సాక్షి, ముంబై: ముంబైలో ఒక వ్యాపారవేత్త అనూహ్యంగా లిఫ్ట్ గుంతలో పడి చనిపోవడం కలకలం రేపింది. కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మేవానీ(46)వర్లి ప్రాంతంలో తన స్నేహితుడిని కలవడానికి వెళ్లి దుర్మరణం పాలయ్యారు. వర్లిలోని, బ్యూనా విస్టా భవనంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు సోమవారం అందించిన సమాచారం ప్రకారం విశాల్ బ్యూనా విస్టా భవనంలోని రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు స్విచ్ నొక్కగా ఛానల్ తెరుచుకోవడంతో లిఫ్టు వచ్చిందని భావించి పొరపాటున అడుగుపెట్టాడు. ఇంతలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నలిఫ్ట్ డోర్ మూయడంతో అది కిందికి వచ్చింది. దీంతో గుంతలో పడి నుజు నుజ్జు అయిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అధికారులు తీవ్రంగా గాయపడిన అతడిని బయటికి లాగి బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు అరగంట ముందు భార్యతో మాట్లాడిన విశాల్, తన స్నేహితుడిని కలవబోతున్నానని చెప్పాడని పోలీసులు తెలిపారు.
అయితే పంటినొప్పితో బాధపడుతున్నవిశాల్ తన స్నేహితుడి ఫ్లాట్ పక్కన ఉండే డాక్టర్ ను కలిసేందుకు వెళ్లాలనుకున్నారు. ఈయనతో పాటు ఆమె కుమార్తె రేషం కూడా వెంట ఉన్నారు. ఆమె ఏదో కారణంతో కొంచెం వెనక ఉండటంతో విశాల్ అన్యమనస్కంగా లిఫ్ట్ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడని మరో నివేదిక తెలిపింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వర్లి పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సుఖ్లాల్ వర్పే తెలిపారు. సాంకేతిక లోపం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోందనీ, లిఫ్ట్ మెయింటెనెన్స్ చివరిసారిగా ఎపుడు నిర్వహించిందీ విచారిస్తున్నామన్నారు
Comments
Please login to add a commentAdd a comment