‘రియల్’ రయ్.. రయ్..
♦ దిగ్గజ కంపెనీల రాకతో పెరిగిన ఆదాయం
♦ భారీగా నమోదైన రిజిస్ట్రేషన్లు
♦ రాష్ట్ర ఖజానాకు జిల్లానే మూలస్తంభం
♦ పూర్వవైభవం దిశగా రియల్‌ఎస్టేట్
♦ రాజకీయ స్థిరత్వంతో పెరిగిన వ్యాపారం
♦ 27 శాతానికిపైగా నమోదైన వృద్ధి రేటు
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. రెండేళ్లకాలంలో ఎన్నడూలేనంతగా పరుగులు పెడుతోంది. 27శాతానికిపైగా వృద్ధి రేటు సాధించింది. రాజకీయ స్థిరత్వం.. ప్రపంచ శ్రేణి సంస్థల తాకిడితో జిల్లాలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుంది. అమెజాన్, ఆపిల్, గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల రాకతో రియల్‌ఎస్టేట్‌కు పూర్వవైభవం వస్తోంది. రాజకీయ అనిశ్చితితో గతేడాది వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ రంగం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆశావహ వాతావరణంతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ పాలసీ, నూతన పారిశ్రామిక విధానంతో అనుమతులను సరళతరం చేయడం.. పరిశ్రమల స్థాపనలకు అనువైన వాతావరణం సృష్టించడం.. పెట్టుబడిదారుల్లో ఆశలు చిగురింపజేశాయి. ఇదే భరోసా సామాన్యుల్లో కూడా కలగడంతో జిల్లాలో స్థలాల క్రయవిక్రయాలు గణనీయంగా పెరిగాయి.
మొన్నటివరకు వేచిచూసే ధోరణిని అవలంబించిన దిగువ, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2015-16లో రియల్ ఎస్టేట్‌కు రెక్కలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1,759.62 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో జిల్లా మూలస్తంభంగా నిలిచింది. జిల్లాలోని రెండు రిజిస్ట్రేషన్ల విభాగాలకు రూ.2,212.93 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఈ లక్ష్యసాధనలో జిల్లాలో వెనుకబడినప్పటికీ, 2014-15తో పోలిస్తే (రూ.1,383.86 కోట్లు) రూ.375.76 కోట్ల రాబడిని సమకూర్చుకోగలిగింది. ఈ మేరలో ఆదాయం రావడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరపడడమే. 2009 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేవడం.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో రియల్టీ రంగం అటుపోట్లను ఎదుర్కొంది.
ఈ క్రమంలోనే స్థలాల కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణాలపై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొంత వెనుకడుగు వేశారు. దీనికి కొనసాగింపుగానే రాష్ట్ర విభజన జరగడంతో గతేడాది క్రితం వరకు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో అచితూచి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఇటీవల బహుళ జాతి సంస్థలు భాగ్యనగరంవైపు దృష్టి సారించడం.. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ కంపెనీలు నగర శివార్లలో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. వీటితోపాటు విమానయానరంగంలో బడా కంపెనీలుగా పేరొందిన ఎయిర్‌బస్, టాటా తదితర సంస్థలు విమాన విడిభాగాల తయారీ హబ్‌లను జిల్లాలో ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇవేకాకుండా మొబైల్, టీవీ ఉపకరణాల తయారీ సంస్థలు కూడా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడంతో రియల్టీ జోరందుకుంది. ఈ క్రమంలోనే బడా బిల్డర్లు శివార్లలో అత్యాధునిక ప్రమాణాలతో విల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ర్ట విభజనతో ఏపీ రాజధాని అమరావతి వైపు ఆశగా చూసిన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు కూడా అక్కడ నెలకొన్న రాజకీయ వాతావరణం.. ఆసాధారణంగా పెరిగిన భూముల ధరలతో రియల్ వ్యాపారానికి హైదరాబాదే మేలనే నిర్ణయానికి రావడం కూడా జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడానికి కారణమైంది.