నటనను వృత్తిగా భావించేవాళ్లు కొందరుంటారు. నటనే జీవితం అనుకునేవాళ్లు కొందరుంటారు. శివపార్వతికి నటనే జీవితం. నాటకాలు, సినిమాలు, సీరియళ్లు... వేదిక ఏదైనా, పాత్రకు ప్రాణప్రతిష్ట చేయగల గొప్ప నటి ఆమె. రెండు వందల సినిమాలకు పైగా నటించిన శివపార్వతి ఇన్నేళ్ల తన నటనా జీవితం గురించి చెబుతోన్న విశేషాలు...
నాటకాలకు ఇంకా ఆదరణ ఉందని అంటారా?
ఎందుకు లేదు! నాటకం ఎప్పుడూ వెనుకబడిపోదు. దాన్ని ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. నాటకానికి ఇతివృత్తమే ప్రాణం. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి కథలను ఎంచుకుంటే ఆదరణ ఎప్పటికీ అలానే ఉంటుంది.
మీరు నటిగా మారిన వైనం?
మా నాన్నగారు రంగస్థల నటులు. నా చిన్నప్పుడు అనుకోకుండా ఓ నాటకంలో నన్ను నటించమన్నారు. నాటి నుంచి నేటి వరకూ నటిస్తూనే ఉన్నాను.
ఆసక్తి లేకుండానే నటి అయ్యారా?
ఆసక్తి లేకుండా కాదు, నటనంటే ఏంటో తెలీకుండా నటినయ్యాను. మాది తెనాలి. ఎందరో మహా నటీనటులకు జన్మస్థలం అది. అలాంటిచోట పుట్టడం వల్లనో ఏమో... ఆ కళ నాకు చిన్ననాటే అబ్బింది. మొదట అవకాశాలు రావడం వల్ల నటించేసినా, కొన్నాళ్లు పోయాక నటన మీద మక్కువ, గౌరవం పెరిగాయి. అప్పట్నుంచీ నటనే నా ఊపిరి అయ్యింది.
సినిమాల వైపు ఎలా వచ్చారు?
1991లో పరుచూరి బ్రదర్స్ రఘురామ్ నాటక కళా పరిషత్తును పెట్టారు. నా నటన చూసి తమ పరిషత్తులోకి తీసుకున్నారు. వారి ద్వారా ‘సర్పయాగం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
నాటకం... సినిమా... ఎందులో నటించడం కష్టమంటారు?
ఎక్కడైనా నటన ఒకటే. వాటిని ప్రదర్శించే తీరులో కాస్త తేడా ఉంటుంది. సినిమాల్లో నటించేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది చూసుకుని అప్పటికప్పుడు మార్పు చేసుకోవచ్చు. నాటకంలో ఆ అవకాశం లేదు. ఒక్కసారి వేదిక ఎక్కాక పర్‌ఫెక్ట్‌గా చేయాల్సిందే. ఆ పాత్రను పండించాల్సిన, నాటకాన్ని రక్తి కట్టించాల్సిన బాధ్యత మనదే. సినిమాల్లో డబ్బింగ్ వేరే వాళ్లతో అయినా చెప్పించుకోవచ్చు. కానీ నాటకంలో మనం చెప్పే ఆ డైలాగులు, పద్యాల మీదే విజయం ఆధారపడి ఉంటుంది.
మీకు ఎక్కువ తృప్తి ఎక్కడ దొరికింది?
రెండిటినీ ఎంజాయ్ చేశాను. నాటకరంగం కన్నతల్లిలా ఆదరిస్తే, సినిమా రంగం మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహించింది. నాకు రెండూ రెండు కళ్లు.
మరి ఆ రెంటినీ వదిలి సీరియల్స్‌కి ఎందుకొచ్చారు?
సినిమాల్లో బిజీ అయ్యాక నాటకాలకు దూరమయ్యాను. సినిమాల్లో అవకాశాలు కొరవడటం వల్ల సీరియల్స్‌కి వచ్చాను. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు బాగా వచ్చేవి. అమ్మ, అక్క, అత్త, వదిన అంటూ రకరకాల పాత్రలుండేవి. ఇప్పుడలాంటి సినిమాలే రావడం లేదు. ఇక మాలాంటి వారికి అవకాశాలెలా వస్తాయి!
ఇప్పుడు ట్రెండు మారిందిగా మరి?
కావచ్చు. కానీ మార్పు కోసం మంచిని వదిలేసుకుంటామా? కమర్షియల్ సినిమాలు తీయొద్దనడం లేదు. కానీ విలువల్ని చెప్పే సినిమాలు కూడా తీయాలి. కుటుంబపు విలువల్ని, బాంధవ్యాల గొప్పదనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది.
అందుకు సీరియల్స్ ఉన్నాయిగా?
అవి మాత్రం ఏం చెబుతున్నాయి! సీరియల్స్‌లో కూడా యాభైశాతం వయొలెన్సే చూపిస్తున్నాం. పంచభక్ష పరమాన్నాలు భోంచేసి, పాయసం తిని, తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో హీరోయిన్ పాత్రని చూస్తే అలా ఉండాలి. అలా కాకుండా ఇల్లాలిని విలన్‌ని చేసి ఓ రాక్షసిలాగా చూపిస్తే ఎలా! ఇంటి ఇల్లాలే కనుక అలా ఉంటే ఇక ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇవన్నీ ఆలోచించాలి.
‘మంగమ్మగారి మనవరాలు’లో మీరు చేస్తోందీ విలన్ పాత్రేగా?
కాదని అనడం లేదు. అలాంటివి ఉండకూడదు అని కూడా అనడం లేదు. ఎప్పుడూ అలాగే చూపించవద్దని అంటున్నాను. నటిగా నేను పాత్ర వరకే ఆలోచిస్తాను. కానీ పాత్రను సృష్టించేవారు ఆ పాత్ర సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. నటిగా నాకు అన్ని పాత్రలూ సమానమే అయినా వ్యక్తిగా మాత్రం అలాంటివాటినే ఇష్టపడతాను.
నాటకాల నుంచి ఇక్కడి వరకూ వచ్చారు. మళ్లీ నాటకాల వైపు వెళ్లే ఆలోచనేమైనా ఉందా?
ప్రస్తుతానికైతే లేదు. నాటకం అంటే అనుకోగానే వెళ్లి చేసేయడం కుదరదు. ఎంతో సాధన చేయాలి. ప్రస్తుతానికి అంత తీరిక నాకు లేదు.
నటన కాకుండా వేరే లక్ష్యమేదైనా..?
లేదు. నటనలోని మాధుర్యాన్ని తెలుసుకున్న తర్వాత నటనే జీవితం అనుకున్నాను. ఊపిరున్నంత వరకూ నటిస్తూనే ఉంటాను.
- సమీర నేలపూడి
సంభాషణం: ఇల్లాలిని విలన్‌గా చూపించడం నాకు నచ్చదు!
Published Sun, May 11 2014 4:37 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM
Advertisement
Advertisement