కరెంట్‌ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan Review Meeting Over Coal Crisis In Amaravati | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతల్లేకుండా చర్యలు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Oct 15 2021 2:01 AM | Last Updated on Fri, Oct 15 2021 7:59 AM

AP CM YS Jagan Review Meeting Over Coal Crisis In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆయన చర్చించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా దానిని తెప్పించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే, కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతలేదని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడున్న థర్మల్‌ ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. కృష్ణపట్నం, ఎన్‌టీటీపీఎస్‌ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అలాగే.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని ఆయన సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.

దేశవ్యాప్తంగా ప్రమాదంలో 112 థర్మల్‌ కేంద్రాలు
ఇక బొగ్గు కొరతతో దేశంలోని 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 112 కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. ఇందులో 17 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తి నిలిపివేయగా, 27 ప్లాంట్లలో ఒకరోజు, 20 ప్లాంట్లలో రెండు రోజులు, 14 ప్లాంట్లలో మూడు, మరో 14 ప్లాంట్లలో నాలుగు, 12 ప్లాంట్లలో ఐదు, ఏడు ప్లాంట్లలో ఆరు, ఒక ప్లాంటులో ఏడు రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో థర్మల్‌ ప్లాంట్లను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. బొగ్గు కొరత కారణంగా కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) విద్యుత్‌ సంస్థలకు మినహా మిగిలిన అందరికీ బొగ్గు సరఫరాను పూర్తిగా నిలిపేసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, నిల్వలు మామూలు స్థాయికి వచ్చేవరకూ ప్రాధాన్యాన్ని బట్టి సరఫరా చేయాలన్నది కంపెనీ నిర్ణయమని అధికార వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే.. విద్యుత్‌ ప్లాంట్లు మినహా మిగిలిన ఏ ఇతర సంస్థల్నీ బొగ్గు ఈ–ఆక్షన్‌లోకి కూడా అనుమతించవద్దని కోల్‌ ఇండియా తన అనుబంధ సంస్థలకు గురువారం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. దసరా తర్వాత కార్మికులు సెలవుల నుండి తిరిగి రాగానే ఉత్పత్తిని పెంచాలని సీఐఎల్‌ భావిస్తోంది. 

ఏపీలో బొగ్గు నిల్వలు మెరుగు
సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ బుధవారం నాటి రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కృష్ణపట్నం)లో 65,400 మెట్రిక్‌ టన్నులకు పెరిగింది. ఇది ఐదు రోజుల వరకూ సరిపోతుంది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టీటీపీఎస్‌)లో 20,900 మెట్రిక్‌ టన్నులు ఉంది. ఇది ఒక రోజుకు వస్తుంది. రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కి 75,700 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉండటంతో ఇది కూడా ఐదు రోజులు విద్యుత్‌ ఉత్పత్తికి సరిపోతుంది. సింహాద్రిలో ఉన్న 21,300 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఒక రోజుకు ఉపయోగపడుతుంది. అయితే, మంగళవారంతో పోలిస్తే బుధవారానికి రాష్ట్రంలో బొగ్గు నిల్వలు కొంతమేర పెరిగాయి. ఇక రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు పనిచేయాలంటే రోజుకి 42 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం కాగా.. బుధవారం 14 ర్యాకులలో 53,245 మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా అయ్యిందని ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. 

పూర్తిస్థాయిలో జలవిద్యుత్‌ వినియోగం
మరోవైపు.. జల విద్యుత్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీంతో జెన్‌కోకు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి రోజూ 25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వస్తోంది. శ్రీశైలం కుడిగట్టు కాలువపై 770 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు యూనిట్ల ద్వారా 15 మిలియన్‌ యూనిట్లు, సీలేరు నుంచి 8 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా కేంద్రాల నుంచి మరో రెండు మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి జరుగుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుతం 185 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. కేవలం 3.34 మిలియన్‌ యూనిట్ల మేర మాత్రమే లోటు ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement