సాక్షి,ముంబై: బడా పారిశ్రామిక వేత్త, బిలియనీర్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చలనచిత్ర, వినోద రంగానికి భారీ షాక్ ఇవ్వనున్నారు. తన రిలయన్స్ జియో ఫైబర్ నెట్‌వర్క్ సేవల్లో భాగమైన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఆఫర్‌లో 'వారానికి ఒక సినిమా' విడుదల చేయాలనే భారీ ప్రణాళికలో ఉన్నారు. జియో స్టూడియోస్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 52 సినిమాలను నిర్మించి విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాన్‌ను రెండు, మూడేళ్లలో అమలు చేయాలని యోచిస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు రూ .15-20 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది.
ఏడాది కనీసం 52 సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందుకు సొంత స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేసి, సినిమాను నిర్మించటం, ఇతర ప్రొడక్షన్ హౌస్‌లతో ఒప్పందాలు, మూడవ పార్టీల ద్వారా సినిమాలను కొనాలనుకుంటున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఛైర్మన్ కార్యాలయం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే మీడియాకు తెలిపారు. ఎరోస్ ఇంటర్నేషనల్ మాజీ సీఈవోగా ఉన్న ఈమె గత ఏడాదే రిలయన్స్‌లో చేరారు. 6 నుంచి 11 భాషల్లో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాని ఆమె చెప్పారు. అంతేకాదు జియో స్టూడియోస్ ద్వారా మొత్తం 11 భాషలలో వెబ్ సిరీస్, మ్యూజిక్ లాంటి చిన్నపెద్దా కంటెంట్ ఉత్పత్తి చేస్తామన్నారు.
దేశంలో మూవీ స్క్రీన్ల కొరత చాలా ఉందనీ జ్యోతి దేశ్‌పాండ్ వ్యాఖ్యానించారు. చైనాలో 35వేల స్క్రీన్‌లుంటే, ఇండియాలో కేవలం 2వేల మల్టీప్లెక్స్ లున్నాయని ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆదాయం ఎలా పెరుగుతుందని ఆమె ప్రశ్నించారు. అందుకే తమ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా అత్యంత ఎక్కువమంది వినియోగదారులకు చేరువ కావాలని యోచిస్తున్నామని ఆమె చెప్పారు. తమ ప్రత్యేక వ్యూహాంతో నిర్మించిన చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. కాగా జియో స్టూడియోస్ నిర్మించిన స్త్రీ, లుకా చుప్పి చిత్రాలు విజయవంతమయ్యాయి. వీటిపై 15 కోట్ల రూపాయల పెట్టుబడికిగాను, 150 కోట్ల రూపాయలను వసూలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment