మాస్కో: కరోనాకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశామని ప్రకటించిన రష్యా.. తాజాగా, ఆ టీకా మొదటి బ్యాచ్ ఉత్పత్తిని పూర్తి చేసినట్లు తెలిపింది. వ్యాక్సిన్ ప్రొడక్షన్‌ని ప్రారంభిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొన్ని గంటలకే.. మొదటి బ్యాచ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పూర్తి చేసినట్లు ఇంటర్‌ఫాక్స్ వార్త సంస్థ ప్రకటించడం గమనార్హం. అయితే ఈ వేగవంతమైన చర్యల పట్ల కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల కన్నా ముందు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలనే ఆత్రుతతో భద్రతను పట్టించుకోకపోతే అంతర్జాతీయ సమాజంలో దేశ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని వాపోతున్నారు. కరోనా వైరస్ భరతం పట్టే వ్యాక్సిన్‌ను ఈ నెలాఖారులోగా విడుదల చేయనున్నట్లు రష్యా ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యాక్సిన్ ఆమోదం పొందాలంటే సాధారణంగా దాన్ని ఫేజ్-3లో వేలాది మంది మీద ప్రయోగిస్తారు. వ్యాక్సిన్ ఆమోదం పొందడంలో ఇది కీలక దశ. కానీ రష్యా ఇవేవి పూర్తి కాకుండానే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించడం గమనార్హం. (రష్యా టీకాపై మిశ్రమ స్పందన!)
‘స్పుత్నిక్-వి’గా నామకరణం చేసిన ఈ వ్యాక్సిన్‌ను అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఈ నెల 11న ప్రకటించారు. ఇది సురక్షితమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన కుమార్తెలలో ఒకరికి వ్యాక్సిన్ వేయించినట్లు తెలిపారు. ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదన్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన మాస్కో గమలేయ ఇన్‌స్టిట్యూట్.. రష్యా, ఇతర దేశాల భాగస్వామ్యంతో డిసెంబర్-జనవరి నాటికి నెలకు 5 మిలియన్ డోసులను ఉత్పత్తి చేస్తుందని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment