Bulk Drug Manufacturers Association
-
బీడీఎంఏ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) టెక్నాలజీ, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ జీడిమెట్ల ఫార్మా క్లస్టర్లో 2023 ఏప్రిల్ నుంచి ఈ కేంద్రం కార్యరూపం దాల్చనుంది. టీఎస్ఐఐసీ ఒక ఎకరం స్థలాన్ని దీర్ఘకాలిక లీజు పద్ధతిన సమకూర్చింది. ఈ ఫెసిలిటీ కోసం హెటిరో గ్రూప్ రూ. కోటి ఆర్థిక సాయం అందించింది. ఇతర సంస్థలు సైతం ఆర్థిక సాయానికి ముందుకు వస్తాయని అసోసియేషన్ భావిస్తోంది. ఔషధ రంగంలో పనిచేస్తున్న మానవ వనరులకు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ సెంటర్లో శిక్షణ ఇస్తారు. అలాగే బీడీఎంఏ సభ్య కంపెనీలు నూతనంగా నియమించుకున్న ఉద్యోగులకు ఇక్కడ ట్రైనింగ్ కల్పిస్తారు. ఆధునిక పరిశోధన, పరీక్షలకు కేంద్ర స్థానంగా ఇది నిలుస్తుందని బీడీఎంఏ తెలిపింది. పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఈ విధంగా సాంకేతిక, శిక్షణ కేంద్రం నెలకొల్పడం దేశంలో తొలిసారి అని పేర్కొంది. ఈ సదుపాయం ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంలో వస్తున్న నూతన పరిశోధనలు, ఆవిష్కరణలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సామర్థ్యం పెంచుకోవడానికి నాలెడ్జ్ సెంటర్‌గా కూడా పని చేస్తుందని అభిప్రాయపడింది. -
ఫార్మా ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు కీలకం
కూకట్పల్లి: దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్య భద్రతకు ముఖ్యమైన ఫార్మా రంగం ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయని, ఔషధాల ఎగుమతుల్లో మూడింట ఒక వంతు రెండు రాష్ట్రాలే చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. శనివారం బాలానగర్‌లోని నైపర్‌లో జరిగిన బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ‘ఫార్మా రంగ ఉత్పత్తిలో వచ్చిన తాజా మార్పులు–పోస్ట్ కోవిడ్ సవాళ్లు, అవకాశాలు’అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేశ్ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ 2021–22లో యూఎస్డీ 24.61 బిలియన్లను అధిగమించి ఎగుమతులు చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 శాతం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో బలమైన ఫార్మాస్యూటికల్ రంగం, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఉందన్నారు. జీడిమెట్ల, పాశ మైలారం, బొల్లారం వంటిపారిశ్రామిక ఎస్టేట్లలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయటం గర్వకారణమని జయేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీడీఎంఈఐ అధ్యక్షుడు అగర్వాల్, భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జాయింట్ సెక్రటరీ యువరాజ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ రామకిషన్, నైపర్ డైరెక్టర్ శశి బాలాసింగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: మండిపోతున్న బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఉందిగా! -
తయారీ 50–60 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్ కారణంగా దినసరి కార్మికులు వారివారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు. ఉన్నవారు కాస్తా వైరస్ భయంతో ప్లాంట్లకు రావడానికి జంకుతున్నారు. దీంతో ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. వెరశి ప్లాంట్ల వినియోగం 50 నుంచి 70 శాతం మాత్రమే నమోదు అవుతోంది. ముందస్తు వేతన చెల్లింపులు, ఆహారం, రవాణా సదుపాయం కల్పించిన భారీ సంస్థల్లో ప్లాంట్ల వినియోగం 70 శాతం వరకు ఉంటే.. చిన్న, మధ్య తరహా కంపెనీల్లో 50–60 శాతం మాత్రమే ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల పనితీరుపై తీవ్ర ప్రభా వం ఉంటుందని అంటున్నాయి. మార్జిన్లు భారీగా తగ్గుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతుల్లో 60%, దేశీయ మార్కెట్లో 50 శాతం వాటాను భారీ కంపెనీలు దక్కించుకున్నాయి. లాభాలూ కుచించుకుపోతాయి... కరోనా ప్రభావం ఆరు నెలల వరకు ఫార్మా రంగంపై ఉంటుందని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) చెబుతోంది. కార్మికుల కొరత వాస్తవమేనని బీడీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఔషధాల కోసం డిమాండ్ బాగానే ఉంది. కంపెనీల వద్ద నిల్వలూ ఉన్నాయి. రెండు మూడు నెలల్లో వైరస్‌కు కట్టడి పడ్డా.. ఈ రంగం తిరిగి గాడిన పడేందుకు మరో రెండు మూడు నెలల సమయం పడుతుంది. కంపెనీల ఆదాయాలతోపాటు లాభాలూ కుచించుకుపోతాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి భారీ స్థాయి కంపెనీలు నెట్టుకొస్తాయి. చిన్న కంపెనీలకే సమస్య. వీటిల్లో కొన్ని కంపెనీల ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడే అవకాశాలూ లేకపోలేదు’ అని ఆయన వివరించారు. పోర్టుల వద్దా కార్మికుల కొరత ఉందని, ఇది కూడా సమస్యేనని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020–21లో ఫార్మా రంగం పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నట్టు చెప్పారు. చైనాలో సమస్య మొదలవగానే తయారీ విషయంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. కార్మికుల కొరత వంటి సమస్యలు తమకు లేవని వివరించింది. మార్జిన్స్ ఉండే వాటిపై.. భారత ఔషధ రంగానికి ఇది క్లిష్ట సమయమని ప్రముఖ లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ‘త్వరలోనే సమస్య నుంచి గట్టెక్కుతాం. భారత్ నుంచి ఔషధాల ఎగుమతులకు ఎటువంటి సమస్య లేదు. ఇక్కడి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. దేశీయంగానూ మార్కెట్ ఉత్తమంగా ఉంటుంది. ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నా అంతా సర్దుకుంటుంది. అంతర్జాతీయంగా ఔషధాల ధరలు మెరుగ్గా ఉన్నాయి. జూన్ నుంచి మార్కెట్ గాడిలో పడుతుంది. కంపెనీలు అధిక లాభాలను ఇచ్చే ఔషధాల తయారీపై దృష్టిసారిస్తాయి. ఇదే జరిగితే ఎగుమతుల్లో ఎంత కాదన్నా 10–15 శాతం వృద్ధి సాధిస్తాం. ప్రభుత్వం సైతం ఎగుమతుల వృద్ధికి తోడ్పాటు అందిస్తోంది’ అని అయన వివరించారు. -
కాలుష్య ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు నిర్దేశిత కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిం చకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పరిశ్రమ ల మంత్రి కె. తారకరామారావు హెచ్చరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందని ఆయన చెప్పారు. శనివారం కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఆయన బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ను తయారు చేసేందుకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అందులో భాగంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సిటీ ఏర్పాటులో కాలుష్య సమస్య లేకుండా అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను పాటిస్తున్నామన్నారు. ‘ఔటర్’ వెలుపలికి కాలుష్య పరిశ్రమలు హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డు అవతలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. క్లస్టర్ల వారీగా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నా మన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కంపెనీలు పాలుపంచుకోవాలని కోరారు. మంత్రి విజ్ఞప్తి మేరకు పటాన్ చెరు, బొల్లారం ప్రాంతాల్లో చెరువులు, జలవనరుల అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. -
'ఫార్మాసిటీకి 5 వేల ఎకరాల స్థలం కావాలి'
హైదరాబాద్: తెలంగాణలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీయిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఫార్మా సిటీలో కంపెనీలకు ప్రత్యేక పవర్‌ప్లాంట్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ మేనిఫాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రత్యేక ఫార్మా సిటీని నెలకొల్పేందుకు 5 వేల ఎకరాల స్థలం అవసరమని సీఎంకు ఫార్మా ప్రతినిధులు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం ప్రత్యేక సెక్రటరీని నియమించాలని కోరగా, దీనికి సీఎం కేసీఆర్ అంగీకరించారు.