టోక్యో: వాహన తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్.. భారత్‌లో పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తుండడంతో తయారీని పెంచే ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా టయోటా మోటార్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు బీదడి వద్ద రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఏటా 3.42 లక్షల యూనిట్లు.
ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, లెజెండర్, కామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూజర్ హైరైడర్, హైలక్స్ మోడళ్లను తయారు చేస్తోంది. సుజుకీ కార్పొరేషన్‌తో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా, రూమియన్ మోడళ్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. పూర్తిగా తయారైన వెల్‌ఫైర్, ఎల్‌సీ 300 మోడళ్లను దిగుమతి చేసుకుంటోంది. కొన్ని మోడళ్లకు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది.
దీంతో మెరుగైన డిమాండ్ కారణంగా భారత్‌లో మూడవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. 2023 ప్రారంభంలో కొన్ని మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 30 శాతం పెంచడానికి బీదడిలో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించింది. 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంపెనీ 1,23,939 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ.
డిమాండ్ బలంగా ఉంది..
భారత్‌లో పూర్తి ప్లాంట్ సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోయిచి మియాజాకి జపాన్ మొబిలిటీ షో సందర్భంగా తెలిపారు. దేశంలో సామర్థ్య పెంపుపై తాజా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు మొదలయ్యాయని వెల్లడించారు. ‘కోవిడ్ తర్వాత భారత ఆటోమొబైల్స్ రంగంలో ముఖ్యంగా పెద్ద కార్లకు డిమాండ్ పెరిగింది.
కోవిడ్ తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్ రికవరీ భారత్‌లో చాలా బలంగా ఉంది. కాబట్టి డిమాండ్ కూడా బలంగా ఉందని మేము నమ్ముతున్నాము. మార్కెట్లో పెద్ద కార్ల పట్ల ఆసక్తి క్రమంగా పెరగడం కంపెనీకి మంచి సంకేతం’ అని వివరించారు. భారతీయ కార్ల విపణి చిన్న కార్ల నుండి పెద్ద కార్ల విభాగాలకు మారడం వల్ల మార్కెట్‌ను టయోటా మరింత ఆకర్షణీయంగా మారుస్తుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టయోటాకు సమయం ఆసన్నమైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment