న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్‌ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే.
అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్‌వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment