సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది.
కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది.
పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment