ఉత్తరప్రదేశ్‌లో గీజర్ పేలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పసుపు పారాణి ఆరకముందే నవ వధువు తన అత్తమామల ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ పేలుడులో ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. బరేలీలోని మీర్‌గంజ్ ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
బులంద్‌షహర్‌లోని కలే క నగ్లా గ్రామానికి చెందిన యువతికి ఈ నెల 22న పిపల్సనా గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తరువాత అత్తారింటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం అత్తగారింట్లో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కు వెళ్లిన అమ్మాయి ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు పలుమార్లు పిలిచినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, బాత్రూమ్ తలుపు పగులగొట్టి చూశారు. ఆ సమయంలో ఆమె నేలపై అపస్మారక స్థితిలో పడి ఉంది. గీజర్ పేలిపోయింది.
వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment