సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గుతోపాటు 5 శాతం బయోమాస్‌ను ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీ తంగా పెరిగిన నేపథ్యంలో బయోమాస్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘బయోమాస్ వినియోగ పాలసీ’లో తాజాగా మార్పులను ప్రకటించింది. 2017 నవంబర్‌లో ప్రకటించిన బయోమాస్ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్ మిల్, ట్యూబ్ మిల్ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయో మాస్‌ను కలిపి వినియోగించాలి.
బౌల్‌మిల్ తరహా థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా రెండేళ్లపాటు 5శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్‌ను వాడాల్సి ఉంటుంది. బాల్ అండ్ రేస్‌మిల్ తరహావి 5 శాతం బ్లెండ్ చేసిన బయోమాస్ పెల్లెట్లను.. బాల్ అంట్ ట్యూబ్ మిల్ తరహా ప్లాంట్లు 5శాతం టొర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లను తప్పనిసరిగా వినియో గించాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా సదరు థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
బయోమాస్ కొరత ఏర్పడకుండా.. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించింది. ఏవైనా థర్మల్ కేంద్రాలు బయోమాస్ వినియోగం నుంచి మినహాయింపు కోరితే.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.
బయోమాస్ అంటే..
వృక్ష, జంతు వ్యర్థాలనే బయోమాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నింటిని పొడిచేసి.. యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే సాధారణ బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు.
► సాధారణ బయోమాస్‌లో తేమను పూర్తిగా తొలగించి, తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్నిరకాల రసాయనాలు కలుపుతారు. వాటిని టోర్రిఫైడ్ బయోమాస్ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి. వీటిని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వినియోగిస్తారు.
సాధారణ పెల్లెట్లు
► మన దేశంలో వార్షికంగా 750 మెట్రిక్ టన్నుల బయోమాస్ లభ్యత ఉందని, పంట వ్యర్థాలను కూడా కలిపితే మరో 230 మెట్రిక్ టన్నుల లభ్యత పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment