నిన్నా మొన్నటి వరకు ఆ పండు ఎందుకూ పనికిరానిది. గింజకున్న విలువ పండుకు లేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలతో దానికీ మంచిరోజులొచ్చాయి. ఇప్పుడా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇలా దశ తిరిగిన జీడిమామిడి రైతుల కథాకమామిషు ఏమిటంటే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం 3.31 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతోంది. 90 శాతం పంట ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో సాగవుతోంది. పైసా విలువ కూడా చేయదని పిక్క తీసేసిన జీడి పండు చెత్తకుప్పల పాలయ్యేది. ఇలా ఎకరాకు 4 టన్నుల చొప్పున జీడి పండు వృధా అయ్యేది. కానీ, మూణ్నెల్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా గంగవరం మండలానికి చెందిన ‘వైఎస్సార్ చేయూత’, ‘ఆసరా’ మహిళా లబ్ధిదారులు వినూత్నంగా ఆలోచించారు. జీడి మామిడి పండును ప్రాసెసింగ్ చేయడం ద్వారా జ్యూస్, సోడా, జామ్, పచ్చళ్లు తయారుచేసే ఓ కుటీర పరిశ్రమకు శ్రీకారం చుట్టారు.
అదే ఇప్పుడు రాష్ట్రంలో కోట్ల రూపాయల కొత్త సంపద సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న టానేజర్ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి సాంకేతిక సహకారం అందించింది. దీంతో వీరంతా కలిసి రూ.18 లక్షల ఖర్చుతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు. ముగ్గురు మహిళలు రైతుల నుంచి పండు సేకరించడంతో పాటు, ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇలా దేశంలోనే మొట్టమొదటిసారి జీడి పండు నుంచి ఉప ఉత్పత్తులను తయారుచేసే ప్రక్రియకు ఇక్కడ బీజం పడింది. మొదటగా జ్యూస్, సోడాల తయారీ మొదలుపెట్టారు.
వీటి అమ్మకాల ద్వారా ఈ మూడున్నర నెలల్లో రూ.3.68 లక్షల ఆదాయం పొందారు. వృధాగా పడేసే ఆ జీడి పండును గంగవరం మండలంలో 240 మంది జీడి మామిడి రైతుల నుంచి కిలో రూ.1.50–రూ.2 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దానిని ప్రాసెసింగ్ చేసి 15,400 యూనిట్ల జ్యూస్, సోడా బాటిళ్లను తయారుచేశారు. తద్వారా ఒక్కో జీడి మామిడి రైతుకు రూ.3 వేల చొప్పున అదనపు ఆదాయం రాగా.. మూడున్నర నెలల్లో నిర్వహణ ఖర్చులు పోను రూ.లక్ష నికర ఆదాయాన్ని మహిళలు పొందారు.
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా శాశ్వత జీవనోపాధి కోసం 23లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరికీ విడతల వారీగా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రభుత్వమే అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వ్యాపార సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌లోనూ సహకరిస్తుంది. అవసరమైతే బ్యాంకుల ద్వారా అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఆర్గానిక్ బట్టల తయారీ, చిరుధాన్యాల మార్కెటింగ్‌లో కొత్త అవకాశాలు కల్పించేందుకు ఆలోచిస్తున్నాం. ఇందుకోసం వాల్‌మార్ట్ వంటి సంస్థలతో ఒప్పందానికి సర్కారు పరిశీలిస్తోంది.
– ఇంతియాజ్, సెర్ప్ సీఈవో
600 కేజీల పండు ద్వారా అదనపు ఆదాయం
మా పొలంలోని జీడి మామిడి పండ్లు సుమారు 600 కేజీలను విక్రయించడంవల్ల ఈ ఏడాది రూ.1,200లు అదనపు ఆదాయం లభించింది. అలాగే, ఇందుకు సంబంధించిన కర్మాగారంలో హెల్పర్‌గా పనిచేయడంవల్ల అదనంగా నెలకు రూ.7,000 జీతంగా లభిస్తోంది.
– వై. రాణి, పావని స్వయం సహాయ సంఘం సభ్యురాలు
జీడిమామిడి రైతులకు ఎంతో మేలు
జీడిమామిడి పండ్ల రసంతో ఆపిల్ సోడా, ఆపిల్ సిరప్ తయారుచేసే యూనిట్ నెలకొల్పేందుకు సెర్ప్, టానేజర్ సంస్థ ప్రతినిధులు ఎంతో కృషిచేశారు. ఏజెన్సీలో జీడిమామిడి సాగుచేసే గిరిజన రైతులకు ఆర్థికంగా మరింత ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఉత్పత్తిని మార్కెటింగ్ చేసేందుకు వారపు సంతల్లో అవగాహన కల్పిస్తున్నాం
– కంగల అబ్బాయిదొర, ఎఫ్‌పీఓ, అధ్యక్షులు, గంగవరం మండలం
వివిధ వ్యాపారాల్లో 7.17లక్షల మంది పెట్టుబడి
ఇక రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల్లో 45–60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 24 లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడతల్లో రూ.8,839 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం లబ్ధిచేకూర్చింది. ఇదే సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా కూడా రెండేళ్లలో దాదాపు రూ.12,800 కోట్ల మొత్తాన్ని పొదుపు సంఘాల మహిళలకు అందజేశారు.
మహిళలు ఈ ప్రయోజనాలను ఉపయోగించుకుని 2020–21లో 2.68 లక్షల మంది వివిధ వ్యాపార, జీవనోపాధులు ఏర్పర్చుకున్నారు. వీరిలో 78 వేల మంది కిరాణా దుకాణాలు పెట్టుకుని నెలకు రూ.5 వేల అదనపు ఆదాయం పొందగా.. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలను కొనుగోలు చేస్తే, 70 వేల మంది గొర్రెలు మేకలను కొనుగోలు చేశారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు మరో రూ.1,510 కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4.49 లక్షల మందికి వ్యాపార, జీవనోపాధులు పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటికే 1.06 లక్షల మందికి తోడ్పాటు అందించింది.
వంద కోట్ల అదనపు ఆదాయం
గంగవరం కుటీర పరిశ్రమ ద్వారా తయారైన ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుండడంతో ఈ ప్రాంతంలో ఈ తరహా చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు వీలు ఏర్పడినట్లయింది. రానున్న రోజుల్లో ఈ తరహా పరిశ్రమల సంఖ్య పెరిగి రైతులందరి నుంచి పండు కొనుగోలు చేసే పరిస్థితి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులకే ఏటా రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటుతో లక్షలాది మంది యువతకు, మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment