తయారీ 50–60 శాతమే | pharma manufacturing down fall due to corona virus | Sakshi
Sakshi News home page

తయారీ 50–60 శాతమే

Published Thu, Apr 9 2020 5:42 AM | Last Updated on Thu, Apr 9 2020 5:42 AM

pharma manufacturing down fall due to corona virus - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా దినసరి కార్మికులు వారివారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. ఉన్నవారు కాస్తా వైరస్‌ భయంతో ప్లాంట్లకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. వెరశి ప్లాంట్ల వినియోగం 50 నుంచి 70 శాతం మాత్రమే నమోదు అవుతోంది. ముందస్తు వేతన చెల్లింపులు, ఆహారం, రవాణా సదుపాయం కల్పించిన భారీ సంస్థల్లో ప్లాంట్ల వినియోగం 70 శాతం వరకు ఉంటే.. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 50–60 శాతం మాత్రమే ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభా వం ఉంటుందని అంటున్నాయి. మార్జిన్లు భారీగా తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల్లో 60%, దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను భారీ కంపెనీలు దక్కించుకున్నాయి.

లాభాలూ కుచించుకుపోతాయి...
కరోనా ప్రభావం ఆరు నెలల వరకు ఫార్మా రంగంపై ఉంటుందని బల్క్‌ డ్రగ్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (బీడీఎంఏ) చెబుతోంది. కార్మికుల కొరత వాస్తవమేనని బీడీఎంఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈశ్వర్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘ఔషధాల కోసం డిమాండ్‌ బాగానే ఉంది. కంపెనీల వద్ద నిల్వలూ ఉన్నాయి. రెండు మూడు నెలల్లో వైరస్‌కు కట్టడి పడ్డా.. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. కంపెనీల ఆదాయాలతోపాటు లాభాలూ కుచించుకుపోతాయి.

ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి భారీ స్థాయి కంపెనీలు నెట్టుకొస్తాయి. చిన్న కంపెనీలకే సమస్య. వీటిల్లో కొన్ని కంపెనీల ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడే అవకాశాలూ లేకపోలేదు’ అని ఆయన వివరించారు. పోర్టుల వద్దా కార్మికుల కొరత ఉందని, ఇది కూడా సమస్యేనని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. 2020–21లో ఫార్మా రంగం పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నట్టు చెప్పారు. చైనాలో సమస్య మొదలవగానే తయారీ విషయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టు లారస్‌ ల్యాబ్స్‌ వెల్లడించింది. కార్మికుల కొరత వంటి సమస్యలు తమకు లేవని వివరించింది.

మార్జిన్స్‌ ఉండే వాటిపై..
భారత ఔషధ రంగానికి ఇది క్లిష్ట సమయమని ప్రముఖ లిస్టెడ్‌ కంపెనీ డైరెక్టర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ‘త్వరలోనే సమస్య నుంచి గట్టెక్కుతాం. భారత్‌ నుంచి ఔషధాల ఎగుమతులకు ఎటువంటి సమస్య లేదు. ఇక్కడి ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. దేశీయంగానూ మార్కెట్‌ ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా అంతా సర్దుకుంటుంది. అంతర్జాతీయంగా ఔషధాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. జూన్‌ నుంచి మార్కెట్‌ గాడిలో పడుతుంది. కంపెనీలు అధిక లాభాలను ఇచ్చే ఔషధాల తయారీపై దృష్టిసారిస్తాయి. ఇదే జరిగితే ఎగుమతుల్లో ఎంత కాదన్నా 10–15 శాతం వృద్ధి సాధిస్తాం. ప్రభుత్వం సైతం ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది’ అని అయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement