక, గొల్లలమోద, క్యాంప్‌బెల్‌పేట, పల్లెతుమ్మలపాలెం, ప.గో. జిల్లా దెయ్యపుదిబ్బ వంటి ప్రాంతాలపై అధ్యయనం చేశారని మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖరం తెలిపారు. -
ఐటీకి విశాఖ అనుకూలం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అందమైన ఐటీ సిటీగా విశాఖ అభివృద్ధి చెందనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గురువారం ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే “ఎడ్జ్ కంప్యూటింగ్, ప్రోసెస్ ఆటోమేషన్ త్రూ రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0, కాగ్నెటివ్ టెక్నాలజీ(ఈపీఐసీ)–2020’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధి, ఆధునిక టెక్నాలజీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శశిధర్ మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు విశాఖ అనుకూలమైన ప్రాంతమని, వాటి ఏర్పాటుకు ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు. వైజాగ్ నుంచి ఐటీ సంస్థలు, పరిశ్రమలు తరలిపోతున్నాయనే వదంతులను నమ్మవద్దని, ఎటువంటి ఐటీ కంపెనీలు ఎక్కడికి వెళ్లిపోవడం లేదని స్పష్టం చేశారు. విశాఖ, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. విశాఖను ఐటీ, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిలికాన్ వేలీ సిటీ తర్వాత విశాఖ మాత్రమే ఐటీ రంగానికి అనువుగా ఉంటుందన్నారు. పరిశ్రమలు, ఐటీ రంగాల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను అభివద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి డ్రాఫ్ట్ ఐటీ పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఐవోటీ ఏర్పాటుకు నిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాస్కామ్ సంయుక్తంగా ఆంధ్రా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(ఐవోటీ)ను ఏర్పాటు చేసేందుకు నిధులు విడుదల చేశామని శశిధర్ తెలిపారు. ఆర్ఐఎన్ఎల్ సహకారంతో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ తదితర వాటి అభివృద్ధికి రాష్ట్రంలో రెండో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతమని, దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. ఉత్పత్తి మరింత సులభతరం.. విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కులో ఉత్పత్తులు పెంచేందుకు ఆధునిక ఆటోమేషన్ టెక్నాలజీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ఉక్కు పరిశ్రమ కారణంగా జాతీయ నికర ఉత్పత్తిలో 2 శాతం వాటా చేకూరుతోందన్నారు. ఆధునికీకరణ క్రమంలో ఆటోమేషన్ టెక్నాలజీతో నాణ్యత గల ఉక్కును తయారుచేయడంతో ఉత్పత్తి ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఈ ఆటోమేటివ్ ఎక్విప్మెంట్తో ఉత్పత్తి మరింత సులభతరంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సదస్సు మ్యాగజైన్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్(పర్సనల్) కె.సి.దాస్, క్వాడ్జెన్ వైర్లెస్ సొల్యూషన్స్ చైర్మన్ సి.ఎస్.రావు, ఆర్ఎన్ఐఎల్ డైరెక్టర్ కె.కె.ఘోష్, సదస్సు కన్వీనర్ బి.గోవర్థన్‌రెడ్డి, సీఎస్ఐ విశాఖ చాప్టర్ ట్రెజరర్ ఎ.ఎన్.బిశ్వాల్, వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆటోమేషన్ టెక్నాలజీతో ముందుగానే.. ఆధునిక ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా ముందుగానే మలేరియా ప్రభావిత ప్రాంతాలను కనుగొని, ఎంత మంది ప్రభావితులయ్యారో తెలుసుకోవచ్చని కోన శశిధర్ పేర్కొన్నారు. గతంలో విశాఖ ఏజెన్సీలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని, అటువంటి ఆరోగ్య సమస్యలను ఈ టెక్నాలజీతో ముందస్తుగానే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు, భౌగోళిక పరిస్థితులు, ఇతర ప్రభావిత విషయాలను గుర్తించి ముందుగానే తెలుసుకోవచ్చని వివరించారు. ఈ–ప్రగతి ప్రాజెక్టు ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీతో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు. -
నిస్సహాయ మహిళకు చేయూత
నరసరావుపేటటౌన్: అక్కమ్మ కథ...తీరని వ్యథ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. బాధితురాలికి వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కేతముక్కల అగ్రహారం దళితవాడకు చెందిన కలిసేటి అక్కమ్మ భర్త నుంచి నిరాదరణకు గురై యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పేగులు కాలి పోయాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేనికారణంగా ఆపరేషన్ చేయమని వైద్యులు తేల్చిచెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకొని నిస్సహాయస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె నిస్సహాయతపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు. డీఎంఅండ్‌హెచ్‌వో సూచనతో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి. మోహనశేషు ప్రసాద్ శుక్రవారం అక్కమ్మను పరామర్శించారు. గతంలో జరిగిన వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వడ్లమూడి శ్రీనివాసరావు ఏరియా వైద్యశాల వైద్యమిత్ర రోజా రమణిని అడిగి అక్కమ్మ వివరాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు సా«ధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నట్లు రోజారమణి తెలిపారు. శస్త్రచికిత్స కోసం అక్కమ్మను తిరుపతి పంపేందుకు రవాణా ఖర్చులు భరించడానికి పట్టణంలోని హైలైన్ మొబైల్ షోరూం అధినేత కూనిశెట్టి హనుమంతరావు ఆర్థిక సహాయం చేసేం దుకు ముందుకొచ్చారు. రవాణా ఖర్చును అందిస్తామని హామీ ఇచ్చి సేవా దృక్పథాన్ని ఆయన చాటు కున్నారు. -
కాలం చెల్లిన వాహనాలకు చెక్
గుంటూరు వెస్ట్: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నగరంలో కాలుష్యం అధికంగా ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించాలంటే కాలం చెల్లిన వాహనాలను తీసేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలిచ్చారు. పాత వాహనాలకు సరైన ఇంధనం వాడడం లేదన్నారు. దీంతో కాలుష్యం ఊహకందని విధంగా పెరిగిపోతుందన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశం మందిరంలో జిల్లా కాలుష్య నియంత్రణా మండలి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో విపరీతంగా ట్రాఫిక్ సమస్య పెరిగిపోయిందన్నారు. 2017లో నగరంలో ఒక ఘనపు మీటరుకు దుమ్ము సాంద్రత 66.5 మైక్రో గ్రాములు ఉందన్నారు. దీనిని 60 మైక్రో గ్రాములకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. కాలుష్య నివారణకు జిల్లా కాలుష్య నివారణ మండలి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలు కూడా దీనిపై తమ వంతు బాధ్యతను గుర్తెరగాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డీఆర్వో నాగబాబు, జిల్లా కాలుష్య నియంత్రణా మండలి ఈఈవీఆర్.మహేశ్వరరావు, ఉప రవాణా కమిషనర్ రాజారత్నం, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం. అజయ్‌కుమార్, జిల్లా సరఫరాల అధికారి ఇ.చిట్టిబాబు పాల్గొన్నారు. -
13న కలెక్టర్ జపాన్ పర్యటన
నగరంపాలెం: జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోన శశిధర్, అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ ఫిబ్రవరి 13 నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. సీఆర్డీఏ పరిధిలోని నగరాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి సర్వే చేస్తున్న జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జైకా) సీఆర్డీఏ పరిధిలోని మున్సిపల్, పోలీస్ అధికారులను జపాన్ స్టడీ టూర్‌కు తీసుకెళ్తుంది. ఈ బృందం జపాన్‌లో అమలవుతున్న కాంప్రహెన్సివ్ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ (సీటీటీ)ను ఫిబ్రవరి 15–19 వరకు పరిశీలించనుంది. జపాన్ వెళ్లే బృందంలో కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ (సీఆర్డీఏ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె.నివాస్, సీఆర్డీఏ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్.అరవింద్ ఉన్నారు. వీరు 21న భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జపాన్ వెళ్లనున్న అధికారుల బాధ్యతలకు ఇన్చార్జులకు అప్పగిస్తూ గురువారం జీవో జారీ చేసింది. -
అంతా అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి బ్యూరో: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఓటుకు తూటు!’ కథనంపై ఆయన అధికారులతో సమాలోచనలు జరిపారు. గుంటూరు, నరసరావుపేట ఆర్డీవోలతో ప్రత్యేకంగా చర్చించారు. నరసరావుపేటలో పోలింగ్ బూత్‌ల మార్పుపై ఆరా తీశారు. ఐఆర్ఇఆర్ సర్వేలో లోపాలు ఉంటే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వినుకొండలో ఓటర్ల సంఖ్య తగ్గడంపై కూడా మాట్లాడారు. సత్తెనపల్లిలో ఓట్ల గల్లంతైన విషయంపై సత్తెనపల్లి వీఆర్వో ధనుంజయను హెచ్చరించారు. 14వ తేదీ వరకు సత్తెనపల్లి నుంచి ఓటర్ల చేర్పులు, మార్పులను దగ్గరుండి పరిశీలించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన కొత్త ఓటర్ల జాబితాను మొత్తం ఇవ్వాలని హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌కు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, వైఎస్సార్ సీపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్యతోపాటు పలువురు ముఖ్యనేతలు వినతిపత్రం అందించారు. నరసరావుపేట పట్టణంలో 21 వేల ఓట్లు ఏ పోలింగ్ బూత్‌లో ఉన్నాయో కనుక్కోవడం కష్టంగా ఉందని కలెక్టర్‌కు వివరించారు. గుంటూరు రోడ్డులో ఓటరును ఊరిచి వర ఉన్న కోటప్పకొండ రోడ్డులో ఉండే పోలింగ్ బూత్‌కు మార్చారని తెలిపారు. సత్తెనపల్లి పట్టణంలోనే 9,630 ఓట్లను తొలగించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఐఆర్‌ఈఆర్ సర్వే పేరుతో ఒక వర్గం వారి ఓట్లను కావాలనే తొలగించారని, అందులో కింది స్థాయి అధికారుల పాత్ర ఉందని చెప్పారు. 9,630 ఓట్లకు సంబంధించి 14వ తేదీలోపు గుర్తించి ఫారం–6 ఇవ్వాలంటే కష్టంగా ఉందని, గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ నియోజకవర్గంలో 15 వేల ఓట్లు తొలగించారని బొల్లాబ్రహ్మనాయుడు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బీఎల్వోలు అనుకూలంగా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఓ ఇంట్లో ఆరు ఓట్లు ఉంటే మొత్తం తొలగించారని చెప్పారు. దీనిపై రీసర్వే చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరించారు. -
ఏపీలో 27 మంది ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో 27 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన అధికారుల వివరాలు... తూర్పుగోదావరి కలెక్టర్- అరుణ్ కుమార్ అనంతపురం- కోన శశిధర్ సెర్ఫ్ సీఈవో- సాల్మన్ ఆరోగ్య రాజ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో- లవ్ అగర్వాల్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ముఖ్యకార్యదర్శి- శాలిని మిశ్రా ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్- ఏకే సింఘాల్ పౌరసరఫరాల శాఖ ఎండీ- రామ్ గోపాల్ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి- శశిభూషణ్ కుమార్ భూపరిపాలన ప్రధాన కమిషనర్- అనిల్ చంద్రపునీత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి- విజయ్ కుమార్ బీసీ సంక్షేమ కార్యదర్శి- ప్రవీణ్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి- కె. సునీత కార్మిక శాఖ కమిషనర్-వరప్రసాద్ ఐటీ శాఖ కార్యదర్శి- శ్రీధర్ విపత్తు నిర్వహణ కమిషనర్- ధనుంజయ్ రెడ్డి కార్మిక శాఖ కార్యదర్శి- అనంతరాము తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్- వీవీ చాంద్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్- రామాంజనేయులు మత్స్యశాఖ కమిషనర్- రామశంకర్ నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి- శోభ పార్వతీపురం ఐటీడీఏ పీఓ- బాలాజీరావు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్- ఉదయలక్ష్మి సాధారణ పరిపాలన శాఖ కమిషనర్- కాడ్మియల్ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయం)- ఎంకె మీనా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్- కన్నబాబు పారసరఫరాల కార్పొరేషన్ ఎండీ- కె. రామగోపాల్ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్- కోటేశ్వరరావు