అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు! | Jio set to reveal new plans in 2024, tension for Netflix and Amazon Prime | Sakshi
Sakshi News home page

అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!

Published Wed, Dec 27 2023 3:48 PM | Last Updated on Wed, Dec 27 2023 4:03 PM

Jio set to reveal new plans in 2024 tension for Netflix and Amazon Prime - Sakshi

ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్‌ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్‌ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్‌ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది.

ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్‌స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్‌కు దక్కుతాయి. ఈ డీల్‌ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్‌స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి.

 

ప్రత్యక్ష పోటీకి చెక్‌!
జియోకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా..  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్‌ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్‌స్టార్..  జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్‌స్టార్‌నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్‌, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

 

ఆ రెండింటిలో టెన్షన్‌..
ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్‌ల కంటెంట్‌ను ఒకే యాప్‌లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కస్టమర్‌లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్‌లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్‌తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట!

ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement