ఇండస్ట్రీ నాకు కావాలి... ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు! | Industry needs me ... I do not need industry! | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ నాకు కావాలి... ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు!

Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

గౌతంరాజు

గౌతంరాజు

సంభాషణం
 
తూర్పు గోదావరి యాసతో తెరమీద అదరగొట్టేసే నటులు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో గౌతంరాజు ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతోటి, యాసతోటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారాయన. ఇన్నేళ్ల తన ప్రయాణం గురించి, గెలుపోటముల గురించి గౌతంరాజు మనసు విప్పి చెప్పిన మాటలు...
 
మీకు గుర్తింపు తెచ్చింది గోదావరి యాసే. అలా మాట్లాడాలని మీరే అనుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా?
అలా ఏం లేదు. మొదట్లో కొన్ని పాత్రల స్వభావం దృష్ట్యా అలా మాట్లాడాను. అది నచ్చడంతో దర్శకులందరూ అలాగే మాట్లాడమనేవారు.
     
మీదే గోదావరి.. తూర్పా? పశ్చిమమా?
తూర్పే. మాది రాజోలు. అయితే నాన్నగారి వ్యాపారం రీత్యా కాకినాడలో స్థిరపడ్డాం. పెరిగింది, చదివింది అంతా అక్కడే. నటుడిగా మారిందీ అక్కడే.
     
నటన మీద ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పట్నుంచీ మనసు కళల మీదే ఉండేది. అందుకే నాలుగో తరగతిలో ఉండగానే స్టేజి ఎక్కాను. వయసుతో పాటు ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది.
     
నాలుగో తరగతిలోనే మొదలు పెట్టేశారు. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమా?
నటిస్తానంటే నాన్న తాట తీసేవారు. నాటకం మధ్యలో స్టేజి మీది నుంచి ఈడ్చుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయినా నాకు ఆ పిచ్చి తగ్గలేదు. మా నాన్న దానధర్మాలు బాగా చేసేవారు. అందరినీ ఆదరించేవారు. దాంతో మా ఇల్లు ఎప్పుడూ మనుషులతో కిటకిటలాడేది. చదువుకోవడానికి కూడా కుదిరేది కాదు. దాంతో మా ఇంటికెదురుగా ఉన్న హోటల్ పై అంతస్తులోని గదిలో, నా ఫ్రెండ్‌తో కలిసి చదువుకునేవాడిని. అక్కడ్నుంచి మా ఇల్లు స్పష్టంగా కనిపించేది. నాన్న ఇంటికొచ్చి పడుకునేవరకూ చూసి, ఆ తర్వాత రిహార్సల్స్‌కి వెళ్లిపోయేవాడిని. మళ్లీ తెల్లవారుజామునే వచ్చి ఏమీ ఎరగనట్టు పుస్తకాలు పట్టుకునేవాడిని!
     
నాటకాలకే ఒప్పుకోనివారు... సినిమాలకెలా ఒప్పుకున్నారు?
ఒప్పుకున్నారని చెప్పలేను కానీ, నేను నా ఇష్టాన్ని గెలిపించుకున్నానంతే. బీఎస్సీ ఫైనలియర్‌లో ఉండగానే మా అక్క కూతురితో నా పెళ్లి జరిపించేశారు. నా భార్య ఝాన్సీ నన్ను బాగా అర్థం చేసుకునేది. తన ప్రోత్సాహంతోనే నేను అనుకున్నవన్నీ చేశాను. నటనను కొనసాగించగలిగాను.
     
ఇంతవరకూ ఎన్ని సినిమాలు చేశారు?
మూడువందల పైనే. ‘వసంతగీతం’ నా తొలిచిత్రం. మొదటిరోజు షూటింగ్‌లో తొలి సన్నివేశమే ఏఎన్నార్‌తో. భయంతో డైలాగ్ మర్చిపోయాను. ఆయన ధైర్యం చెప్పి నేను ఫ్రీ అయ్యేలా చేశారు. అంత గొప్ప నటుడితో సినీప్రయాణం మొదలవడం నా అదృష్టం. అయితే ఎన్టీయార్‌తో పనిచేయలేకపోవడం నా దురదృష్టం!
     
ఇన్ని సినిమాలు చేశారు. తగిన గుర్తింపు వచ్చిందంటారా?
లేదు. ఇప్పటికీ నేను గుర్తింపు కోసం ఆరాటపడుతూనే ఉన్నాను. నటుడంటే కైకాల సత్యనారాయణగారిలా అన్ని రకాల పాత్రలూ చేయగలగాలి. నేనూ చేయగలను. కానీ అంత గొప్ప పాత్రలు రాలేదు.
     
నిరాశపడుతున్నారా?
నిరాశేం లేదు. ఇక్కడ టాలెంట్ ఒక్కటీ చాలదు. అదృష్టం కూడా ఉండాలి. కోరుకున్నవి కాకపోయినా అవకాశాలైతే వచ్చాయి. కాస్తో కూస్తో సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డాను. అది చాలు. నిజానికి డబ్బు కంటే మనుషుల్ని సంపాదించుకోవడం ముఖ్యం అనుకుంటాన్నేను. అందుకే అందరితో మంచిగా ఉంటాను. నాలాంటివాళ్లు వస్తుంటారు, పోతుం టారు. కాబట్టి ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు. నాకే ఇండస్ట్రీ కావాలి. అందుకే ఇండస్ట్రీకి, అందులోని వారికి విలువిస్తాను.  
   
మీ అబ్బాయి కృష్ణని హీరోని చేస్తున్నట్టున్నారు. అది మీ నిర్ణయమేనా?
 కాదు. పరిశ్రమలోని కష్టనష్టాల్ని చూసినవాణ్ని కాబట్టి నాకు పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం లేదు. కానీ తను హీరో అవ్వాలని ఆశపడ్డాడు. కాదనలేక పోయాను.
     
నాటకాలు, సీరియళ్లకి దూరమైనట్టేనా?
దూరమైపోలేదు కానీ, చేసే తీరిక లేక గ్యాప్ తీసుకున్నాను. నాకు నటుడిగా జన్మనిచ్చిన నాటకం, నా తల్లిలాంటిది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన టీవీ నాకు పినతల్లిలాంటిది. జీవితంలో నేను ముందుకు వెళ్లేలా చేసిన సినిమా నా తండ్రిలాంటిది. వీటిలో దేనికీ నేను దూరం కాలేను.
     
భవిష్యత్ ప్రణాళికలేంటి?
నా నటతృష్టను తీర్చే మంచి అవకాశాలు వస్తే చేయాలనుంది. అలాగే నటన తర్వాత నేను అంత ప్రాధాన్యతనిచ్చే విషయం... సేవ. ఉన్నదాంట్లో కొంత లేనివారికి పెట్టాలి. మా అమ్మానాన్నల నుంచి అబ్బింది నాకీ లక్షణం. అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఏదో రకంగా సేవ చేస్తుంటాను. నేను నెలకొల్పిన ‘అభయ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా వెనుకబడిన నటీనటులు, జర్నలిస్టులకు సహాయపడాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవే నా ప్రణాళికలు, లక్ష్యాలు!
 
- సమీర నేలపూడి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement