విధి వంచిత
క్రైమ్ ఫైల్
మార్చి, 2012... ముంబై...
‘షాట్ రెడీ’ అన్న మాట వింటూనే చేతిలోని స్క్రిప్టు పక్కన పెట్టి లేచింది మీనాక్షి. హుషారుగా వెళ్లి కెమెరా ముందు నిలబడింది. యాక్షన్ అని చెప్పగానే డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. క్షణాల్లో సీన్లో ఇన్‌వాల్వ్ అయిపోయింది. అద్భుతంగా కరుణ రసాన్ని పండించింది. ఆమె నటన చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. డెరైక్టర్ కట్ చెప్పగానే చప్పట్ల వర్షం కురిపించారు.
ఆనందంతో పొంగిపోయింది మీనాక్షి. గొప్ప నటి కావాలన్న తన లక్ష్యం తప్పక నెరవేరుతుందని ఆ చప్పట్ల వర్షం తనకి చెబుతున్నట్టుగా అనిపించిందామెకి.
‘‘వెల్‌డన్ మీనాక్షీ... అదరగొట్టేశావ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కీపిటప్’’... వెన్ను తట్టాడు డెరైక్టర్. ‘‘థాంక్యూ సర్’’ అంది మీనాక్షి వినయంగా. నెక్స్ట్‌షాట్ డైలాగులు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు బాయ్. వెళ్లి చదువుకుంటూ కూర్చున్న మీనాక్షి, ఎవరో వచ్చి నిలబడినట్టు అనిపించడంతో తల ఎత్తి చూసింది.
ఎదురుగా ఓ వ్యక్తి, ఓ అమ్మాయి ఉన్నారు. అతని వయసు ముప్ఫై పైనే ఉంటుంది. ఆ అమ్మాయి ముప్ఫయ్యేళ్లకు చేరువలో ఉండివుంటుంది.
‘‘నమస్తే మేడమ్, మీరు మీనాక్షిగారు కదూ. మీరంటే నాకు చాలా ఇష్టం’’... సంబరపడిపోతూ అందా అమ్మాయి.
‘‘నాక్కూడా మీరంటే ఎంతో గౌరవం మేడమ్. ఎక్కడో నేపాల్ నుంచి వచ్చి బాలీవుడ్‌లో స్థానం సంపాదించారు. మీరు నిజంగా గ్రేట్’’ అన్నాడా వ్యక్తి.
‘‘నేనంత గొప్పదాన్నేం కాదండీ. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. చిన్నప్ప ట్నుంచీ నటనంటే పిచ్చి. అందుకే కాలు మీద కాలు వేసుకుని బతికేంత డబ్బు ఉన్నా, ఇక్కడికి వచ్చాను’’ అంది మీనాక్షి.
‘‘అలా అనకండి మేడమ్. మీలాంటి వాళ్లే మాకు స్ఫూర్తి. మా ఇద్దరికీ నటనంటే ఆసక్తి. అందుకే అదృష్టం పరీక్షించుకుందా మని వచ్చాం. అనుకోకుండా మిమ్మల్ని కలిశాం. చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడతను ఆనందంగా.
‘‘టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రయత్నించండి. నేను కూడా నాకు తెలిసినవాళ్లకు చెబుతాను’’ అంది మీనాక్షి.
వాళ్లిద్దరి ముఖాలూ సంతోషంతో వెలిగాయి. మరోసారి కలుస్తామని చెప్పి వెళ్లి పోయారు. మళ్లీ స్క్రిప్టు చదువుకోవ డంలో మునిగిపోయింది మీనాక్షి.
ఏప్రిల్, 2012...
దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు ఇన్‌స్పెక్టర్. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇన్‌స్పెక్టర్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అతడి ముఖంలో విసుగు, ఆతృత, కోపం, బాధ... రకరకాల హావభావాలు కదలాడు తున్నాయి. కాసేపలాగే చూసి...
‘‘ఏంటి సర్ ఆలోచిస్తున్నారు? పది రోజులు దాటింది నేను కంప్లయింట్ ఇచ్చి. ఇంతవరకూ ఏ ఉపయోగం లేదు’’... అరిచినట్టే అన్నాడతను.
ఇన్‌స్పెక్టర్ కోపం తెచ్చుకోలేదు. ‘‘నాకర్థమవుతోంది నవరాజ్ నీ బాధ! కానీ ఏం చేయమంటావ్. ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.’’
‘‘ఏంటి సర్ ప్రయత్నించేది! అక్కడ నా చెల్లెలు ఎలా ఉందో, ఏమైపోయిందో, వాళ్లు తనని ఏం చేశారో. మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తోంది. నేను పిచ్చోడిలా తిరిగిన చోటు తిరక్కుండా తిరుగుతున్నాను. వయసులో ఉన్న పిల్ల సర్. తనకేదైనా అయితే’’... దుఃఖం పొంగుకొచ్చింది నవరాజ్‌కి.
ఇన్‌స్పెక్టర్ మనసంతా అదోలా అయిపోయింది. అయినా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్ప గలడు? ఏదైనా తెలిస్తే కదా చెప్పడానికి!
ఉన్నట్టుండి నేపాల్‌కు చెందిన నవ రాజ్ థాపా స్టేషన్‌కి వచ్చాడు. తన చెల్లెలు మీనాక్షీ థాపాని ఎవరో కిడ్నాప్ చేశా రంటూ కంప్లయింట్ ఇచ్చాడు. మీనాక్షి బాలీవుడ్ నటి. అప్పటికే ఓ హారర్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో చేస్తోంది. కొన్ని మోడలింగ్ ప్రాజెక్టులు చేసింది. మరికొన్ని చేతిలో ఉన్నాయి. అలాంటి సమయంలో ఆమె ఉన్నట్టుండి మాయమైపోయింది. రెండు రోజులు వరుసగా షూటింగుకు రాకపోవ డంతో దర్శక నిర్మాతలు, నేపాల్‌లో ఉన్న మీనాక్షి కుటుంబానికి ఫోన్ చేశారు. వాళ్లు ముంబై వచ్చి వెతికారు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది. దాంతో మీనాక్షి అన్న నవరాజ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు.
‘‘మాట్లాడరేంటి సర్... నా చెల్లెలు ఏమయ్యింది? తను క్షేమంగానే ఉందం టారా?’’... జీరబోయిన గొంతుతో అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు నవరాజ్. ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నాడు ఇన్‌స్పెక్టర్. అంతలో ఓ కానిస్టేబుల్ వేగంగా లోపలికి వచ్చాడు.
‘‘సర్... మీనాక్షిగారి ఫోన్ కొద్దిసేపటి క్రితం ఆన్ అయ్యింది. పది నిమిషాల తర్వాత మళ్లీ ఆఫ్ అయిపోయింది.’’
అలెర్ట్ అయ్యాడు ఇన్‌స్పెక్టర్. ‘‘లొకేషన్ ట్రేస్ చేశారా?’’
‘‘చేశాం సర్. ముంబైలోనే ఉన్నారు. అంతే కాదు సర్. బ్యాంక్‌వాళ్లు ఫోన్ చేశారు. ఇవాళ ఉదయం మీనాక్షి అకౌంట్ నుంచి అరవై వేలు డ్రా అయ్యాయట.’’
చివ్వున లేచాడు ఇన్‌స్పెక్టర్. ‘‘నవరాజ్... క్లూ దొరికింది. ఈ రెండు ఆధారాలూ చాలు, మీనాక్షి దగ్గరకు చేరుకోవడానికి. పదండి వెళ్దాం’’ అన్నాడు టోపీ పెట్టుకుంటూ. నవరాజ్ లేచాడు. మరో రెండు నిమిషాల్లో వాళ్లు ఎక్కిన వాహనం రయ్యిన దూసుకుపోయింది.
ముంబై శివార్లలో ఉన్న ఓ కాలనీ దగ్గర ఆగింది పోలీస్ జీపు. దిగి చుట్టూ చూశాడు ఇన్‌స్పెక్టర్. ఖరీదైన మనుషు లెవరూ ఆ కాలనీలో ఉండటం లేదని అక్కడి ఇళ్లను చూస్తేనే తెలుస్తోంది.
‘‘లొకేషన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘రండి సర్’’ అంటూ ముందుకు నడిచాడు ఓ కానిస్టేబుల్. కొన్ని సందులు దాటి ఓ ఇంటి ముందు ఆగాడు. ఇదే అన్నట్టు సైగ చేశాడు. ఇన్‌స్పెక్టర్ సిగ్నల్ ఇచ్చాడు. టీమ్ అందరూ ఒక్కసారిగా తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లారు. వాళ్లని చూస్తూనే లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులూ హడలిపోయారు. ఎలా తప్పించుకుందామా అని చూశారు. కానీ ఏ దారీ కనిపించక లొంగిపోయారు.
‘‘మీనాక్షి ఎక్కడ?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మీనాక్షి ఎవరు?’’ అన్నాడొక వ్యక్తి. అంతే... చెంప ఛెళ్లుమంది. భగ్గు మంటోన్న చెంపను తడుముకుంటూ నోరు విప్పాడతను. అతడు చెప్పింది విని అవాక్కయిపోయారు పోలీసులు.
అలహాబాద్‌లోని ఓ చిన్న హోటల్... పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లు తోంది. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తున్నారు. పోలీసులంతా చకచకా టై మీదికి వెళ్లారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాటర్ ట్యాంక్ మూత తీసి అందులోకి దిగారు. నీటి అడుగున ఉన్న... ప్లాస్టిక్ సంచుల మూటలను బయటకు తీశారు. వాటిని చూస్తూనే ‘‘మీనాక్షీ’’ అంటూ అరిచి కుప్పకూలాడు నవరాజ్.
‘‘అమిత్ జైస్వాల్, ప్రీతీ సురీన్... ఏదీ కూడా దాచకుండా చెప్పండి. లేదంటే నాలో రాక్షసుణ్ని చూస్తారు’’... గర్జించాడు ఇన్‌స్పెక్టర్. అమిత్ చెప్పడం మొదలు పెట్టాడు. అది వింటే మనిషన్నవాడు, మనసున్నవాడు ఎవడూ తట్టుకోలేడు!
అలహాబాద్‌కు చెందిన అమిత్ ‘లా’ చదివాడు. లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. అతనికి అసిస్టెంట్‌గా చేరింది ప్రీతి. ఇద్దరూ హద్దులు దాటారు. అది అమిత్ భార్యకి, పిల్లలకి తెలిసి పెద్ద గొడవ జరిగింది. అయినా ప్రీతిని వదల డానికి ఇష్టపడలేదు అమిత్.
ఆమెను తీసుకుని రాత్రికి రాత్రే ముంబై వచ్చేశాడు. ఇద్దరికీ నటనంటే ఇష్టం కావడంతో సిని మాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ సమయంలోనే ఓ షూటింగ్ స్పాట్‌లో మీనాక్షిని కలిశారు. ఆమె ఎంతో అభిమానంగా మాట్లాడింది. దాంతో పరిచయాన్ని కొనసాగించారు. తరచూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. కలిసి భోజనాలు చేసేవారు. తీరిగ్గా ఉన్నప్పుడు పార్టీలూ చేసుకునేవారు.
అదెంత ప్రమాదకరమో మీనాక్షి అంచనా వేయలేకపోయింది. కాల సర్పాలతో తిరుగుతున్నానని తెలుసుకోలేక పోయింది. ఆ సర్పాలు తనను కాటు వేస్తాయని ఊహించలేకపోయింది.
ఓరోజు మీనాక్షికి ఫోన్ చేసి, తమ స్వస్థలమైన అలహాబాద్‌లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం రమ్మంది ప్రీతి. ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో వెళ్లింది మీనాక్షి. ముగ్గురూ అలహాబాద్ వెళ్లి ఓ చిన్న హోటల్లో బస చేశారు. అక్కడ మీనాక్షిని బంధించారు అమిత్, ప్రీతి.
తర్వాత ‘మీనాక్షిని కిడ్నాప్ చేశాం, పదిహేను లక్షలు ఆమె అకౌంట్లో జమ చేస్తే వదిలేస్తాం’ అంటూ మీనాక్షి ఫోన్ నుంచే ఆమె తల్లి కమలకు మెసేజిచ్చారు. కమల దగ్గర అంత డబ్బు లేదు. కొడుకు నవరాజ్‌తో కలిసి ఎలాగో అరవై వేలు కూడగట్టి, మీనాక్షి అకౌంట్లో వేసింది. దాంతో వాళ్లకి పదిహేను లక్షలు ఇచ్చేంత సీన్ లేదని అర్థమైంది ఇద్దరికీ.
అప్పుడే... ఆ క్షణమే మీనాక్షిని గొంతు నులిమి చంపేశారు. తలను నరికేశారు. మొండెంను ముక్కలు చేసి, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. తలను ప్యాక్ చేసి, బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరారు. అలహాబాద్ నుంచి ముంబై వచ్చే దారిలో బస్సులోంచి తలను విసిరేశారు.
చాచి కొట్టాడు ఇన్‌స్పెక్టర్. ‘‘పాపం అమాయకురాలిని పొట్టనబెట్టుకున్నారు. మీరు మనుషులా’’ అన్నాడు ఛీదరింపుగా.
‘‘తను బాగా డబ్బున్న అమ్మాయి నని, హాబీగా యాక్టింగ్ చేస్తున్నాని మీనాక్షి చెప్పింది సర్. అందుకే మేం సెటిలవ్వ డానికి తనని ఉపయోగించుకోవాలను కున్నాం. కానీ తనకంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. అందుకే చంపేశాం.’’
ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతోన్న ప్రీతిని చూసి మండు కొచ్చింది ఇన్‌స్పెక్టర్. తర్వాత పోలీసు లాఠీలు ఆ ఇద్దరి శరీరాల మీద నృత్యం చేశాయి. ఆ మానవ మృగాలు కటకటాల వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాయి.
- సమీర నేలపూడి