ఐటీకి అపారమైన అవకాశాలు | CM KCR it policy starts in hyderabad | Sakshi
Sakshi News home page

ఐటీకి అపారమైన అవకాశాలు

Published Tue, Apr 5 2016 3:32 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఐటీకి అపారమైన అవకాశాలు - Sakshi

ఐటీకి అపారమైన అవకాశాలు

►  నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ
► నాలుగు అనుబంధ పాలసీలూ ఆవిష్కరణ
► కలసికట్టుగా అభివృద్ధి చెందుదాం
► ఐటీ కంపెనీలు, పెట్టుబడిదారులకు ఆహ్వానం
► అవినీతికి తావు లేదు.. అడ్డంకులు అసలే లేవు
► పారిశ్రామిక విధానాన్ని అవినీతి రహితంగా అమలు చేస్తున్నాం
► గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యం అద్భుతం: గవర్నర్
► ప్రపంచస్థాయి ఐటీ హబ్‌గా ఎదగాలి: నారాయణమూర్తి

 సాక్షి, హైదరాబాద్ :  ‘తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి.. కలసి రండి.. కలసికట్టుగా అభివృద్ధి చెందుతాం..’ అని ఐటీ కంపెనీలు, ఔత్సాహిక పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం విలువలను విశ్వసిస్తుందని.. విలువలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏడాది కింద ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని నూటికి నూరు శాతం అవినీతి రహితంగా, పెట్టుబడిదారులకు పెన్నిధిగా అమలు చేసి చూపించామని చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో తెలంగాణ నూతన ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గవర్నర్ నరసింహన్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, పలువురు ఐటీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ప్రధాన పాలసీతో పాటు ఇన్నోవేషన్ పాలసీ, గేమింగ్ యానిమేషన్  (ఇమేజ్) పాలసీ, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ, రూరల్ టెక్నాలజీ పాలసీలను కూడా ప్రభుత్వం ఇదే వేదికపై ప్రకటించింది. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆశించిన పురోగతి సాధించిం దని.. ఇక ముందు మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
 
మాట నిలబెట్టుకున్నాం..
20 నెలల కిందే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎంతో శ్రమిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఏడాది కింద తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించాం. అప్పుడు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. అప్పటికే ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాల్లో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులిచ్చే విధానాలున్నా.. పలు సమస్యలున్నాయి. కానీ తెలంగాణలో ఒక్క అడ్డంకి కూడా ఉండదని, పెట్టుబడిదారుల పెన్నిధిగా ఉంటుందని అదే రోజు చెప్పాను. ఇప్పటివరకు 1,691 కంపెనీలకు అనుమతులిచ్చాం. అందులో 883 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటికీ నిర్ణీత 15 రోజుల గడువులోనే లేనిపోని చిక్కులు, అవినీతికి తావు లేకుండా అనుమతులు జారీ చేశాం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణ ఎంతో ఆకర్షణీయమైన ప్రాంతం. భౌగోళికంగా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులకు అనుకూలం. ప్రజల ఆదరాభిమానాలున్న కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్. ఐటీలో పెట్టుబడులకు ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయి. అందుకు మీ సహాయ, సహకారాలు అందించండి. పాలనాపరమైన  చిక్కులుండవు. అవినీతికి తావుండదు. తెలంగాణకు రండి.. పెట్టుబడులు పెట్టండి..’’ అని పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్, మణిపాల్ గ్లోబల్‌టెక్ అధినేత మోహన్‌దాస్ పాయ్, ఇంటెల్ దక్షిణాసియా ఎండీ దేబ్‌జానీ ఘోష్, ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధి పంకజ్ మొహిందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 కొత్త విధానం భేష్: నరసింహన్
 సాంకేతిక విజ్ఞానం పట్టణాలకే పరిమితమైన తరుణంలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే లక్ష్యంతో ఐటీ విధానాన్ని రూపొందించటం హర్షనీయమని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాలు వృద్ధి చెందితేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని... సాంకేతిక విజ్ఞానం గ్రామీణ ప్రాంతాలకు చేరితేనే ఈ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఐటీవిధానాన్ని గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానించాలని నిర్ణయించినందుకు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

 నంబర్ వన్ చేస్తాం: మంత్రి కేటీఆర్
 ఐటీ రంగంలో హైదరాబాద్ గత 25 ఏళ్లుగా రెండో స్థానంలో ఉందని... త్వరలోనే నంబర్‌వన్ స్థానానికి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఐటీ రంగానికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ యువతను ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీని రూపొందించామని పేర్కొన్నారు.

 వినయంతో అభివృద్ధి: నారాయణమూర్తి
 ప్రపంచంలోనే అత్యున్నతమైన సిలికాన్ వ్యాలీ, బీజింగ్, టోక్యోలాంటి ఐటీ హబ్‌లతో పోటీపడాలనే లక్ష్యంతో తెలంగాణ ముందడుగేయాలని ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సూచించారు. ప్రతి నిర్ణయం పారదర్శకంగా, వేగంగా, విశాల దృ క్పథంతో తీసుకోవాలన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, సాంకేతిక విజ్ఞానం ఎంత ఎదిగినా మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వినయంతో అభివృద్ధి సాధించాలని సూచించారు.

 కీలక ముందడుగు: వీకే సారస్వత్
 తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలు అభివృద్ధి వైపు కీలకమైన ముందడుగని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పాలసీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియాకు చాలా అనుకూలంగా ఉందన్నారు. స్టార్టప్ కంపెనీలకు అందిస్తున్న ప్రోత్సహకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
 

 జిల్లాలకూ విస్తరించాలి: బీవీఆర్ మోహన్‌రెడ్డి
 బంగారు తెలంగాణ సాధనలో అందరం భాగస్వాములం కావాలని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. డిజిటల్ తెలంగాణ సాధించే లక్ష్యంలో తమ వంతుగా మూడేళ్లలో రూ.10కోట్లు ఖర్చు పెడతామని వెల్లడించారు. ఐటీ కంపెనీలన్నీ తెలంగాణలోని మిగతా తొమ్మిది జిల్లాలకు విస్తరించాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటోందని, ఇక్కడి అధికారులు, పాలనా వ్యవస్థ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement