CM YS Jagan Davos Tour: Leading Companies Investments Andhra Pradesh - Sakshi
Sakshi News home page

దావోస్‌లో ఏపీ ధగధగ

Published Tue, May 24 2022 4:00 AM | Last Updated on Tue, May 24 2022 8:55 AM

CM Jagan Davos Tour leading companies Investments Andhra Pradesh - Sakshi

సమగ్ర ఆరోగ్య వ్యవస్థ: దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌పై మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రకటించింది. విశాఖను హైఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్‌ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది. 

స్విస్‌ పార్లమెంటు ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

హై ఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖ
విశాఖను హైఎండ్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలో భాగస్వామి కానున్నట్లు టెక్‌ మహీంద్రా ప్రకటించింది. దావోస్‌లోని ఏపీ పెవిలియన్‌లో టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమై నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు లాంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్‌ యూనివర్సిటీతోపాటు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, 175 స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరిస్తూ వీటిని ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని కోరారు.

విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా ఇంటర్న్‌షిప్, అప్రెంటిషిప్‌ కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గుర్నానీ స్పందిస్తూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్‌ టెక్నాలజీ లాంటి అత్యాధునిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేందుకు హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీతో కలసి ప్రత్యేకంగా పాఠ్యప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. 

దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి  

రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్‌ ప్లాంట్‌
మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్‌ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.

విద్యారంగంలో ‘దస్సాల్‌’ పెట్టుబడులు
విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు.


టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానితో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌ 

ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్‌ సిస్టమ్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్‌ తెలిపారు.

కాకినాడకు జపాన్‌ లాజిస్టిక్‌ దిగ్గజం
సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్‌ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్‌ కంపెనీ మిట్సుయి ఓ ఎస్‌కే లైన్స్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్‌ హబ్, లాజిస్టిక్‌ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్‌

ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు
రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ ముంజల్‌తో సీఎం జగన్‌ చర్చించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్‌ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, హీరో గ్రూప్‌ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి.


సీఎం జగన్‌తో స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య తదితరులు

విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటి వనరులను సమకూర్చడంలో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి కండలేరు నుంచి నీటిని ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అంతకుముందు భారత సంతతికి చెందిన స్విస్‌ ఎంపీ నిక్లాజ్‌ శామ్యూల్‌ గుగెర్‌తో కూడిన స్విస్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్‌ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్‌ భట్టాచార్య కూడా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement