హైదరాబాద్: భౌగోళికంగా, వాతావరణపరంగా ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో తెలంగాణ ఐటీ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేశామని ఆయన అన్నారు.
ఈ ఏడాదిలో కొత్తగా రాష్ట్రానికి 1691 కంపెనీలు వచ్చాయని చెప్పారు. అన్ని పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామన్నారు. 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రతిరంగంలో అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీపై కేసీఆర్ సమీక్ష
జీహెచ్ఎంసీపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11, 12 తేదీల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్లమ్లెస్ సిటీగా హైదారాబాద్ను మార్చాలని ఆయన అన్నారు. ప్రతి 5 వేల మందికి ప్రజా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. కాగా, ఈ సమీక్ష సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
'ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం'
Published Mon, Apr 4 2016 6:23 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement