సాక్షి, అమరావతి: ఇన్ఫోసిస్, అసెంచర్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొత్తగా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండటంతో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐటీ పెట్టుబడులకు అనువైనవిగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను ప్రమోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
పెద్ద ఐటీ కంపెనీలు విశాఖ, విజయవాడలను ఎంచుకుంటుండగా, చిన్న స్థాయి కంపెనీలు తిరుపతి వైపు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ ఆధారిత సేవలు అందించే ఏడు కంపెనీలు తాజాగా తిరుపతిలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఐజెన్ అమెరికన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, కాన్‌ఫ్లక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్, లోమా ఐటీ సొల్యూషన్స్, మాగంటి సాఫ్ట్‌వేర్, సాగర్ సాఫ్ట్‌వేర్, నెట్ ల్యాబ్ వంటి సంస్థలు కార్యాలయాలను ప్రారంభించనున్నాయి.
ఫ్రెంచ్‌కు చెందిన రాన్‌స్టాండ్ అనే కన్సల్టెన్సీ సంస్థ విశాఖ, తిరుపతిలో కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. మొత్తం ఈ ఎనిమిది కార్యాలయాల ద్వారా 4,720 మందికి ఉపాధి లభించనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించడానికి అవసరమైన వాణిజ్య సముదాయాలను ఏపీ టక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్) సమకూరుస్తోంది. ఈ పరిణామాల పట్ల నిరుద్యోగులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఐటీ పార్కులు
రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
ప్రభుత్వ చర్యలపై కంపెనీలకు నమ్మకం పెరగడంతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాయి. యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు అనువుగా ఉంటాయి. ఈ మూడు చోట్ల అన్ని మౌలిక వసతులతో కూడిన ఐటీ పార్కులను అభివృద్ధి చేయనున్నాం. త్వరలోనే ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విశాఖలో ఒక సదస్సు నిర్వహించనున్నాం.
– ఎం.నంద కిషోర్, ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ (ఏపీటీఎస్)
ఏపీ వైపు ‘ఐటీ’ చూపు
Published Sun, Sep 11 2022 4:16 AM | Last Updated on Sun, Sep 11 2022 4:26 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment