ఐటీ ఇన్‌ఫ్రాకు అందలం | AP Govt has taken key decisions to make IT sector grow more rapidly | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఐటీ ఇన్‌ఫ్రాకు అందలం

Published Thu, Jul 1 2021 2:11 AM | Last Updated on Thu, Jul 1 2021 8:18 AM

AP Govt has taken key decisions to make IT sector grow more rapidly - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా భారీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ 2021–24 ఐటీ పాలసీని రూపొందించింది. వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ కాన్సెప్ట్‌ సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ పార్కులో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ల్యాబ్స్, కో–వర్కింగ్‌ స్పేస్, స్టేట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్‌ లైబ్రరీలు, కోవర్కింగ్‌ ప్లేస్‌లను అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌ సిటీలు, ఐటీ పార్కులకు అనుమతులు త్వరితగతిన ఇచ్చే విధంగా పలు చర్యలు తీసుకున్నారు.

మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు
ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. హైఎండ్‌ జాబ్‌ కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000, మిడ్‌ లెవల్‌ జాబ్‌కు రూ.1,12,500, ఎంట్రీ లెవల్‌ జాబ్‌కు రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది. హైఎండ్‌ జాబ్‌ కల్పిస్తే గరిష్టంగా రూ.1,00,000, మిడ్‌ లెవల్‌ జాబ్‌కు రూ.75,000, ఎంట్రీలెవల్‌ జాబ్‌కు రూ.50,000 వరకు చెల్లిస్తారు. ఈ రాయితీని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్‌ రాయితీ, ప్రతి ఉద్యోగికి నెలకు రూ.500 చొప్పు రెండేళ్ల పాటు గరిష్టంగా ఒక సంస్థకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణకు ఉద్యోగికి రూ.10,000 ఒకసారి చెల్లిస్తారు. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ నిధిని ఏర్పాటు చేస్తారు. క్వాలిటీ సర్టిఫికేషన్‌ కోసం అయ్యే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా ఒక సంస్థకు రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రత్యేక రాయితీలు
కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, గిగ్‌ ఎకనామీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నుంచి పని చేసే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగులు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోవడానికి వన్‌టైమ్‌ ఇన్‌సెంటివ్‌ కింద రూ.20,000 అందిస్తారు. అదే విధంగా సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్‌ వర్కర్లకు హార్డ్‌వేర్‌ కొనుగోళ్లలో 50 శాతం.. గరిష్టంగా రూ.20,000 వరకు రాయితీ అందిస్తారు. గిగ్‌ వర్క్‌ర్‌ కనీస వార్షిక టర్నోవర్‌ రూ.3,00,000 ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ లభిస్తుందన్న నిబంధన విధించారు.

భూ కేటాయింపుల్లో పారదర్శకత
► ఐటీ కంపెనీలు, పార్కులకు పూర్తి పారదర్శక విధానంలో భూ కేటాయింపులు జరిపే విధంగా స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించారు. కనీసం రూ.500 కోట్ల పెట్టుబడి.. 5,000 ఎంట్రీ లెవిల్‌ ఉద్యోగాలు కల్పించే మెగా ప్రాజెక్టలకు ప్రత్యేక రాయితీలను అందిస్తారు.
► కనీసం 250 మంది ఉద్యోగులు ఉండి, గత మూడేళ్లుగా రూ.15 కోట్ల టర్నోవర్‌ నమోదు చేస్తున్న సంస్థలకు మాత్రమే భూ కేటాయింపులు చేస్తారు. భూమి కేటాయించిన మూడేళ్లలోగా ఎకరానికి కనీసం 500 ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది.
► ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయాలంటే ఆ కంపెనీ అంతర్జాతీయంగా 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉండాలి. అలాగే వరుసగా మూడేళ్లపాటు రూ.500 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉండాలి. అదే విదేశీ కంపెనీ అయితే ఫార్చున్‌ 1,000 కంపెనీ లేదా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.350 కోట్లు అయ్యి ఉండాలి.
► కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన సంస్థలకు మాత్రమే ఐటీ పార్కుల నిర్మాణానికి అనుమతిస్తారు. గడిచిన మూడేళ్లుగా రూ.25 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉండాలి. ఐటీ పార్కుకు భూమి కేటాయించిన 6 ఏళ్లలోపు ప్రతి ఎకరానికి 500 మందికి ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాలు కల్పించాలి. 
► కనీసం 10 ఎకరాలు కేటాయించి ఉంటే.. వారు అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాలకు వినియోగానికి అనుమతిస్తారు. బుధవారం క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన ఈ పాలసీ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చి మూడేళ్ల పాటు అంటే 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement