
పీడకల
కొన్ని జ్ఞాపకాలు పెదాల మీద చిరునవ్వులు పూయిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో గునపాలు దించుతుంటాయి.
నిజాలు దేవుడికెరుక: కొన్ని జ్ఞాపకాలు పెదాల మీద చిరునవ్వులు పూయిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో గునపాలు దించుతుంటాయి. దురదృష్టం... స్టెఫానీ స్లేటర్‌కి ఈ రెండో తరహా జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఊహించని విధంగా ముంచుకొచ్చిన ఒక విపత్తు ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆమెను జీవమున్న బొమ్మగా మిగిల్చింది. స్టెఫానీ జీవితం వినడానికి కథలా ఉంటుంది. కానీ ఆ కథ నిండా బోలెడు వ్యథ ఉంది. సదా ఆమె పెదాలపై ఉండే తీయని చిరునవ్వు వెనుక కొండంత చేదు ఉంది!
బ్రిటన్... 1993. టీవీ చానెళ్లు చకచకా మారుస్తోంది స్టెఫానీ. ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆసక్తికరంగా అనిపించడం లేదు. కనీసం వార్తలైనా చూద్దామని న్యూస్ చానెల్ పెట్టింది. సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద ఓ వ్యక్తి ముఖం ప్రత్యక్షమయ్యింది. అది చూస్తూనే మంచుగడ్డలా బిగుసుకుపోయింది స్టెఫానీ. వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. ‘‘మైఖేల్ శామ్ తన జీవితాన్ని పుస్తకంగా ఆవిష్కరించాలనుకుంటున్నాడు. స్టెఫానీ స్లేటర్‌తో నడిపిన ప్రేమాయణాన్ని ఇందులో రాయనున్నట్టు సమాచారం.’’
ఉలిక్కిపడింది స్టెఫానీ. ‘‘ప్రేమాయణమా?’’... గొణుక్కుంది. మరో చానెల్ పెట్టింది. అక్కడా అదే సమాచారం. టపటపా చానెళ్లు మార్చింది. అన్నింట్లోనూ అదే వార్త. టీవీ కట్టేసి రిమోట్ విసిరేసింది. సోఫాలో ముడుచుకుపోయింది. మోకాళ్లు ముడిచి, వాటి చుట్టూ చేతులు బిగించింది. బిత్తర చూపులు చూస్తూ వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఆమెనలా చూసి అప్పుడే అక్కడికి వచ్చిన వారెన్ హడలిపోయాడు. ‘‘స్టెఫీ’’ అంటూ పరుగున వెళ్లి కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘ఏమైంది బేబీ... ఎందుకేడుస్తున్నావ్’’ అంటూ గుండెలకు హత్తుకున్నాడు. ఆయన మాట వింటూనే వంట గదిలోంచి కంగారుగా వచ్చింది తల్లి బెట్టీ. ‘‘స్టెఫీకి ఏమైంది?’’ అంది ఆతృతగా. ‘‘తనని చూసుకోకుండా ఏం చేస్తున్నావ్ నువ్వు?’’ అరిచాడు వారెన్.
స్టెఫానీ మాట్లాడలేకపోతోంది. పెదవులు అదురుతున్నాయి. నాలుక పిడచ కట్టుకుపోతున్నట్టుగా అనిపిస్తోంది. వెక్కిళ్లు వచ్చేస్తున్నాయి. ఆమె పరిస్థితి తండ్రిని కంగారు పెట్టింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేశాడు. క్షణాల్లో డాక్టర్ వచ్చింది. ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది. భయం, కంగారు తగ్గాయి కానీ కన్నీళ్లు మాత్రం ఆగలేదు. ఆమెనలా చూసి ఆ వృద్ధ తల్లిదండ్రులకు కన్నీళ్లొచ్చేశాయి.
అరగంట తర్వాత తేరుకుంది స్టెఫానీ. ‘‘ఇప్పుడెలా ఉంది బేబీ’’ అన్నాడు వారెన్ కూతురి తల నిమురుతూ. ఫరవాలేదన్నట్టు తలూపింది. ‘‘డాడ్... నన్ను బయటకు తీసుకెళ్తావా? నాకో పనుంది’’ అంది. ఎక్కడికి అని అడగలేదు వారెన్. సరేనంటూ తలూపాడు. పది నిమిషాల్లో తయారై స్టెఫానీని తీసుకుని బయలుదేరారు తల్లిదండ్రులిద్దరూ.
కిడ్నాప్ కారణంగా శారీరకంగానే కాదు, మానసికంగా కూడా గాయపడింది స్టెఫానీ. టీవీలు, పేపర్లలో విరివిగా కథనాలు రావడంతో అందరూ గుర్తు పట్టేవారు. దాంతో బయటకు వెళ్లడమే మానేసింది. వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. పేరు కూడా మార్చుకుంది. ఉద్యోగం లేదు. నాటి హోదా లేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. కూతురి పట్ల జరిగినదాన్ని జీర్ణించుకోలేక తల్లి మంచం పట్టి చనిపోయింది. స్టెఫానీ తండ్రితో పాటు బ్రిటన్‌లోనే ఒకచోట జీవిస్తోంది. ఇరవయ్యేళ్లు గడిచిపోయినా పీడకలలా వెంటాడుతున్న గతాన్ని తరిమేయలేకపోతోంది. కొత్త జీవితానికి పునాది వేసుకునే ధైర్యం చేయలేకపోతోంది.
చానెల్ ఆఫీసును చూస్తూనే... ‘‘ఇక్కడ ఆపాలా? ఎందుకు?’’ అన్నాడు వారెన్ అర్థం కానట్టుగా. ‘‘పని ఉంది డాడ్’’ అంటూ కారు దిగింది స్టెఫానీ. ఆ వెనుకే వాళ్లూ దిగారు. ‘‘మమ్మీ... ఇప్పుడు నేనో పని చేయబోతున్నాను. దానివల్ల నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిని నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ తప్పదు. నన్ను క్షమించు’’ అనేసి లోనికి నడిచింది స్టెఫానీ. ఇద్దరూ ఆమెను అనుసరించారు. అంతవరకూ హడావుడిగా, సందడిగా ఉన్న ఆ ఆఫీసు స్టెఫానీ రాకతో ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కొందరి కళ్లలో ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్న ఉత్సుకత. మరికొందరి కళ్లలో పాపం అన్న జాలి. ఆ చూపులను దాటుకుంటూ సీఈవో క్యాబిన్‌కు వెళ్లింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడతడు.
‘‘స్టెఫానీ స్లేటర్... మీరిక్కడ...’’ ‘‘నేను కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను సర్. దానికి మీ అనుమతి కావాలి. కాస్త సమయం కేటాయించాలి’’... తడుముకోకుండా చెప్పింది. కొన్ని నెలలుగా భీతహరిణిలా ఉంటున్న ఆమె, ఒక్కసారిగా సింహపు పిల్లలా రొమ్ము విరుచుకుని నిలబడటం చూసి విస్మయం చెందుతున్నారు వారెన్, బెట్టీలు. ‘‘తప్పకుండా మిస్ స్టెఫానీ. పదండి స్టూడియోకి వెళ్దాం’’ అన్నాడు సీఈవో. అతని వెనుకే నడిచింది స్టెఫానీ. మరో పది నిమిషాల్లో టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యిందామె. ‘‘అందరికీ నమస్కారం. నా పేరు స్టెఫానీ... స్టెఫానీ స్లేటర్. నాకు తెలుసు నన్ను నేను పరిచయం చేసుకోనక్కర్లేదని. ఎందుకంటే మీ అందరికీ నా కథ తెలుసు. ఇక తెలియాల్సింది నా వ్యథ మాత్రమే. అది చెప్పడానికే నేను వచ్చాను.
కాసేపటి క్రితం ఇదే చానెల్లో ఒక వార్త చూశాను... నాతో నడిపిన ప్రేమాయణాన్ని తన ఆత్మకథలో రాస్తానని మైఖేల్ శామ్ చెప్పాడని. అతడు చెప్పాడు. వీళ్లు ప్రసారం చేశారు. మీరు చూశారు. నాకు తెలుసు... ఆ వార్త వింటూనే మీ అందరికీ హుషారొచ్చేసి ఉంటుంది. మా ఇద్దరి ప్రేమ గురించీ తెలుసుకోవాలన్న ఆతృత పెరిగిపోయి ఉంటుంది. కానీ మీరు చెప్పండి... కిడ్నాప్ చేసిన వ్యక్తికీ, కిడ్నాప్ అయిన అమ్మాయికీ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? కళ్లకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లూ చేతులూ కట్టేసి, నిలువునా వివస్త్రను చేసి, పచ్చిపుండు అయిన శరీరాన్ని పశువులా ఆక్రమించుకునేవాడిని ఏ ఆడపిల్ల అయినా ఎలా ప్రేమిస్తుంది?’’
నివ్వెరపోయింది బెట్టీ. ఏం చెబుతోంది తన కూతురు! తను రేప్‌కి గురయ్యిందా? ఆ తల్లి మనసు విలవిల్లాడిపోయింది. కూతురి చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలోని ఆతృతను అర్థం చేసుకుంది స్టెఫానీ. తల్లి చేతిని ప్రేమగా తడిమింది.
‘‘నా కథ మీ అందరికీ తెలుసని మీరనుకుంటున్నారు. కానీ మీకు పూర్తిగా తెలియదు. నా తల్లిదండ్రుల మనసు గాయపడకూడదని నేను కొన్ని విషయాలు దాచిపెట్టాను. కానీ దానివల్ల నా వ్యక్తిత్వానికే కళంకం ఏర్పడుతుందని అనుకోలేదు. మైఖేల్‌తో నేను ప్రేమాయణం నడపలేదు. అతడి క్రూరత్వానికి బలయ్యాను. అతడు నా శరీరాన్ని మలినపరిచాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నా అందమైన భవిష్యత్తును కాలరాశాడు. బతుకంతా వెంటాడే పీడకలలా మిగిలిపోయాడు’’. స్టెఫానీ గొంతు బొంగురుపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అణచు కోలేక బావురుమంది. కానీ ఆమెకు తెలియదు... ఆ క్షణం లక్షలాది కళ్లు ఆమెను చూసి కన్నీళ్లు పెట్టాయని! అంతగా అందరి మనసులనూ కలచివేసిన స్టెఫానీ కథ ఇలా ప్రారంభం కాలేదు. అమ్మానాన్నల అనురాగంతో పువ్వులా పెరిగిందామె. చలాకీగా ఉండేది. చదువు పూర్తి చేస్తూనే ఓ పెద్ద కంపెనీలో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా చేరింది. కస్టమర్లు ఆమె మాటలకు మంత్ర ముగ్ధులయ్యేవారు. ఫలితంగా కంపెనీకి లాభాల పంట పండేది. దాంతో ముఖ్యమైన కస్టమర్లందరినీ ఆమె చేతికే అప్పగించేవాడు బాస్. అలానే మైఖేల్ శామ్‌తో డీల్ కుదుర్చుకునే బాధ్యతను కూడా అప్పగించాడు. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసిందతడికి.
జనవరి 22, 1992.
మైఖేల్ శామ్‌కి ఓ ఇంటిని చూపించడానికి వెళ్లింది స్టెఫానీ. ఇల్లంతా తిప్పి చూపిస్తుండగా ఆమె మీద దాడి చేశాడు శామ్. పీక మీద కత్తి పెట్టి, చేతులు వెనక్కి విరిచి వైరుతో కట్టేశాడు. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి కారులో పడేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఎక్కడికో తీసుకుపోయాడు.
ఏం జరుగుతోందో తెలియదు. తననేమి చేయబోతున్నాడో అర్థం కాదు. బిక్కచచ్చిపోయింది స్టెఫానీ. అతడు తనను వివస్త్రను చేస్తున్నా నోరు మెదపలేకపోయింది. బలవంతంగా అనుభవిస్తున్నా అరిచి గోల చేయలేకపోయింది. తప్పించుకోలేక, ఆ బాధను అనుభవించలేక విలవిల్లాడిపోయింది. ఆ రాక్షసుడు స్టెఫానీ శరీరాన్ని ఉండలా చుట్టేసి ఓ ఇరుకైన పెట్టెలో బంధించాడు. బాధతో మూలుగుతున్నా, చలితో వణుకుతున్నా కనికరించలేదు. ఎనిమిది రోజుల పాటు నరకం చూిపించాడు.
తర్వాత శామ్ స్టెఫానీ పని చేసే ఆఫీసుకు ఫోన్ చేశాడు. 1,75,000 డాలర్లు ఇస్తే ఆమెను విడిచిపెడతానన్నాడు. బాస్ అంగీకరించాడు. పోలీసుల సాయంతో శామ్‌ని పట్టుకోడానికి పథకం రచించాడు. డబ్బు తీసుకుని వెళ్లాడు. కానీ అనుకోని అవాంతరాల వల్ల ప్లాన్ వర్కవుటవ్వలేదు. డబ్బు తీసుకుని శామ్ పారిపోయాడు. పోలీసులు గాలింపులు తీవ్రతరం చేశారు. దాంతో స్టెఫానీని చంపేయాలనుకున్నాడు శామ్. కానీ చంపలేకపోయాడు. ఎందుకంటే స్టెఫానీ తెలివిగా ప్రవర్తించింది. అతడి అధీనంలో ఉన్న ఎనిమిది రోజుల్లో అతడితో మాట కలిపింది. రియల్ ఎస్టేట్ ఏజెంటుగా అవతలి వ్యక్తిని ఇంప్రెస్ చేసేలా మాట్లాడే కళ ఆమెకు బాగా తెలుసు. దాన్నే ప్రయోగించింది. అతడు మెత్తబడ్డాడు. చంపకుండా తీసుకెళ్లి ఆమె ఇంటిముందు వదిలేశాడు.
బ్రిటన్‌లోని అన్ని ప్రముఖ చానెళ్లలోనూ స్టెఫానీ కిడ్నాప్ ఉదంతం ప్రసారమయ్యింది. దాంతో పాటు స్టెఫానీ బాస్‌తో శామ్ ఫోన్‌లో మాట్లాడిన రికార్డుల్ని కూడా ప్రసారం చేశారు. వాటిని విన్న శామ్ భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ గొంతు తన భర్తదేనని చెప్పి, అతడెక్కడున్నాడో తెలిపింది. గతంలో జూలీ డార్ట్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపింది కూడా అతడేనని అర్థం చేసుకున్న పోలీసులు ఇరవై నాలుగ్గంటలు తిరిగేలోగా శామ్‌ను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం జీవితాంతం జైలులోనే ఉండమంటూ శిక్షించింది.
కటకటాల మధ్య కఠిన శిక్షను అనుభిస్తూ కూడా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు శామ్. స్టెఫానీ తనతో ప్రేమలో పడిందన్నాడు. తమ ప్రేమకథను ఆత్మకథగా రాస్తానని అన్నాడు. దాంతో కడుపు మండిన స్టెఫానీ అందరి ముందుకూ వచ్చింది. అంతవరకూ తనను చిత్రహింసలు మాత్రమే పెట్టాడని చెప్పిన ఆమె... తొలిసారిగా తనపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది.
‘‘నాకెందుకు చెప్పలేదురా... ఇంత బాధని మనసులో దాచుకున్నావా?’’... కూతురి కళ్లలోకి చూస్తూ అడిగాడు వారెన్.
‘‘సారీ డాడ్. చెప్పాలనే అనుకున్నాను. కానీ అప్పుడు కలిగిన బాధకంటే... ఆ నిజం విన్నప్పుడు మీరు పడే వేదనను చూడటమే పెద్ద బాధ. దాన్ని భరించే ఓపిక నాకు లేదు. అందుకే చెప్పలేదు.’’ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నాడు వారెన్. ఓ చేతితో కూతురిని, మరో చేతితో భార్యని దగ్గరకు తీసుకుని కారువైపు నడిచాడు.
- సమీర నేలపూడి