sambhasanam
-
ఇండస్ట్రీ నాకు కావాలి... ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు!
సంభాషణం తూర్పు గోదావరి యాసతో తెరమీద అదరగొట్టేసే నటులు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో గౌతంరాజు ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతోటి, యాసతోటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారాయన. ఇన్నేళ్ల తన ప్రయాణం గురించి, గెలుపోటముల గురించి గౌతంరాజు మనసు విప్పి చెప్పిన మాటలు... మీకు గుర్తింపు తెచ్చింది గోదావరి యాసే. అలా మాట్లాడాలని మీరే అనుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా? అలా ఏం లేదు. మొదట్లో కొన్ని పాత్రల స్వభావం దృష్ట్యా అలా మాట్లాడాను. అది నచ్చడంతో దర్శకులందరూ అలాగే మాట్లాడమనేవారు. మీదే గోదావరి.. తూర్పా? పశ్చిమమా? తూర్పే. మాది రాజోలు. అయితే నాన్నగారి వ్యాపారం రీత్యా కాకినాడలో స్థిరపడ్డాం. పెరిగింది, చదివింది అంతా అక్కడే. నటుడిగా మారిందీ అక్కడే. నటన మీద ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పట్నుంచీ మనసు కళల మీదే ఉండేది. అందుకే నాలుగో తరగతిలో ఉండగానే స్టేజి ఎక్కాను. వయసుతో పాటు ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. నాలుగో తరగతిలోనే మొదలు పెట్టేశారు. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమా? నటిస్తానంటే నాన్న తాట తీసేవారు. నాటకం మధ్యలో స్టేజి మీది నుంచి ఈడ్చుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయినా నాకు ఆ పిచ్చి తగ్గలేదు. మా నాన్న దానధర్మాలు బాగా చేసేవారు. అందరినీ ఆదరించేవారు. దాంతో మా ఇల్లు ఎప్పుడూ మనుషులతో కిటకిటలాడేది. చదువుకోవడానికి కూడా కుదిరేది కాదు. దాంతో మా ఇంటికెదురుగా ఉన్న హోటల్ పై అంతస్తులోని గదిలో, నా ఫ్రెండ్‌తో కలిసి చదువుకునేవాడిని. అక్కడ్నుంచి మా ఇల్లు స్పష్టంగా కనిపించేది. నాన్న ఇంటికొచ్చి పడుకునేవరకూ చూసి, ఆ తర్వాత రిహార్సల్స్‌కి వెళ్లిపోయేవాడిని. మళ్లీ తెల్లవారుజామునే వచ్చి ఏమీ ఎరగనట్టు పుస్తకాలు పట్టుకునేవాడిని! నాటకాలకే ఒప్పుకోనివారు... సినిమాలకెలా ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారని చెప్పలేను కానీ, నేను నా ఇష్టాన్ని గెలిపించుకున్నానంతే. బీఎస్సీ ఫైనలియర్లో ఉండగానే మా అక్క కూతురితో నా పెళ్లి జరిపించేశారు. నా భార్య ఝాన్సీ నన్ను బాగా అర్థం చేసుకునేది. తన ప్రోత్సాహంతోనే నేను అనుకున్నవన్నీ చేశాను. నటనను కొనసాగించగలిగాను. ఇంతవరకూ ఎన్ని సినిమాలు చేశారు? మూడువందల పైనే. ‘వసంతగీతం’ నా తొలిచిత్రం. మొదటిరోజు షూటింగ్లో తొలి సన్నివేశమే ఏఎన్నార్‌తో. భయంతో డైలాగ్ మర్చిపోయాను. ఆయన ధైర్యం చెప్పి నేను ఫ్రీ అయ్యేలా చేశారు. అంత గొప్ప నటుడితో సినీప్రయాణం మొదలవడం నా అదృష్టం. అయితే ఎన్టీయార్‌తో పనిచేయలేకపోవడం నా దురదృష్టం! ఇన్ని సినిమాలు చేశారు. తగిన గుర్తింపు వచ్చిందంటారా? లేదు. ఇప్పటికీ నేను గుర్తింపు కోసం ఆరాటపడుతూనే ఉన్నాను. నటుడంటే కైకాల సత్యనారాయణగారిలా అన్ని రకాల పాత్రలూ చేయగలగాలి. నేనూ చేయగలను. కానీ అంత గొప్ప పాత్రలు రాలేదు. నిరాశపడుతున్నారా? నిరాశేం లేదు. ఇక్కడ టాలెంట్ ఒక్కటీ చాలదు. అదృష్టం కూడా ఉండాలి. కోరుకున్నవి కాకపోయినా అవకాశాలైతే వచ్చాయి. కాస్తో కూస్తో సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డాను. అది చాలు. నిజానికి డబ్బు కంటే మనుషుల్ని సంపాదించుకోవడం ముఖ్యం అనుకుంటాన్నేను. అందుకే అందరితో మంచిగా ఉంటాను. నాలాంటివాళ్లు వస్తుంటారు, పోతుం టారు. కాబట్టి ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు. నాకే ఇండస్ట్రీ కావాలి. అందుకే ఇండస్ట్రీకి, అందులోని వారికి విలువిస్తాను. మీ అబ్బాయి కృష్ణని హీరోని చేస్తున్నట్టున్నారు. అది మీ నిర్ణయమేనా? కాదు. పరిశ్రమలోని కష్టనష్టాల్ని చూసినవాణ్ని కాబట్టి నాకు పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం లేదు. కానీ తను హీరో అవ్వాలని ఆశపడ్డాడు. కాదనలేక పోయాను. నాటకాలు, సీరియళ్లకి దూరమైనట్టేనా? దూరమైపోలేదు కానీ, చేసే తీరిక లేక గ్యాప్ తీసుకున్నాను. నాకు నటుడిగా జన్మనిచ్చిన నాటకం, నా తల్లిలాంటిది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన టీవీ నాకు పినతల్లిలాంటిది. జీవితంలో నేను ముందుకు వెళ్లేలా చేసిన సినిమా నా తండ్రిలాంటిది. వీటిలో దేనికీ నేను దూరం కాలేను. భవిష్యత్ ప్రణాళికలేంటి? నా నటతృష్టను తీర్చే మంచి అవకాశాలు వస్తే చేయాలనుంది. అలాగే నటన తర్వాత నేను అంత ప్రాధాన్యతనిచ్చే విషయం... సేవ. ఉన్నదాంట్లో కొంత లేనివారికి పెట్టాలి. మా అమ్మానాన్నల నుంచి అబ్బింది నాకీ లక్షణం. అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఏదో రకంగా సేవ చేస్తుంటాను. నేను నెలకొల్పిన ‘అభయ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా వెనుకబడిన నటీనటులు, జర్నలిస్టులకు సహాయపడాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవే నా ప్రణాళికలు, లక్ష్యాలు! - సమీర నేలపూడి -
సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!
ప్రతిభకు కొలమానం లేదు అన్న మాట విశ్వ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడు పాట రాస్తాడు, కంపోజ్ చేస్తాడు, పాడతాడు... పాటకు సంబంధించిన ప్రతి అంశం మీద తన ముద్ర వేయాలని తపిస్తాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా... గీత రచయితగా అతడిదో ప్రత్యేక శైలి. వెస్టర్న్ సాంగ్‌కి సైతం తెలుగు సువాసనని అద్దే అతడిది ఓ వైవిధ్యభరితమైన దారి. పాటల పూబాటలో తన పయనం గురించి విశ్వ చెబుతోన్న విశేషాలు... మణిశర్మగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు ఓ సినిమాలో టైటిల్సాంగ్ రాసి, పాడే చాన్సిచ్చారాయన. నా పర్ఫార్మెన్స్ నచ్చి... ‘నీలో మంచి గాయకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు’ అన్నారు. నేను పాట రాస్తాను, కంపోజ్ చేస్తాను, పాడతాను, కీబోర్డ్ వాయిస్తాను, రికార్డ్ చేస్తాను, మిక్సింగ్ కూడా చేస్తాను. ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కంపోజ్ చేశారు, ఎన్ని పాడారు? ‘రేసుగుర్రం’లో రాసిన ‘డౌన్ డౌన్’ పాటతో నూట యాభై పూర్తయ్యాయి. హైదరాబాద్ నవాబ్స్, మంగళ, నేను నా రాక్షసి, పోలీస్ పోలీస్, క్షత్రియ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. చాలా పాటలు పాడాను. ‘సంతోషం’లో మెహబూబా మెహబూబా, ‘అతడు’ టైటిల్సాంగ్, ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో మొదలైనవి పేరు తెచ్చాయి. అయితే రచయితగానే ఎక్కువ సక్సెస్ అయ్యాను. అసలు సంగీత, సాహిత్యాల మీద ఇంత ప్రీతి ఎలా ఏర్పడింది? నాన్న హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. ఆయనకు సాహిత్యమంటే చాలా మక్కువ. అమ్మకు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉంది. వాళ్లిద్దరి అభిరుచులూ కలిపి నాకు వచ్చాయి. బీహెచ్ఈఎల్లో ‘శ్రీకళా నిలయం’ అనే ఆర్ట్ అసోసియేషన్ ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నేను వాటిలో పాల్గొనేవాడిని. నెమలికంటి రాధాకృష్ణమూర్తిగారని యద్దనపూడి సులోచనారాణిగారి సోదరుడు... ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటనే పలు నాటకాల్లో నటించాను. ఏడో యేటనే ఆంధ్ర నాటక కళా పరిషత్తు అవార్డును అందుకున్నాను. ఆ అనుభవం నాకు సంగీత, సాహిత్యాల పట్ల మక్కువను పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికి ఆ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇటు వచ్చేశాను. మరి మీ టాలెంట్‌కి తగిన సక్సెస్ వచ్చిందంటారా? నేనెప్పుడూ సక్సెస్‌ని ప్రామాణికంగా తీసుకోను. చేతి నిండా అవకాశాలు ఉంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది! మీరు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకుంటారట... నిజమేనా? నిజమే. పాటకి ఓ స్థాయి ఉండాలనుకుంటాను. దిగజారి రాయలేను. అలా చేయలేక పెద్ద పెద్ద సంగీత దర్శకులిచ్చిన అవకాశాలు వదిలేసుకున్నాను. వారి దగ్గర పొగరుబోతుననిపించుకున్నాను. అంటే... దిగజారి రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? కచ్చితంగా ఉన్నాయి. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’ అంటూ రాసిన వేటూరికే ‘ఆకు చాటు పిందె తడిసె’ అంటూ రాయాల్సి వచ్చింది. తన స్థాయికి తగని పాటలు రాయాల్సి వచ్చినందుకు వేటూరి గారు కూడా ఎన్నోసార్లు బాధపడటం మనం చూశాం కదా! అలా ఎందుకు జరుగుతోందంటారు? కొందరు సంగీత దర్శకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండదు. అయినా జోక్యం చేసుకుంటారు. కొన్ని పదాలు తీసేస్తారు. తమకు నచ్చినవి చేర్చేస్తారు. రచయితలకి స్వాతంత్య్రం లేదు. వారి అభిరుచికి విలువా లేదు. ఇది పాటకి శ్రేయస్కరం కూడా కాదు. మరి ఈ పరిస్థితి మారేదెలా? అది నేను చెప్పలేను. కానీ పాటకి నావంతు న్యాయం నేను చేస్తానని మాత్రం చెప్తాను. అందుకే నా పాటల్లో అశ్లీలత, అసభ్యత లేకుండా చూసుకుంటాను. మోడర్న్ సాంగ్స్ రాసినా కూడా అచ్చ తెలుగు పదాలనే వాడుతుంటాను. మంచి పాటను గుర్తించగలిగే విజ్ఞత ఉన్న శ్రోతలు... మంచి అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకులు కూడా మనకింకా ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు. మీరూ ప్రయోగాలు చేస్తారుగా? అవును. కానీ ఆ ప్రయోగం ప్రయోజనకరంగానే ఉండేలా చూసుకుంటాను. ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటలు రాస్తుంటే ఏఎన్నార్ వచ్చారు. ‘‘కొత్త పంథాలో పాటలు బాగానే రాస్తున్నావు’’ అంటూ కాళిదాసు శ్లోకం ఒకటి చెప్పారు. దాని భావమేమిటంటే... ‘‘కొత్త ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే కొత్తవన్నీ గొప్పవని కాదు, పాతవన్నీ తీసి పారేసేవీ కాదు. తెలివైన రచయిత పాతదనంలోని మంచిని తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల పేరిట వింత పోకడలు పోకూడదు.’’ ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా భాషను పాడు చేయను. ఎప్పటికీ ఈ మాట మీదే నిలబడతారా? కచ్చితంగా. దిగజారి రాయాల్సి వచ్చిన రోజున పాట రాయడం మానుకుంటాను. పాచిపని చేసుకుని అయినా బతుకుతాను గానీ కళకు ద్రోహం చేయను. - సమీర నేలపూడి