నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను! | I will not let my children come to film industry, says ram jagan | Sakshi
Sakshi News home page

నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను!

Published Sat, Aug 2 2014 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను!

నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను!

సంభాషణం

మా అమ్మాయి ఎంబీయే చదువుతోంది. బాబు ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాడు. వాళ్లిద్దరూ ఇండస్ట్రీవైపు రాకూడదన్నదే నా కోరిక. ఇక్కడి లాభనష్టాలు, కష్టసుఖాలు చూసిన తరువాత నేనా నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా పాపకు అలాంటి ఆశ ఉంటే మాత్రం కచ్చితంగా అడ్డుపడిపోతాను. బాబు ఏమంటాడో చూడాలి. మావాళ్లు వద్దన్నా నేను వచ్చేశాను కదా... వాడూ అలా చేస్తే నేనేం చేయగలను!
 
‘కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది’ అంటూ ‘శివ’ సినిమాలో పుస్తకాల రాశిని చూసి బెంగపడిపోతూ ప్రేక్షకులను నవ్వించాడు. ‘తులసీదళం’ సీరియల్‌లో శ్రీనివాస పిళ్లై పాత్రలో క్రూరత్వాన్ని ప్రదర్శించి అందరినీ భయపెట్టాడు. ‘మహాత్మ’ చిత్రంలో గాంధీ మహాత్ముడిని తలపిస్తూ హృదయాలను స్పృశించాడు. ఇంత వైవిధ్యతను ప్రదర్శిస్తాడు కనుకనే ‘రాం జగన్’ అందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. తన నట ప్రయాణంలోని ఒడిదుడుకుల గురించి ఆయన మనసు విప్పి చెప్పిన మాటలివి...
 
ఈ మధ్య మిమ్మల్ని చూడగానే ‘మహాత్మ’ సినిమా గుర్తొస్తోంది...?
ఈ మధ్య అందరూ ఇలానే అంటున్నారు. ఆ సినిమాలో గాంధీ వేషం గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే చేతులెత్తి దణ్నం కూడా పెట్టారు.
 
అసలా పాత్ర ఆఫర్ చేసినప్పుడు మీకేమనిపించింది?
మొదట ఓ చిన్న షాట్ కోసమే అడిగారు. నాకు శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క షాట్ అయినా ఫర్వాలేదని చేశాను. కొన్ని రోజుల తర్వాత కృష్ణవంశీ నుంచి కబురొచ్చింది. వెళ్తే రకరకాల గెటప్పులు వేయించి షూట్ చేశారు. ‘ఇదంతా నీకోసం కాదు, గెటప్స్ టెస్ట్ చేయడానికే, వీలైతే నీకు వేరే ఏదైనా పాత్ర ఇస్తాలే’ అన్నారు. కానీ నాలుగు రోజుల తర్వాత పిలిచి నువ్వే చేస్తున్నావ్ అన్నారు. ఆనందంతో నోట మాట రాలేదు.
 
చాలా యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అసలిటువైపు ఎలా వచ్చారు?
మాది ప.గో. జిల్లాలోని చెరకువాడ. చిన్నప్పట్నుంచీ ఎన్టీయార్ అంటే పిచ్చి. ఆయన  పోస్టర్లు కట్ చేసి, పుస్తకాలకు అట్టలు వేసుకునేవాడిని. ఇంటర్మీడియెట్ చేశాక మైన్స్ సర్వేయింగ్‌లో డిప్లొమో చేయడానికి గూడూరు వెళ్లాను. అక్కడ రూమ్మేట్స్‌తో కలిసి విపరీతంగా సినిమాలు చూశాను. అప్పుడే నటన మీద ఆసక్తి కలిగింది. మంచి కమెడియన్‌ని అవ్వగలనన్న నమ్మకంతో హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను.
 
తెరమీద ఎప్పుడు కనిపించారు?
ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే శోభన్‌బాబు హీరోగా చేసిన ‘మాంగల్యబలం’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఇండస్ట్రీ ఇంకా మద్రాసులోనే ఉండటంతో... ఆ సినిమా పూర్తయ్యాక మద్రాస్ వెళ్లిపోయాను. కొన్ని సినిమాలు చేశాక ‘శివ’లో చాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే బ్రేక్ కూడా వచ్చింది.
     
కొన్నాళ్ల తర్వాత డల్ అయ్యారెందుకు?
ఇండస్ట్రీ హైదరాబాద్‌కు షిఫ్టయ్యాక ఇక్కడకు వచ్చేశాను. అప్పుడు ఓ చానెల్‌వారు సీరియల్స్‌లో వరుస అవకాశాలిచ్చారు. బుల్లితెర మీద బిజీ అయిపోవడంతో వెండితెర అవకాశాలు తగ్గాయి.
     
మరి మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నించలేదా?
నేనెప్పుడూ ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోయాను. అయితే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఏది పడితే అది చేయడానికి మనసొప్పలేదు. మహాత్మ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నాను కానీ అలా జరగలేదు.
   
ఒకవేళ ప్రయత్న లోపమేమో?
కావచ్చు. అయితే అవకాశాల కోసం ఒక హద్దు దాటి నేను ప్రయత్నించలేను. వెండితెర మీద వెలగడం కోసం విలువల్ని వదులుకోవడం నావల్ల కాదు. అలాగని పైకి వచ్చినవాళ్లంతా అలా చేశారనట్లేదు. నాకలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మాత్రమే చెబుతున్నాను.
     
కెరీర్ మీకు అసంతృప్తినే మిగిల్చిందన్నమాట?
కాదని అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది.  హీరోని కావాలనుకోలేదు. సినిమా అంతటా కనిపించే పాత్రల్నీ కోరుకోలేదు. రెండు మూడు సన్నివేశాలే ఉన్నా, నా టాలెంటుకు తగిన రోల్స్ కోరుకున్నాను. నేను కోరుకున్నదే తక్కువ. ఆ తక్కువ కూడా దొరకలేదే అని ఫీలవుతుంటాను. ఓ ప్రెస్‌మీట్ జరిగితే... దర్శకుడు, హీరో, హీరోయిన్, విలన్‌లాంటి కొందరి పేర్లు రాసి, తదితరులు అంటూ వదిలేస్తారు తప్ప కనీసం మా పేర్లు కూడా రాయరు. అలా ఉంటుంది పరిస్థితి!
     
సీరియల్స్ అయినా చేయవచ్చు కదా?
చేస్తూనే ఉన్నాను. ఒక రకంగా సీరియళ్లు నాలోని నటుడిని తృప్తి పరిచాయి. కానీ ఎన్ని సీరియళ్లు చేసినా మనసంతా సినిమా మీదే ఉంటుంది.
     
నటన కాకుండా ఇంకేమైనా...?
నాకు నటన అంటేనే ఇష్టం. అదే చేస్తాను. సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ఏదో నాకున్న దానిలో కాస్త సేవకు వెచ్చిస్తుంటాను. ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్‌కి ప్రతి యేటా విరాళాలు పంపిస్తాను. థ్యాంక్స్ చెబుతూ వాళ్లు పంపిన ఉత్తరం చూసినప్పుడల్లా మరొకరికి సాయపడగలిగే స్థాయిలో ఉన్నందుకు సంతోషపడుతుంటాను. లేనిదానికి బాధపడే తత్వం కాదు నాది. నవ్వుతూనే బతికేస్తాను. నిజాయతీగా ఉంటే చాలనుకుంటాను. ఇక అంతా ఆ పైవాడి దయ!
 - సమీర నేలపూడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement