దేనికింత శిక్ష?! | manjakkad soumya murder case in kerala | Sakshi
Sakshi News home page

దేనికింత శిక్ష?!

Published Sun, Nov 29 2015 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM

దేనికింత శిక్ష?! - Sakshi

దేనికింత శిక్ష?!

క్రైమ్ ఫైల్

ఫిబ్రవరి 1, 2011... మంజక్కాడ్ (కేరళ)...
రాత్రి పదకొండున్నర కావస్తోంది. వాకిట్లో అటూ ఇటూ తిరుగుతోంది సుమతి. మధ్యమధ్యన రోడ్డువైపు చూస్తోంది. నుదుటికి పట్టిన చెమటను చీరకొంగుతో తుడుచుకుంటోంది. అరుగుమీద కూర్చుని ఉన్న గణేశ్ భార్యవైపే చూస్తున్నాడు. ‘‘సుమతీ... ఎందుకలా కంగారుపడతావ్? ఒక్కోసారి ఆలస్యమవుతూ ఉంటుందిలే’’ అన్నాడు తన ఆదుర్దాని బయటపడనివ్వకుండా.
 
‘‘నావల్ల కాదండీ. ఎంత లేటయినా పదిన్నరలోపే వచ్చేయాలి. పదకొండున్నర అవుతున్నా రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉంది’’ అంది దిగులుగా. అంతలో లోపల్నుంచి వచ్చాడు గణేశ్ తమ్ముడు శంకర్. ‘‘ఏంటి మీరిద్దరూ? తను రావలసింది రైల్లో. మన దేశంలో రైళ్లు ఎప్పుడూ లేటేగా. కంగారు పడటం మానేసి నిశ్చితార్థానికి ఏం వంటలు చేయించాలో చెప్పండి. పొద్దున్నే ఆర్డర్ ఇవ్వాలి’’ అన్నాడు పెన్ను, పేపర్ తీస్తూ.సుమతి, గణేశ్‌లు ముఖాలు చూసు కున్నారు. ఎల్లుండి తమ కూతురు సౌమ్య నిశ్చితార్థం. అందుకే బంధువులంతా వచ్చారు. ఆ సందడిలో సౌమ్య ఇంకా ఇంటికి రాలేదన్న విషయం అందరూ మర్చిపోయారు... సుమతి, గణేశ్ తప్ప. వాళ్లిద్దరి మనసులూ కూతురి చుట్టూనే తిరుగుతున్నాయి. తను క్షేమంగా రావాలని మౌనంగా ప్రార్థిస్తున్నాయి.
 ‘‘ఇంత ఆలస్యం ఎప్పుడూ కాలేదు శంకర్. టైముకే వచ్చేస్తుంది. కానీ ఈరోజు ఏమయ్యిందో అర్థం కావట్లేదు’’... సుమతికి దుఃఖం పొంగుకొచ్చేస్తోంది.
 
‘‘బెంగపడకు వదినా. రేపట్నుంచి సెలవు పెట్టేస్తానంది కదా. ఇవాళ చివరి రోజని ఎక్కువ పనేమైనా చేసిందేమో. అందుకే ఆలస్యమై ఉంటుంది. నువ్వు లోపలికి పద. బోలెడంత పని ఉంది’’... కంగారు పెట్టాడు శంకర్. ఇక తప్పదని లోనికి నడిచింది సుమతి. గణేశ్ కూడా లేచి వెళ్లాడు.
 మరో రెండు గంటలు గడిచి పోయాయి. సౌమ్య రాలేదు. ఇక ఆగలేక పోయింది సుమతి. ‘‘ఇప్పటికైనా కదులు తారా? పిల్ల ఇంకా ఇంటికి రాలేదు. ఏదో ఒకటి చేయండి’’... భర్తమీద అరిచేసింది.
 
‘‘ఓసారి స్టేషన్‌కి వెళ్లి చూసొద్దాం అన్నయ్యా. లేటయ్యి ఆటోగానీ దొరక లేదేమో’’ అన్నాడు శంకర్. సరేనంటూ లేచాడు గణేశ్. చెప్పులు తొడుక్కుని రెండడుగులు వేశారో లేదో... గణేశ్ ఫోన్ రింగయ్యింది. తీసి హలో అన్నాడు.
 అంతే... ఏదో వినకూడనిది విన్నట్టు కొయ్యబారిపోయాడు. చేతిలోని సెల్ జారి పడిపోయింది. నీరసం ఆవహించినట్టుగా కుప్పకూలిపోయాడు. పరుగు పరుగున వచ్చింది సుమతి. ‘‘ఏమయ్యిందండీ... ఎవరు ఫోన్ చేశారు’’ అంది కంగారుగా.
 మాట్లాడలేకపోయాడు గణేశ్.  ‘‘సౌమ్యా’’ అంటూ ఒక్క కేక పెట్టాడు.
    
తిరుచూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి...
 ఐసీయూ తలుపులు తెరచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు. గబగబా అతని దగ్గరకు పరుగెత్తింది సుమతి. ‘‘డాక్టర్‌గారూ... మా సౌమ్య...’’
 ‘‘మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది.’’
 ‘‘అంటే...’’
 ‘‘బతుకుతుందన్న నమ్మకం లేదు.’’
 
ఆ మాట వింటూనే విలవిల్లాడి పోయింది సుమతి. ‘‘అంత మాటనకండి డాక్టర్‌గారూ. తను మా ఇంటి దీపం. ఆ దీపం ఆరిపోయిందంటే మా బతుకులన్నీ చీకటైపోతాయి. నా బిడ్డని కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటాను.’’
 తన కాళ్లమీద పడిన సుమతిని చప్పున పైకి లేపాడు డాక్టర్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తన చేతుల్లో ఏమీ లేదు. ఎలా గ్యారంటీ ఇవ్వగలడు? ఎలా మీ బిడ్డను మీకప్పగిస్తానని చెప్పగలడు?
 
ఓ పక్కగా నిలబడివున్న ఇన్‌స్పెక్టర్ దగ్గరకు వెళ్లాడు. ‘‘దారుణం. ఘోరం. ఆ అమ్మాయి ఎలా తట్టుకుందో ఏమో. ఇప్పటి వరకూ ప్రాణాలతో ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది చేసింది ఎవరైనా సరే, వదలొద్దు సర్. జస్ట్... కిల్ హిమ్’’ అనేసి వెళ్లిపోతుంటే ఇన్‌స్పెక్టర్ పిడికిలి బిగిసింది. ఎందుకంటే అతడి మనసులో కూడా అదే ఉంది. వాణ్ని వదలకూడదు. ఓ ఆడపిల్లకి ఇంత దారుణమైన గతి పట్టించినవాణ్ని బతకనివ్వకూడదు. అతడలా అనుకుంటూ ఉండగానే సెల్ మోగింది. తీసి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే వేగంగా కదిలాడు.
     
ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌కి వెళ్లేసరికి ఎదురు చూస్తూ ఉన్నాడా వ్యక్తి. అతణ్ని చూస్తూనే... ‘‘చెప్పండి. మీరేం చూశారు?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘నేనో చర్చి పాస్టర్‌ని సర్. నిన్న సాయంత్రం నేను ఎర్నాకులం-షోరనూర్ ప్యాసింజర్ రెలైక్కాను. తర్వాత కాసేపటికి ఓ అమ్మాయి అరుపులు, ఏడుపు వినిపిం చాయి. నేను చెయిన్ లాగబోతే మిగతా వాళ్లు అడ్డుకున్నారు. అప్పటికే రైలు ఆలస్యంగా నడుస్తోందని, ఆపితే ఇంకా ఆలస్యమవుతుందని అన్నారు. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. కాసేపటికి అరుపులు ఆగిపోయాయి. తర్వాతి స్టేషన్లో రైల్వే పోలీసులకి విషయం చెప్పాను.’’
 
‘‘ఓ... ఆ వ్యక్తి మీరేనా? మీ కంప్లయింట్‌ని బట్టే ఆ ఏరియా అంతా వెతకడం జరిగింది. ఓ చోట పొదల్లో... రక్తపు మడుగులో పడివున్న ఒకమ్మాయి కనిపించింది. తన ఐడీ కార్డును బట్టి వివరాలు తెలిశాయి. ఆస్పత్రిలో చేర్పించి తనవాళ్లకు కబురు చేశాం. ఇప్పుడు తను చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. పాపం... చాలా దారుణంగా రేప్ చేశారెవరో.’’
 ‘‘ఉదయం న్యూస్‌లో చూశాను సర్. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. నాకు ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది.’’
 
అలర్ట్ అయ్యాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఎవరి మీద?’’ అన్నాడు ఆతృతగా.
 ‘‘తిరుచూర్ స్టేషన్లో రైలు ఆగినప్పుడు ఓ బిచ్చగాడు మా కంపార్ట్‌మెంట్లో ఎక్కాడు. రైలు బయలుదేరాక పక్కనున్న లేడీస్ కంపార్ట్‌మెంట్లోకి వెళ్లాడు. అతనికి ఒక చేయి కూడా లేదు.’’
 పెద్ద క్లూ దొరికింది ఇన్‌స్పెక్టర్‌కి. పాస్టర్‌ని అభినందించాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు.

తిరుచూర్ స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజుల ద్వారా ఆ ఒంటి చేతి వ్యక్తి ఫొటోలు పట్టాడు. సౌమ్య సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే ఫోన్ ఓ షాపులో దొరికింది. దాన్ని అమ్మింది ఒక ఒంటి చేతి వ్యక్తి అని షాపువాడు చెప్ప డంతో అతడే అసలు నిందితుడని నిర్ధారణ అయిపోయింది. దాంతో వేట మొదలైంది. పెద్ద సమయం వృథా కాకుండానే ఆ మృగం పోలీసుల చేతికి చిక్కింది. వాడు సౌమ్య పట్ల చేసినది తెలిస్తే... విన్న ప్రతి హృదయం కదిలి పోతుంది. ప్రతి కన్నూ తడిసిపోతుంది.
 కొచ్చిలో ఓ షాపులో పని చేస్తోంది సౌమ్య.

పనయ్యాక అక్కడ రైలు ఎక్కి, షోరనూర్ స్టేషన్లో దిగుతుంది. అక్క డ్నుంచి మంజక్కాడ్‌లో ఉన్న తమ ఇంటికి చేరుకుంటుంది. ఆ రోజు కూడా అలానే రైలు ఎక్కింది. తిరుచూర్ స్టేషన్ దగ్గర లేడీస్ కంపార్ట్‌మెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. సౌమ్య మాత్రమే మిగి లింది. సరిగ్గా అప్పుడే లోనికి దూసుకొ చ్చాడు గోవిందస్వామి. సౌమ్యపై దాడి చేశాడు. ఆమె చేతిలోని పర్సు లాక్కు న్నాడు. నగలు కూడా లాక్కోబోతే ఆమె తిరగబడింది. దాంతో సౌమ్య తలను బోగీలో ఉన్న ఇనుపరాడ్‌కేసి కొట్టాడు. తర్వాత ఆమెను రైల్లోంచి తోసేశాడు.
 రైలు ఇంకా వేగం పుంజుకోలేదు.

దాంతో గోవిందస్వామి కూడా రైల్లోంచి దూకేశాడు. సౌమ్య ఎక్కడ పడిందా అని వెతికాడు. ఒకచోట కనిపించింది. రక్తపు మడుగులో పడివుంది. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెనలా చూసి కూడా ఆ కర్కోటకుడికి జాలి కలగలేదు. పశువులా ఆమెమీద పడ్డాడు. దారుణాతి దారుణంగా అనుభవించాడు. తర్వాత ఆమె నగలు, సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు.
     
ఫిబ్రవరి 6... తిరుచూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి...
 ‘‘సారీ... ఐదు రోజులుగా పడిన శ్రమ ఫలించలేదు. సౌమ్య ఇక లేదు.’’ ఆ మాట వింటూనే సుమతి కళ్లు తిరిగి పడిపోయింది. ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎన్నో ఘోరాలను చూసి చూసి కరడు కట్టిన ఖాకీల గుండెలు సైతం ఆ క్షణం బాధతో మెలికలు తిరిగాయి.
 ఇరవై మూడేళ్ల చిన్న పిల్ల.

కష్టపడి పని చేసి తన కుటుంబానికి ఆధారంగా నిలబడింది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచింది. తమ్ముడిని చదివిస్తోంది. అలాంటి మంచి అమ్మాయికా ఇలాంటి గతి పట్టింది!
 మరో రెండు రోజుల్లో తన నిశ్చితార్థం. నెల రోజుల్లో పెళ్లి. కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటోంది. భవిష్యత్తు గురించి అందమైన ఊహలు అల్లుకుంటోంది.

అంతలోనే దురదృష్టం నీడలా వెంటాడింది. ఓ మానవ మృగం చేతిలో ఆమె బతుకు చితికిపోయింది. ఆమె జీవితం అర్ధంతరంగా అంతమై పోయింది. ఆమె కథ ఎవరిని మాత్రం కదిలించదు! ఆమెకు జరిగిన అన్యాయం ఎవరి గుండెల్ని పిండదు!  
 సౌమ్య కేసు కేరళలో పెద్ద సంచల నమే సృష్టించింది. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు.

ఇలాంటి సంఘటనలు మళ్లీ జరక్కుండా చూడాలంటే సౌమ్యకు ఆ గతి పట్టించినవాడిని వదిలిపెట్టకూడ దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును త్వరత్వరగా తేల్చింది. గోవిందస్వామికి ఉరిశిక్షను విధించింది.
 
వేటగాడిని చంపుతారు సరే. వేటకు బలైన  జీవిని తిరిగి తీసుకు రాగలరా? మరొకరు అలా బలి కానే కారని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ప్రతిచోటా గోవిందస్వామి లాంటి వేటగాళ్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో సౌమ్య లాంటి అమాయకురాళ్లు మానప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన నిర్భయ ఉదంతమే అందుకు పెద్ద ఉదాహరణ. మరి ఈ రాక్షసుల రాజ్యంలో మన ఆడపిల్లలు ఎలా బతకాలి? ఏ ధైర్యంతో వాళ్లు అడుగు బయటపెట్టాలి?!

- సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement