Green gram
-
ఏపీలో 15 నుంచి పప్పుధాన్యాల సేకరణ
సాక్షి, అమరావతి: ఈ నెల 15 నుంచి రైతుల వద్ద పప్పుధాన్యాలను ప్రభుత్వం సేకరించనుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని 31 కొనుగోలు కేంద్రాల్లో అపరాల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ చర్యలు తీసుకుంది. వైఎస్ జగన్ సీఎం బాధ్యతలు స్వీకరించాక తొలుత శనగల కొనుగోలుకు రూ.333 కోట్లు విడుదల చేశారు. రెండో విడతగా కేంద్ర నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్థిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కొనుగోలులో నిజమైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–క్రాపింగ్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోతే ఈ నెల 15 లోపు వారి పేర్లను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. వ్యాపారుల పట్ల రైతు సంఘాల ఆందోళన శనగల కొనుగోలు సమయంలో కొందరు రైతులు ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోకపోవడంతో కొంత నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ–క్రాపింగ్‌పై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ–క్రాపింగ్‌లో నమోదు చేసుకోని రైతులు గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ కార్యదర్శిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించింది. ఆ వివరాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రైతులు అపరాలను అమ్ముకోవచ్చని తెలిపింది. గతేడాది రైతులు అమ్ముకున్న అపరాలను వ్యాపారులు రైతుల పేరున నిల్వ చేసుకున్నారు. వారంతా కొనుగోలు కేంద్రాలకు ఆ పంటను తీసుకొచ్చి రైతుకు లభించాల్సిన మద్దతు ధరను తన్నుకుపోయే ప్రమాదముందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. రైతుల మేలుకే కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం క్వింటా పెసలకు రూ.7,050, మినుములకు రూ.5,700లను కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)గా ప్రకటించింది. అయితే.. మార్కెట్లో పెసలకు రూ.5,500, మినుములకు రూ.4,700లకు మించి ధర లభించడం లేదు. దీంతో రైతులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రెండో దశలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తెనాలి, పొన్నూరు, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, మైలవరం, పరిటాల, కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో మినుముల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పెసల కొనుగోలు కేంద్రాలను తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, జెడ్ రంగంపేట, కృష్ణా జిల్లా నందిగామ, పరిటాల, అల్లూరు, చౌటపల్లి, పొన్నవరం, మైలవరం, కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు, పెద్దపాడేరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, పోలవరం, కన్నాయిగుట్ట, కృష్ణారావుపేటల్లో ఏర్పాటు చేస్తారు. పెసలు, మినుములు 20 వేల టన్నులు, కందులు 40 వేల టన్నులు రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
అంతర పంటలు.. అదనపు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లా రైతాంగం అంతర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సోయా పంటలో కంది, పెసర, మొక్కజొన్న వంటి పంటలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల హెక్టార్లలో సోయా పంట వే సుకున్నారు. ఇందులో అంతర పంటగా ఎక్కువగా కంది విత్తుకున్నారు. 11 వేల హెక్టార్లలో కంది విత్తుకున్నట్లు తెలుస్తోంది. సోయా దిగుబడి వచ్చేలోపు మరో పంట కూడా చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. పత్తి పంటలో 2 వేల హెక్టార్ల వరకు కంది విత్తనం అంతర పంటగా వేసుకున్నారు. జిల్లాలో ఎక్కువగా జైనథ్, బేల, తాంసి, తలమడుగు, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ తదితర మండలాల్లో అంతర పంటలుగా కంది వేశారు. నిర్మల్ డివిజన్లో పసుపు పంటలో మొక్కజొన్న వేసుకున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తమకు మరిన్ని సలహలు సూచనలు అందించాలని రైతులు కోరుతున్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు. -
సరుకు ఫుల్..డిమాండ్ నిల్
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శనివారం పెసలు భారీగా అమ్మకానికి వచ్చాయి. ఇదే అదనుగా భావించిన ఖరీదుదారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ధర భారీగా తగ్గించి కొనుగోలు చేశారు. వ్యాపారులు, మార్కెట్ వర్గాలు ఊహంచని రీతిలో దాదాపు నాలుగు వేల క్వింటాళ్ల పెసలను రైతులు అమ్మకానికి తెచ్చారు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇంతభారీగా సరుకు ఎప్పుడూ అమ్మకానికి రాలేదు. మార్కెట్లోని ప్రధాన యార్డు ( అపరాల యార్డు)లో ఉన్న 12 షెడ్లలో అమ్మకానికి వచ్చిన పెసలను దించారు. సరుకు భారీగా రావడాన్ని గమనించిన వ్యాపారులు గురువారం వరకు క్వింటాల్ రూ.6,000 నుంచి రూ.6,500 వరకు పలికిన పెసల ధరను ఏకంగా రూ. 1,500 వరకు తగ్గించారు. రూ.4,500 నుంచి రూ.5,000 వరకు మాత్రమే ధర పెట్టారు. జిల్లాలో పెసర సాధారణ విస్తీర్ణం 8,883 హెక్టార్లు కాగా ఈ ఏడాది వర్షాభావ పరస్థితులు నెలకొనటంతో 6,050 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాలు అనుకూలంగా లేక పోవటంతో సాగు చేసిన పైరు నుంచి కూడా ఆశించిన పంట దిగుబడి రాలేదు. ఈ నేపథ్యంలో పెసలకు బాగా డిమాండ్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా క్వింటాల్ పెసలు రూ. 6 వేలకు పైగానే ధర పలుకుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఆ ధర లేదు. జెండా పాట బాగానే నిర్వహించారు. శనివారం జెండాపాట రూ.6వేలు పలికింది. కానీ అధికమొత్తం సరుకును రూ. 4500 నుంచి 5,000కు మించి ధర పెట్టలేదు. ధరలో భారీ వ్యత్యాసం ఏమిటని రైతులు ప్రశ్నిస్తే.. సరుకు నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కుంటిసాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఖమ్మం నగరంలోని దాల్మిల్ వ్యాపారులు ఈ పెసలు కొనుగోలు చేస్తున్నారు. దాల్ మిల్ వ్యాపారులు కొద్దిమంది మాత్రమే ఉండటంతో వారంతా రింగై కమీషన్ వ్యాపారుల ద్వారా సరుకును కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పంట అంత ఆశాజనకంగా లేకపోయినా పొరుగు జిల్లాలైన వరంగల్, నల్లగొండ, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్‌కు సరుకు అమ్మకానికి వస్తోంది. అసలే అంత ంతమాత్రం దిగుబడి వస్తోందని ఆవేదన చెందుతుంటే తీరా ఇక్కడికి వచ్చాక రూ.1500 ధర తగ్గించి కొనుగోలు చేయడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
తెగుళ్ల దిగులొద్దు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగవుతున్న పలు పంటల్లో ప్రస్తుత తరుణంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.1 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఇలా ఉన్నాయి. పత్తి పత్తి సాధారణ విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం జిల్లాలో 1.57 లక్షల హెక్టార్లలోనే దీన్ని సాగు చేస్తున్నారు. పత్తి పెరుగుదల లోపించటం, రసంపీల్చు పురుగులు, ఎండుతెగులు వంటివి వస్తున్నాయని రైతులు అంటున్నారు. దీనిపై డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది. పోషకాలను ఉపయోగిస్తే పంట సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మొక్క వయసును బట్టి 10-20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగులు, పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ ఉధృతి అధికంగా ఉంటే నివారణకు మోనోక్రొటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి మొక్క వయస్సు 30, 45, 60 రోజుల దశలో కాండానికి మందు పూయాలి. వీటి నివారణకు పిచికారీ మందులైతే మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామెసిడ్ 0.2 గ్రాములు లేదా ఫాప్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందులను మార్చి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పిండినల్లి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనితో పాటు లీటరుకు 0.5 గ్రాముల సర్ఫ్ పౌడర్ కలిపితే ఫలితం బాగుంటుంది. తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే టైజోఫాస్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి జిల్లాలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 1.32 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 31,083 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నారుమళ్లలో, నాటిన పొలాల్లో జింక్ధాతులోపం ఎక్కువగా ఉంది. దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం నాటు వేసిన వరిలో కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల దశలో బుటాక్లోర్ 1.25 లీటర్లు లేదా అనిలోఫాస్ 500 మి.లీ లేదా ప్రిటిలాక్లోర్ 600 మి.లీ లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాములు, 20-25 కిలోల ఇసుకలో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. మొక్కజొన్న మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14 వేల హెక్టార్లు ప్రస్తుతం పది వేల హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. జింక్ లోపం, కాండం తొలిచే పురుగులు వ్యాపిస్తున్నాయి. జింక్ లోపం నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు 10-12 రోజుల పైరుపై మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 20-25 రోజుల దశలో గమనిస్తే కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకు సుడులలో వేసుకోవాలి. పెసర పెసర ఖరీఫ్ విస్తీర్ణం 8.8 వేల హెక్టార్లు ఉండగా 5.7 వేల హెక్టార్లలో విత్తారు. పెసరలో మరూకా మచ్చల పురుగు, సల్లాకు తెగులు గమనించ దగినవి. మరూకా మచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2.0 మి.లీ క్వినాల్ఫాస్ లేదా 1.0 మి.లీ నోవల్యూరాన్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండిమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని అరికట్టడానికి ట్రైజోఫాస్ 1.25 మి.లీ లేదా ఎసిఫేట్ గ్రాము లేదా ఎసిటామిప్రెడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి. మిరప నారుమడి దశలో ఉన్న మిరపలో నారుకుళ్లు తెగులు ఆశిస్తుంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా రిడోమల్ ఎంజెడ్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి నారు మళ్లను తడపాలి. కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించింది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటామైసిన్ గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.