కూకట్‌పల్లి: దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆరోగ్య భద్రతకు ముఖ్యమైన ఫార్మా రంగం ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయని, ఔషధాల ఎగుమతుల్లో మూడింట ఒక వంతు రెండు రాష్ట్రాలే చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. శనివారం బాలానగర్‌లోని నైపర్‌లో జరిగిన బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఇండియా) ఆధ్వర్యంలో ‘ఫార్మా రంగ ఉత్పత్తిలో వచ్చిన తాజా మార్పులు–పోస్ట్ కోవిడ్ సవాళ్లు, అవకాశాలు’అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జయేశ్ మాట్లాడుతూ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ 2021–22లో యూఎస్‌డీ 24.61 బిలియన్లను అధిగమించి ఎగుమతులు చేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 శాతం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో బలమైన ఫార్మాస్యూటికల్ రంగం, శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఉందన్నారు. జీడిమెట్ల, పాశ మైలారం, బొల్లారం వంటిపారిశ్రామిక ఎస్టేట్లలో ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయటం గర్వకారణమని జయేశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీడీఎంఈఐ అధ్యక్షుడు అగర్వాల్, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జాయింట్ సెక్రటరీ యువరాజ్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ రామకిషన్, నైపర్ డైరెక్టర్ శశి బాలాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మండిపోతున్న బంగారం రేట్లు.. తక్కువ ధరలో ఎక్కువ నగలకు ప్రత్యామ్నాయం ఉందిగా!
Comments
Please login to add a commentAdd a comment