జవహర్‌నగర్‌ డంప్‌ యార్డు నుంచి కరెంట్‌ | Electricity Production From Jawahar Nagar Dump Yard | Sakshi
Sakshi News home page

‘చెత్త’ నుంచి వెలుగులు..

Published Tue, Oct 6 2020 9:31 AM | Last Updated on Tue, Oct 6 2020 1:34 PM

Electricity Production From Jawahar Nagar Dump Yard - Sakshi

సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించాయి. ఎందుకూ పనికిరాదని పారేసిన చెత్త నుంచే వెలుగులిచ్చే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరం నుంచి వెలువడుతున్న చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ పని ప్రారంభించింది. లాంఛనప్రాయ ప్రారంభోత్సవం ఇంకా జరగకపోయినా.. గతనెల నుంచే జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ కేంద్రంలో ఉన్న ప్రత్యేక విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ నుంచి రాంకీ సంస్థ వేస్టేజ్‌ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు 51 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌ నిలిచింది.

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెత్తను వినియోగించి రోజుకు 19.8  మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకుగాను ఒకటి మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి వచ్చింది. దీంతో  దాదాపు 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. దాన్ని ప్రభుత్వ విద్యుత్‌పంపిణీ సంస్థకు నిర్ధారిత ధరకు సరఫరా చేస్తోంది. రెండో బాయిలర్‌కూడా వినియోగంలోకి వస్తే 19.8 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి కోసం దశాబ్దాలుగా ఆలోచనలున్నా.. ఇప్పటి వరకు ఫలితమివ్వలేదు. వివిధ సంస్థలు చేపట్టిన పనులు పలు కారణాలతో ముందుకు సాగలేదు.

నగరంలో వెలువడే  చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించేందుకు రాంకీ సంస్థ 2009లో జీహెచ్‌ఎంసీతో 25 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎంఎస్‌డబ్లు్యఎం) ప్రాజెక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా  తొలిదశలో 19.8 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. రెండో దశలో మరో 28.2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా చర్యలు చేపట్టారు. రెండు దశలు పూర్తయితే జవహర్‌నగర్‌కు తరలిస్తున్న చెత్తనుంచి 48 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. (చదవండి: కరోనా టీకా వీరికే ఫస్ట్‌..)

పర్యావరణహిత టెక్నాలజీతో..

  • పర్యావరణహితమైన థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంట్‌ను రాంకీ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. దాని ద్వారానే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది.
  • ఈ టెక్నాలజీతో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లు ఢిల్లీలో 3, జబల్‌పూర్‌లో ఒకటి ఉన్నాయి. ఢిల్లీ లోని 3 ప్లాంట్లనుకూడా రాంకీయే నిర్వహిస్తోంది. వాటి ద్వారా 59 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.  
  • విద్యుత్‌ ఉత్పత్తికి ఉపకరించేలా శుద్ధిచేయగా మండే గుణమున్న చెత్తను రెఫ్యూజ్‌ డిరైవ్‌ ఫ్యూయెల్‌(ఆర్‌డీఎఫ్‌)గా వ్యవహరిస్తారు.
  • జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో ఏళ్ల తరబడి గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్వహించే చర్యలతో ఇప్పటి వరకు 75,19,278 మెట్రిక్‌ టన్నుల చెత్తను ట్రీట్‌ చేశారు. దాదాపు 125 ఎకరాల్లోని చెత్తగుట్టలకు రూ.144 కోట్లతో చేపట్టిన క్యాపింగ్‌ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. (చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో ప్లాన్‌ మార్చిన అభ్యర్థులు)


లక్ష్యం 100 మెగావాట్లు..
రోజురోజుకూ పెరుగుతున్న గ్రేటర్‌ నగరం.. విస్తరిస్తున్న కాలనీలు.. వెలువడుతున్న వ్యర్థాలతో చెత్త సమస్యలు పెరగకుండా, మరోవైపు చెత్తను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా నాలుగైదేళ్లలో దాదాపు 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని అధికారులు అంచనా వేశారు.

  • ఇవన్నీ వెరసి మొత్తం 73 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుండగా, గ్రేటర్‌లో వెలువడే చెత్తనుంచి మరో 27 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కూడా అవకాశముందని అంచనా.  
  • ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ) సూచన కనుగుణంగా  రాంకీ సంస్థ  దుండిగల్‌లో మరో 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి  కార్యాచరణ రూపొందించింది.


చెత్త సమస్య తగ్గుతుంది...
విద్యుత్‌ ఉత్పత్తి వల్ల జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డులో చెత్త పరిమాణం తగ్గుతుంది. ఆర్థికంగా కూడా ప్రయోజనమే. జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు ప్రస్తుతం దాదాపు 6 వేల మెట్రిక్‌టన్నుల చెత్తను తరలిస్తుండగా, దీన్ని 3 వేల మెట్రిక్‌ టన్నులకు తగ్గించాలనేది లక్ష్యం. అందుకుగాను నగర శివార్లలో మరికొన్ని చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటుచేస్తాం. అంతే కాకుండా ఎక్కడి చెత్తను  అక్కడే కంపోస్టు ఎరువుగా మార్చేందుకు సర్కిళ్ల స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. తద్వారా జవహర్‌నగర్‌కు తరలించే చెత్త పరిమాణం తగ్గుతుంది.  
– రాహుల్‌ రాజ్, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement