న్యూఢిల్లీ: కొత్త ఆదాయపు శాఖ (ఐటీ) పోర్టల్‌పై ప్రారంభంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు తొలగిపోయినట్లేనని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం గత ఎనిమిది నెలల డేటాను పరిశీలిస్తే.. 2021–22 అసెస్‌మెంట్ ఇయర్‌కు (2020–21 ఆర్థిక సంవత్సరం) సంబంధించి గత ఎనిమిది నెలల్లో (ఫిబ్రవరి 6వ తేదీ నాటికి) పోర్టల్‌పై దాదాపు 6.17 కోట్ల ఐటీ రిటర్నులు (ఐటీఆర్), 19 లక్షల పన్ను ఆడిట్ రిపోర్టులు (టీఏఆర్)లు దాఖలయ్యాయి.
♦ దాఖలైన 6.17 కోట్ల ఐటీ రిటర్నుల్లో 48 శాతం అంటే దాదాపు 2.97 కోట్లు ఐటీఆర్–1కు సంబంధించినవి. 9 శాతం ఐటీఆర్–2కు (56 లక్షలు) ఉద్ధేశించినవి. 13 శాతం అంటే 81.6 లక్షలు ఐటీఆర్–3కి సంబంధించినవి. 27 శాతం ఐటీఆర్–4 (1.65 కోట్లు)కు సంబంధించినవి. 10.9 లక్షలు ఐటీఆర్–5, 4.84 లక్షలు ఐటీఆర్–6కు, 1.32 లక్షలు ఐటీఆర్–7కు సంబంధించినవి. ఇక ప్రధాన ఆడిట్ రిపోర్ట్ దాఖలు సంఖ్య 19 లక్షలుకాగా, ఇతర ఆడిట్ రిపోర్టులు 1.61 లక్షలకుపైగా ఉన్నాయి.
♦ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, ఎటువంటి ఆలస్యం లేకుండా ఐటీఆర్, టీఏఆర్‌లు ఫైల్ చేయాలని పన్ను చెల్లింపుదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లకు సూచిస్తూ, ఆదాయపు పన్ను శాఖ ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్, ట్వీటర్ ద్వారా రిమైండర్‌లను జారీ చేస్తోంది.
♦కార్పొరేట్లు 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2021–22 అసెస్‌మెంట్ ఇయర్) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువును మార్చి 15వ తేదీ వరకూ పొడిగిస్తూ, సీబీడీటీ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆడిట్ నివేదిక, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి గడువును కూడా ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. కార్పొరేట్లకు ఐటీ రిటర్న్ ఫైలింగ్‌కు గడువు పొడిగింపు ఇది మూడవసారి. కోవిడ్ సమస్యలకుతోడు, ఎలక్ట్రానిక్ విధానంలో రిటర్న్ దాఖలులో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో పన్ను చెల్లింపు, తత్సంబంధ ఇతర వర్గాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతూ సీబీడీటీ ఈ నిర్ణయం తెలిపింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ గడువు 2021 డిసెంబర్‌తో పూర్తయిన సంగతి తెలిసిందే.
కొత్త పోర్టల్ కథ ఇదీ...
కొత్త ఐటీ పోర్టల్ అభివృద్ధికి 2019లో ఇన్ఫోసిస్‌కు కేంద్రం రూ.4,242 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది. 2019 జనవరి నుంచి 2021 జూన్ మధ్య రూ.164.5 కోట్లు చెల్లించింది. 2021 జూన్ 7న కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ప్రారంభమైంది.
ఇన్ఫోసిస్ అభివృద్ధి చెందిన పోర్టల్ తొలినాళ్లలో తీవ్ర అవాంతరాలు నెలకొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దాఖలు చైసిన రిటర్నులను సరిదిద్దుకోలేకపోవడం (రెక్టిఫికేషన్), రిఫండ్ ఏ దశలో ఉందో తెలుకోలేకపోవడం, 2013–14 అసెస్‌మెంట్ సంవత్సరానికి ముందు నాటి రిటర్నులను చూసే అవకాశం లేకపోవడం వంటివి వీటిల్లో కొన్ని.
తమకు ఎదురవుతున్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో వీటిని పరిష్కరించాలని ప్రభుత్వం తొలుత ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులను కోరింది. అయినా అవి పరిష్కారం కాలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ 2021 ఆగస్ట్ 23న ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరీఖ్‌కు సమన్లు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారులతో ఇన్ఫోసిస్ సీఈవో ఆధ్వర్యంలోని బృందం సమావేశమైంది. అందులో సమస్యల పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. సెప్టెంబర్ 15 నాటికి అన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పలు దఫాలు పొడిగిస్తూ వచ్చింది. సెప్టెంబర్ 15 నాటికి పూర్తిగా సమస్యలు తొలగిపోనప్పటికీ, క్రమంగా వీటిని ఇన్ఫోసిస్ సరిదిద్దింది.
ఫామ్స్.... ఎవరికి ఏమిటి?
ఐటీఆర్ ఫామ్ 1 (సహజ్), ఐటీఆర్ ఫామ్ 4 (సుగమ్)లు భారీ సంఖ్యలో ఉండే చిన్న మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఉద్దేశించినవి. రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తి, అలాగే జీతం, ఒక ఇంటి ఆస్తి, ఇతర వనరుల (వడ్డీ, మొదలైనవి) నుండి ఆదాయాన్ని పొందే వ్యక్తి సహజ్‌ను దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి ద్వారా మొత్తం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు, హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభక్త కుటుంబాలు), సంస్థలు ఐటీఆర్–4దాఖలు చేయవచ్చు. వ్యాపారం, వృత్తి నుండి లాభాలుగా పొందే వ్యక్తులు ఐటీఆర్–3ని దాఖలు చేస్తారు. ఎల్‌ఎల్‌పీ (లిమిటెడ్ లయబుల్ పార్ట్‌నర్‌షిప్), వ్యాపారాలు, ట్రస్టులు ఐటీఆర్ 5,6,7 ఫామ్స్‌ను దాఖలు చేస్తారు. వ్యాపారం, వృత్తి నుండి ఆదాయం కాకుండా ఇతర ఆదాయాన్ని పొందేవారు ఐటీఆర్ ఫామ్ 2ను దాఖలు చేయవచ్చు. జీతం, పెన్షన్ నుండి వచ్చే ఆదాయం. ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం (ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తి నుండి వచ్చే ఆదాయం) పొందేవారు ఈ కోవలోకి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment