సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు గత నాలుగేళ్లుగా వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పలు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. స్టాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ), వీసెజ్‌ల్లో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా 2022–23లో రాష్ట్రంలో రూ.1,649.25 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగినట్లు ఐటీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఎస్‌టీపీఐలో నమోదైన ఐటీ కంపెనీల ద్వారా రూ.972.43 కోట్ల ఎగుమతులు జరగగా వీసెజ్ కంపెనీల ద్వారా రూ.676.82 కోట్ల ఎగుమతులు జరిగాయి.
రూ.5,000 కోట్లపైనే!
2019–20లో ఏపీ నుంచి రూ.1,087.4 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు కాగా నాలుగేళ్లలో 34 శాతం పెరిగాయి. నాలుగేళ్లలో ఎస్‌టీపీఐ కంపెనీల ద్వారా ఎగుమతులు రూ.846.77 కోట్ల నుంచి రూ.972.43 కోట్లకు పెరిగితే వీసెజ్ ద్వారా ఎగుమతులు రూ.240.63 కోట్ల నుంచి రూ.676.82 కోట్లకు చేరుకున్నాయి. ఇంకా పలు ఐటీ కంపెనీల ఆడిటింగ్ పూర్తికాలేదని, ప్రాథమిక సమాచారం మేరకు 2022–23 ఐటీ ఎగుమతుల అంచనాలను రూపొందించినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నా వాటి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ లేకపోవడంతో మన రాష్ట్ర పరిధిలోకి రావడం లేదని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రం నుంచి కనీసం రూ.5,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరుగుతున్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఆర్నెళ్లలో వరుసగా..
ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ కంపెనీలు విశాఖతోపాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కి ముందు రాష్ట్రంలో ఐటీ కంపెనీల సంఖ్య 178 కాగా ఇప్పుడు 372కి చేరుకోవడం గమనార్హం. గత ఆర్నెళ్ల వ్యవధిలో అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్, బీఈఎల్, ఇన్ఫోసిస్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్‌వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ లాంటి డజనుకుపైగా ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటైనట్లు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ (అపిటా) గ్రూపు సీఈవో ఎస్.కిరణ్ కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇవికాకుండా మరికొన్ని కీలక ఐటీ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన కంపెనీల ద్వారా అదనంగా 20,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు.
విస్తరిస్తున్న కంపెనీలు
రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుండటంతో ఇప్పటికే ఏర్పాటైన పలు ఐటీ కంపెనీలు భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటిదాకా విశాఖకు పరిమితమైన టెక్ మహీంద్రా తాజాగా విజయవాడలో కార్యకలాపాలను ప్రారంభించింది. గన్నవరం మేథా టవర్స్‌లో 120 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న కార్యాలయాన్ని టెక్ మహీంద్రా ప్రారంభించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి విశాఖకు విస్తరించగా, విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్‌ఎస్, పల్ససెస్ ఐడీఏ లాంటి 30కిపైగా ఐటీ, ఐటీ ఆథారిత సేవల కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది.
2012లో కేవలం 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు డబ్ల్యూఎన్‌ఎస్ సీఈవో కేశవ్.ఆర్.మురుగేష్ ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన కంపెనీలతోపాటు విస్తరణ ద్వారా గత మూడేన్నరేళ్లలో రాష్ట్రంలో 23,000 మందికి ఐటీ రంగంలో ఉపాధి లభించింది. 2019 నాటికి రాష్ట్రంలో 35,000గా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 58,000కి చేరినట్లు (అపిటా) గ్రూపు సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఐటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విశాఖలో మిలియన్ టవర్ రెండో దశ నిర్మాణ పనులు పూర్తి కాగా తాజాగా రూ.300 కోట్లతో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అదనంగా అదానీ డేటా సెంటర్‌లో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment