అక్కమ్మను పరిశీలిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ టి. మోహన్ శేషు ప్రసాద్
నరసరావుపేటటౌన్: అక్కమ్మ కథ...తీరని వ్యథ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ కోన శశిధర్ స్పందించారు. బాధితురాలికి వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వోకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కేతముక్కల అగ్రహారం దళితవాడకు చెందిన కలిసేటి అక్కమ్మ భర్త నుంచి నిరాదరణకు గురై యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పేగులు కాలి పోయాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేనికారణంగా ఆపరేషన్ చేయమని వైద్యులు తేల్చిచెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకొని నిస్సహాయస్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె నిస్సహాయతపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు.
డీఎంఅండ్‌హెచ్‌వో సూచనతో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి. మోహనశేషు ప్రసాద్ శుక్రవారం అక్కమ్మను పరామర్శించారు. గతంలో జరిగిన వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వడ్లమూడి శ్రీనివాసరావు ఏరియా వైద్యశాల వైద్యమిత్ర రోజా రమణిని అడిగి అక్కమ్మ వివరాలను సేకరించారు. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు సా«ధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నట్లు రోజారమణి తెలిపారు. శస్త్రచికిత్స కోసం అక్కమ్మను తిరుపతి పంపేందుకు రవాణా ఖర్చులు భరించడానికి పట్టణంలోని హైలైన్ మొబైల్ షోరూం అధినేత కూనిశెట్టి హనుమంతరావు ఆర్థిక సహాయం చేసేం దుకు ముందుకొచ్చారు. రవాణా ఖర్చును అందిస్తామని హామీ ఇచ్చి సేవా దృక్పథాన్ని ఆయన చాటు కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment