రమకు ఆరోగ్యశ్రీలో చికిత్స
మందులు, వైద్య ఖర్చులు అందించాలని కలెక్టర్ ఆదేశం
కరీంనగర్ హెల్త్: అప్పులబాధతో ఆత్మత్యాయత్నం చేసిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మహిళా రైతు కారుపాకల రమకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స అందించనున్నట్లు ఆ పథకం జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ వై.నాగశేఖర్ తెలిపారు. అంధుడైన, ఇద్దరు చిన్నపిల్లలు చేతిలో చిల్లిగవ్వ కూడా లేక.. రమను బతికించాలంటూ దాతలను ప్రాధేయపడుతున్న తీరుపై బుధవారం ‘సాక్షి’ దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ‘నురగ కాసిన పత్తి’ శీర్షికన కథనం ప్రచురించింది. రమ ధీనస్థితి గురించి ‘సాక్షి’ ద్వారా తెలుసుకున్న పాఠకులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రమ తండ్రికి ఫోన్ చేసి సాయమందిస్తామంటూ భరోసా ఇచ్చారు.
ఈ కథనాన్ని చదివిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ రమకు ఆరోగ్యశ్రీ పథకంలో మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కో ఆర్డినేటర్ నాగశేఖర్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ పథకం జిల్లా మేనేజర్ పి.విక్రమ్ బుధవారం జమ్మికుంటలోని శ్రీవిజయసారుు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుడు సురంజన్‌ను అడిగి తెలుసుకున్నారు. రమ కదల్లేని స్థితిలో ఉందన్నందున ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రికి తరలించలేకపోతున్నామని, ఇదే ఆస్పత్రిలో చికిత్స కొనసాగించాలని వైద్యుడు సురంజన్‌ను కోరారు. అవసరమైన మందులను ప్రభుత్వం నుంచి పంపిస్తామని, వైద్యానికి అయ్యే ఖర్చులను ఆరోగ్యశ్రీ పథకం కింద శ్రీవిజయసారుు ఆస్పత్రికి చెల్లిస్తామని కో ఆర్డినేటర్ నాగశేఖర్ తెలిపారు.