retail chains
-
సెలెక్ట్ మొబైల్స్ దీపావళి ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ దీపావళీ సందర్భంగా ధమాకా ఆఫర్లను ప్రకటించింది. 55 అంగుళాల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.32,999లకు, 43 ఇంచుల నోకియా 4కే ఆండ్రాయిడ్ టీవీని రూ.22,999లకే అందించనుంది. మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను పొంద వచ్చు.బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, అమెజాన్, పేటీఎం కొనుగోలు ద్వారా రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్రలోని 80కి పైగా సెలెక్ట్ స్టోర్లలో నవంబర్ ఒకటో తేది నుంచి 6తేది వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ధమాకా ఆఫర్లను కస్టమర్లు వినియోగించుకోవాలని సీఎండీ వై.గురు తెలిపారు. -
బి–న్యూ మొబైల్స్ ‘సెంచరీ’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బి–న్యూ మొబైల్స్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో సోమవారం రెండు ఔట్లెట్లను ప్రారంభించింది. తద్వారా సంస్థ కేంద్రాల సంఖ్య 101కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల పైచిలుకు కస్టమర్లతో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. 2014లో విజ యవాడలో తొలి స్టోర్‌తో మొబైల్స్ విక్రయాల్లోకి అడుగుపెట్టామని చెప్పారు. ఏపీలో 82, తెలంగాణలో 19 ఔట్లెట్లను నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాదికల్లా రెండింతలు.. గత ఆర్థిక సంవత్సరంలో బి–న్యూ మొబైల్స్ రూ.700 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22లో రూ.1,000 కోట్లు ఆశిస్తున్నామని కంపెనీ ఈడీ వై.సాయి నిఖిలేశ్ తెలిపారు. ‘2022 డిసెంబరు నాటికి ఏపీ, తెలంగాణలో మరో 100 స్టోర్లను ప్రారంభిస్తాం. ఇందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే 25 ఔట్లెట్లను తెరుస్తాం. ప్రస్తుతం సంస్థలో 700 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. అన్ని స్టోర్లలో విస్తృత శ్రేణి మొబైల్స్ అందుబాటులో ఉంచాం. ప్రత్యక్షంగా చూసుకునేందుకు వీలుగా ప్రతి కేంద్రంలో లైవ్ డిస్ప్లే ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న కస్టమర్లకు రెండు గంటల్లో మొబైల్‌ను చేరవేస్తున్నాం’ అని వివరించారు. స్టోర్‌ను ప్రారంభిస్తున్న బాలాజీ చౌదరి, నిఖిలేశ్ తదితరులు -
లిఫ్ట్ కింద పడి కంపెనీ డైరెక్టర్ దుర్మరణం
సాక్షి, ముంబై: ముంబైలో ఒక వ్యాపారవేత్త అనూహ్యంగా లిఫ్ట్ గుంతలో పడి చనిపోవడం కలకలం రేపింది. కోహినూర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ విశాల్ మేవానీ(46)వర్లి ప్రాంతంలో తన స్నేహితుడిని కలవడానికి వెళ్లి దుర్మరణం పాలయ్యారు. వర్లిలోని, బ్యూనా విస్టా భవనంలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సోమవారం అందించిన సమాచారం ప్రకారం విశాల్ బ్యూనా విస్టా భవనంలోని రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు స్విచ్ నొక్కగా ఛానల్ తెరుచుకోవడంతో లిఫ్టు వచ్చిందని భావించి పొరపాటున అడుగుపెట్టాడు. ఇంతలో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నలిఫ్ట్ డోర్ మూయడంతో అది కిందికి వచ్చింది. దీంతో గుంతలో పడి నుజు నుజ్జు అయిపోయాడు. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అధికారులు తీవ్రంగా గాయపడిన అతడిని బయటికి లాగి బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు అరగంట ముందు భార్యతో మాట్లాడిన విశాల్, తన స్నేహితుడిని కలవబోతున్నానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే పంటినొప్పితో బాధపడుతున్నవిశాల్ తన స్నేహితుడి ఫ్లాట్ పక్కన ఉండే డాక్టర్ ను కలిసేందుకు వెళ్లాలనుకున్నారు. ఈయనతో పాటు ఆమె కుమార్తె రేషం కూడా వెంట ఉన్నారు. ఆమె ఏదో కారణంతో కొంచెం వెనక ఉండటంతో విశాల్ అన్యమనస్కంగా లిఫ్ట్ ఎక్కి ప్రాణాలు కోల్పోయాడని మరో నివేదిక తెలిపింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వర్లి పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సుఖ్లాల్ వర్పే తెలిపారు. సాంకేతిక లోపం ప్రమాదానికి కారణమైందని తెలుస్తోందనీ, లిఫ్ట్ మెయింటెనెన్స్ చివరిసారిగా ఎపుడు నిర్వహించిందీ విచారిస్తున్నామన్నారు -
గంటలో మొబైల్ ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే ఏప్రిల్–జూన్ కాలంలో మొబైల్స్ అమ్మకాలు 50 శాతం తగ్గాయని ఐడీసీ గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌తో అమ్మకాలు లేక అద్దెలు, వేతనాల భారం కారణంగా ఆఫ్‌లైన్ రిటైల్ చైన్లు నష్టపోయాయి. అయితే ఈ నష్టాన్ని పూరించుకోవడానికి మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్స్ ఆన్లైన్ సేల్స్‌ను ఆసరాగా చేసుకున్నాయి. చిన్న పట్టణాల్లోనూ స్టోర్లు, సొంత నెట్వర్క్ ఉండడం వీటికి కలిసి వస్తోంది. ఈ–కామర్స్‌కు ధీటుగా ఇవి పోటీకి సై అంటున్నాయి. ఔట్లెట్లు ఉన్న ప్రాంతాల్లో ఒక గంటలోనే మొబైల్‌ను డెలివరీ చేసి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. అంతేకాదు ఈ–కామర్స్ కంపెనీలు ఎంతకైతే విక్రయిస్తున్నాయో అదే ధరను ఇవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. మార్చి ముందుతో పోలిస్తే రిటైల్ చైన్ల ఆన్లైన్ అమ్మకాలు ఇప్పుడు గణనీయంగా అధికం కావడం విశేషం. కోవిడ్‌కు ముందు కొన్ని నగరాల్లో ఈ–కామర్స్ కంపెనీలు 24 గంటల్లో మొబైల్స్‌ను డెలివరీ చేశాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చిన్న పట్టణాల్లోనూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బిగ్ సి, లాట్, బి న్యూ, హ్యాపీ, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ తమ స్టోర్లతో విస్తరించాయి. బిగ్ సి 225 కేంద్రాలు, లాట్ 125, బి న్యూ 75, హ్యాపీ 70, సెలెక్ట్ 70 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు ఇవి స్టోర్ ఉన్న ప్రాంతాల్లో గంటలోనే మొబైల్‌ను అందిస్తున్నాయి. 50 కిలోమీటర్ల లోపు డెలివరీని 90–120 నిముషాల్లోనే పూర్తి చేస్తున్నాయి. కరోన ముందు వరకు అంతంతే నమోదైన ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 10–20 శాతానికి చేరాయని ‘బిగ్ సి’ ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా ఏకంగా 50 శాతం ఉందని చెప్పారు. 5 శాతంగా ఉన్న ఆన్లైన్ సేల్స్ ఇప్పుడు 25 శాతానికి వచ్చాయని ‘బి న్యూ’ ఫౌండర్ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. డిసెంబరుకల్లా ఇది 40 శాతానికి వెళ్తుందన్నారు. ఆన్లైన్ సేల్స్ వేగంగా పుంజుకున్నాయని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. ఈ వారం మరో అయిదు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. మార్చికి ముందు 2 శాతంగా ఉన్న ఆన్లైన్ వాటా ఇప్పుడు 10 శాతానికి ఎగసిందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ పేర్కొన్నారు. సర్వీస్ సపోర్ట్, యాక్సెసరీస్, బీమా సేవలూ కస్టమర్లు అందుకోవచ్చన్నారు. ట్యాబ్లెట్ పీసీల జోరు.. ప్రపంచవ్యాప్తంగా ట్యాబ్లెట్ పీసీలకు మళ్లీ జీవం వచ్చింది. 2020 ఏప్రిల్–జూన్‌లో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధి నమోదైందని పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. మొత్తం 3.75 కోట్ల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఆపిల్ 38 శాతం, శామ్సంగ్ 18.7, హువావే 12.7 శాతం వాటా దక్కించుకున్నాయి. అమెజాన్, లెనోవో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో అల్కాటెల్, సెల్కాన్, లావా వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో పోటీపడుతున్నాయి. దేశంలో రిటైల్ స్టోర్లలో మార్చికి ముందు ఒక శాతంగా ఉన్న ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు నేడు 20 శాతానికి చేరాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు అధికం కావడంతో వీటికి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. ట్యాబ్లెట్స్కు దిగుమతి సుంకం లేకపోవడం కస్టమర్లకు ప్రయోజనంగా ఉంది. -
ఏపీ, తెలంగాణ నుంచి రెండు రిటైల్ చైన్లు ఔట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయంలో ఉన్న రిటైల్ చైన్లు యూనివర్సెల్, హాట్‌స్పాట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ నుంచి తప్పుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సెల్కు చెందిన 26 ఔట్లెట్లను సెలెక్ట్ మొబైల్స్ చేజిక్కించుకుంది. దేశవ్యాప్తంగా యూనివర్సెల్ చేతిలో 200 ఔట్‌లెట్లున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు సతీష్‌బాబు నుంచి ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ గతేడాది యూనివర్సెల్ను చేజిక్కించుకుంది. ఒకానొక స్థాయిలో 450 స్టోర్లతో ఈ సంస్థ మొబైల్స్ రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది. ఈఎంఐ ద్వారా ఫోన్ల అమ్మకం, బ్రాండ్ అంబాసిడర్ నియామకం, లైవ్ డెమో ఏర్పాటును భారత్‌లో తొలిసారిగా యూనివర్సెల్ చేపట్టింది. మిగిలిన ఔట్లెట్ల కొనుగోలుకు ఆ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని సెలెక్ట్ ఫౌండర్ వై.గురు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. నాన్ డిస్క్లోజర్ ఒప్పందం వల్ల డీల్ విలువ చెప్పలేమన్నారు. యూనివర్సెల్ డీల్‌తో ఆగస్టు చివరికల్లా సెలెక్ట్ స్టోర్ల సంఖ్య 50కి చేరుతుందని తెలియజేశారు. తాజా డీల్‌తో ఇక్కడి యూనివర్సెల్ స్టోర్లు సెలెక్ట్‌గా మారతాయి. వేగంగా హ్యాపీ విస్తరణ..: ఇటీవలే రంగ ప్రవేశం చేసిన హ్యాపీ మొబైల్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని హాట్‌స్పాట్ ఔట్లెట్లను దక్కించుకుంది. హాట్‌స్పాట్‌కు ఈ రెండు రాష్ట్రాల్లో 15 కేంద్రాలున్నాయి. ఇక ఇవి హ్యాపీ స్టోర్లుగా మారనున్నాయి. హ్యాపీ ప్రస్తుతం 28 సెంటర్లను నిర్వహిస్తోంది. ఆగస్టులో వీటికి 8 తోడవనున్నాయి. సెప్టెంబరుకల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 50కి చేరుతుందని హ్యాపీ సీఎండీ కృష్ణపవన్ వెల్లడించారు. తాజా డీల్‌తో దక్షిణాది రాష్ట్రాల నుంచి హాట్‌స్పాట్ తప్పుకున్నట్టయింది. ప్రస్తుతం ఇది ఢిల్లీకే పరిమితమైనట్టు సమాచారం. -
ఆఫర్ల మహిమ..సంచలన విక్రయాలు
కోల్ కత్తా: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి దివాళి చాలా ముందుగానే వచ్చింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం జీఎస్టీ అమలుకాబోతుండటంతో ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పించి, వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో కంపెనీలు భారీగా విక్రయాలు నమోదుచేసినట్టు తెలిసింది. గతేడాది పీక్ ఫెస్టివల్ సీజన్ లో అమ్మిన మాదిరిగా ఈ జూన్ నెలలో అధికమొత్తంలో టెలివిజన్లను, రిఫ్రిజిరేటర్లను, ఎయిర్-కండీషనర్లను అమ్మినట్టు కంపెనీలు ప్రకటించాయి. డ్యూరెబుల్ సేల్స్ ఈ నెలలో 85-90 శాతం పెరిగినట్టు కంపెనీలు తెలిపాయి. దీనికి గల ప్రధాన కారణం జీఎస్టీ అమలు కాబోతుండటంతో తాము ఆఫర్ చేసిన పెద్ద మొత్తంలో డిస్కౌంట్లేనని కంపెనీలు ప్రకటించాయి. కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుండటంతో తమ పాత స్టాక్ ను అమ్ముకోవడానికి కంపెనీలు ఈ ఆఫర్లను తీసుకొచ్చాయి. దీంతో 20-45 శాతం ఇన్వెంటరీని ఖాళీ చేసుకున్నాయి. అతిపెద్ద విక్రయ చైన్ లు రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, వివేక్స్, గ్రేట్ ఈస్టరన్, కోహినూర్ లు ఇప్పటికే తమ స్టాక్ నంతా అమ్మేసుకున్నట్టు తెలిసింది. ఈ నెలలో ఈ సంస్థల విక్రయాలు రెండింతలు నమోదైనట్టు వెల్లడైంది. భారీ మొత్తంలో డిస్కౌంట్లు తమ ఆదాయాలు కొంత మాత్రమే ప్రభావం చూపుతాయని ఈ విక్రయ చైన్స్ చెబుతున్నాయి. సాధారణంగా జూన్ నెలలో విక్రయాలు పడిపోతాయని, కానీ ఈ సారి గతేడాది కంటే భారీ మొత్తంలో 80-90 శాతం విక్రయాలు నమోదైనట్టు రిలయన్స్ రిటైల్ డిజిటల్ ఫార్మాట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియన్ బాడే చెప్పారు. అంతేకాక ముంబైకు చెందిన విజయ్ సేల్స్, కోహినూర్ విక్రయాలు కూడా 50 శాతం నుంచి 100 శాతం పైకి ఎగిసినట్టు వెల్లడైంది. గ్రేట్ ఈస్టరన్ అయితే ఏకంగా 120 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు తెలిసింది. ఎక్కువగా ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు అమ్ముడుపోయినట్టు రిటైలర్లు తెలిపారు. టెలివిజన్లకు 42-43 అంగుళాల, 55 అంగుళాల మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా వచ్చినట్టు పేర్కొన్నారు. ఓపెన్ బాక్స్ స్టాక్(డిస్ ప్లేలో ఉంచిన స్టాక్)పై 40-45 శాతం గరిష్ట డిస్కౌంట్లను ఈ రిటైలర్లు ఆఫర్ చేశాయి. వచ్చే నెల నుంచి కన్జ్యూమర్ డ్యూరెబుల్స్ ధరలు కూడా 3-5 శాతం పెరుగబోతున్నాయి.