
నిజాలు దేవుడికెరుక: ఏది నిజం? అబద్ధం?
నిజాన్ని ఎంతోకాలం దాచలేం. అబద్ధాన్ని నిజమని ఎక్కువకాలం నమ్మించనూలేం. కానీ జెన్నిఫర్ జాక్సన్ హత్య విషయంలో బయటకు రాకుండా ఎన్నో నిజాలు దాగివున్నాయి. ఎన్నో అబద్ధాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ జెన్నిఫర్ జాక్సన్? ఆమెను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు?
సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నిఫర్‌ని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, ఆమె చాలా గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది.
జూన్ 5, 2005. షెల్బీ కౌంటీ (అమెరికా)
ఉదయం అయిదున్నర దాటుతోంది. మెంఫిస్ ప్రాంతంలోని ఆ ఇంట్లో అప్పటికే హడావుడి మొదలైంది. పిల్లలతో కలిసి పిక్నిక్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడంతో యజమానురాలు శారా ఐదు గంటలకే లేచి ఏర్పాట్లు మొదలెట్టింది. భర్త జాయ్ ఆమెకు సహకరిస్తున్నాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది.
‘‘ఇంత పొద్దునే ఎవరొచ్చారు జాయ్, వెళ్లి చూడు’’ అంది శారా. ప్యాక్ చేస్తోన్న శాండ్‌విచెస్‌ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లాడు జాయ్. తలుపు తీయగానే ఎదురుగా కనబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.
‘‘నోరా... నువ్వేంటి ఈ టైమ్‌లో... ఏమయ్యింది’’ అన్నాడు ఆతృతగా. నోరా కళ్లలో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘అంకుల్... ఓసారి నాతో వస్తారా?’’ అంది నోరా వణుకుతున్న కంఠంతో.
‘‘ఏమయ్యింది నోరా?’’
‘‘నేనిప్పుడే ఇంటికొచ్చానంకుల్. ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపు తీయట్లేదు. భయంగా ఉంది.’’
‘‘అవునా... పద చూద్దాం’’ అంటూ నోరాతో కలిసి రోడ్డుకు అవతల ఉన్న ఇంటివైపు నడిచాడు. ఇద్దరూ తలుపులు బాదారు. కానీ తలుపు తెరచు కోలేదు. ‘‘లాభం లేదు... తలుపు పగులగొడదాం’’ అన్నాడు జాయ్. ఇద్దరూ కలిసి తలుపులు పగులగొట్టారు. వెంటనే తల్లి గదిలోకి పరుగుదీసింది నోరా. మరుక్షణం కెవ్వున అరిచింది. జాయ్ గబగబా వెళ్లాడు.
అక్కడ... బెడ్‌రూమ్‌లో... మంచం పక్కన... రక్తపు మడుగులో పడివుంది జెన్నిఫర్ జాక్సన్. అసలు ఆమె ఒంట్లో ఒక్కచుక్క రక్తమైనా మిగిలివుందా లేదా అన్నంతగా రక్తం ధారలు కట్టింది. పెదవులు చితికిపోయాయి. పొట్ట చీలిపోయి పేగులు బయటకు వచ్చేశాయి. ఒళ్లంతా తూట్లు పడిపోయి భయానకంగా ఉంది.
‘‘మమ్మీ’’ అంటూ భోరుమంది నోరా. జాయ్ నోరాని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘నో మై చైల్డ్... భయపడకు. ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం’’ అన్నాడు. అంత దుఃఖాన్నీ నియంత్రించుకుని నంబర్ డయల్ చేసింది నోరా.
బాండ్ ట్రేడర్ అయిన జెన్నిఫర్ జాక్సన్ (39) గురించి ఎవరినడిగినా చెబుతారు. వ్యాపారం ఎంత కచ్చితంగా చేస్తుందో... వ్యక్తిత్వపరంగా అంత నిక్కచ్చిగా ఉంటుందంటూ సర్టిఫికెట్ ఇస్తారు. అలాంటి మంచి మనిషిని యాభైసార్లు పొడిచి చంపేంత పగ ఎవరికి ఉంటుందో అర్థం కాలేదెవరికీ.
పోలీసులు ఇల్లంతా సోదా చేశారు. జెన్నిఫర్ బెడ్‌రూమ్ కిటికీ పగులగొట్టి ఉంది. హంతకుడు దానిగుండానే రాక పోకలు సాగించి ఉంటాడని అంచనా వేశారు. అయితే దాని మీద వేలిముద్రలేవీ దొరక్కపోవడం విస్మయపరిచింది. సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నీని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది. దాంతో ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో అర్థం కాలేదు పోలీసులకి. వారు మౌనంగా ఉండటం నోరాకి కోపం తెప్పించింది.
‘‘ఏంటి సర్ ఇది? మా అమ్మని దారుణంగా చంపేశారు. మీరేమో... వాళ్లని పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారు.’’
నోరా మాటకి ఒళ్లు మండింది ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌కి. ఆవేశంగా ఏదో అనబోయాడు. కానీ అధికారి లివింగ్‌స్టన్ ఆపడంతో గమ్మునుండిపోయాడు.
‘‘మిస్ నోరా... మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎవరిని అడిగినా మీ అమ్మగారికి శత్రువులు లేరని చెబుతున్నారు. అనుమానాస్పదమైన వ్యక్తులెవరూ మీ అమ్మగారి జీవితంలో లేకపోవడం వల్ల కేసు కదలడం లేదు’’ అన్నాడు లివింగ్‌స్టన్ అనునయంగా. శాంతించింది నోరా. ‘‘ఒక్కసారి పాస్టర్ ఇర్విన్‌తో మాట్లాడండి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో’’ అంది.
‘‘అతడెవరు?’’
‘‘అమ్మ అతడిని ప్రేమించింది. కానీ కొద్దిరోజుల క్రితం ఏదో తేడా వచ్చి దూరమైపోయింది. అది మనసులో పెట్టుకుని అతడేమైనా...’’
ఆమె ఏం చెబుతోందో అర్థమైంది లివింగ్‌స్టన్‌కి. వెంటనే తన టీమ్‌తో పాస్టర్ మార్క్ ఇర్విన్ ఇంటికి బయలుదేరాడు.
‘‘వాట్ నాన్సెన్స్... నేను జెన్నీని చంపడమేంటి?’’
సూటిగా అన్నాడు ఇర్విన్. ‘‘అంటే మీకు జెన్నిఫర్ మీద కోపం లేదా’’... ఇర్విన్‌ని నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అన్నాడు లివింగ్‌స్టన్. ‘‘లేదు, ఉండదు కూడా. మేమిద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేసినమాట నిజమే. కానీ ఏవో పొరపొచ్చాలు వచ్చాయి. దూరంగా ఉందామనుకున్నాం... ఉంటున్నాం. ఇంత మాత్రానికే ఆమెని నేను చంపేశాననడం హాస్యాస్పదంగా ఉంది. నాకే కాదు... జెన్నీని చంపాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు... నోరాకి తప్ప.’’ ఉలిక్కిపడ్డాడు లివింగ్‌స్టన్. ‘‘ఏం మాట్లాడుతున్నారు?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘నోరా చంపిందని అనడం లేదు. కానీ ఈ లోకంలో జెన్నీకి అతి పెద్ద శత్రువు నోరాయే.
హత్య జరిగిన ప్రదేశంలో నోరా వేలిముద్రలు గానీ, పాదముద్రలు గానీ, ఆమెకు సంబంధించిన ఎటువంటి ఆధారం గానీ లభించలేదు. పైగా జెన్నీ చేతిలో ఎవరివో వెంట్రుకలు దొరికాయి. డీఎన్‌ఏ పరీక్ష చేస్తే అవి నోరావి కాదని తేలింది. అంటే చనిపోకముందు జెన్నీ ఎవరితోనో పెనుగులాడింది. అతడి తల వెంట్రుకలు ఆమె చేతిలో చిక్కుకున్నాయి. మరి అతడెవరో తెలుసుకోవాలి కదా! అది మానేసి నోరాని నిందితురాలిని చేయడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ దానికి స్పందించడం లేదు.
ఇరవయ్యేళ్ల వయసులో నోరాకి జన్మనిచ్చింది జెన్నీ. తర్వాత కొద్ది కాలానికే భర్తతో విడిపోయింది. కూతుర్ని కష్టపడి పెంచింది. కానీ ఆమె కష్టాన్ని నోరా అర్థం చేసుకోలేదు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యింది. తిరుగుళ్లకు అలవాటు పడింది. తన కోసం జెన్నీ ఎంత ఆవేదన చెందేదో నాకు తెలుసు.’’ ‘‘అంత మాత్రాన తల్లిని చంపేస్తుందంటారా?’’ ‘‘చెప్పానుగా... నోరా చంపిందని నేను అనడం లేదని. తను తప్ప జెన్నీని బాధపెట్టేవాళ్లు ఎవరూ లేరని చెబుతున్నాను అంతే.’’ కేసును ముందుకు నడిపించడానికి పెద్ద ఆధారమే దొరికింది లివింగ్‌స్టన్‌కి.
‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా... ఏం మాట్లాడుతున్నారు?’’... అరిచినట్టే అంది నోరా. లివింగ్‌స్టన్ నవ్వాడు. ‘‘పిచ్చి పట్టలేదు... నిజం తెలిసింది. ఆ రోజు ఉదయం ఐదు గంటల వరకూ ఎక్కడికెళ్లావ్?’’ అన్నాడు చాలా కూల్‌గా. ‘‘రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్లాను. లేటయ్యింది. అందుకే తెల్లవారు జామున వచ్చాను.’’ ‘‘అవును. తెల్లవారుజామున ఇంటికొచ్చావ్. అయితే ఐదు గంటలకి కాదు. నాలుగింటికే. మీ అమ్మని చంపేశావ్. ఎవరికీ అనుమానం రాకుండా లోపల గడియ పెట్టి, కిటికీ పగులగొట్టి పారిపోయావ్. తర్వాత ఏమీ ఎరగనట్టు ఎదురింటాయన దగ్గరకు వెళ్లి సాయమడిగావ్.’’
‘‘నో నో నో’’... స్టేషన్ అదిరిపోయేలా అరిచింది నోరా. ‘‘అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. మీ అమ్మని నువ్వే చంపావ్. అప్పుడు నీ చేతిమీద కత్తిగాటు కూడా పడింది. నాలుగున్నర ప్రాంతంలో మీ ఇంటికి దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కొనుకున్నావ్. మీ ఇంటి దగ్గర, డిస్పెన్సరీ దగ్గర ఉన్న సీసీ టీవీ ఫుటేజుల్లో మొత్తం రికార్డయ్యింది.’’
ఏదో చెప్పాలనుకుంది నోరా. కానీ మాట తడబడింది. గొంతు వణికింది. దాంతో నేరం ఆమే చేసిందని నిర్ధారణ అయ్యింది. సెప్టెంబర్ 29, 2005న నోరా అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ వేగంగా జరిగిపోయింది. నోరా డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యిందని, దాని గురించి తల్లీకూతుళ్లకు ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేదని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు. నోరా చెడు తిరుగుళ్లతో జెన్నీ విసిగిపోయిందని, పద్ధతి మార్చుకోకపోతే వెళ్లి ఎక్కడైనా హాస్టల్‌లో ఉండమని నోరాకి జెన్నీ చెప్పేసిందని, ఆ కోపంతోనే తల్లిని చంపి ఉంటుందని జెన్నిఫర్ తల్లి చెప్పింది. జెన్నీకి ఏదైనా అయితే తనకు ఎంత ఆస్తి వస్తుందని నోరా అడిగిందని జెన్నిఫర్ సోదరుడు సాక్ష్యం చెప్పాడు. దాంతో నోరాయే జెన్నిఫర్‌ని చంపిందని కోర్టు నమ్మింది. ఇరవయ్యేళ్ల జైలుశిక్ష విధించింది.
బెయిల్‌కు అప్లై చేయడానికి వీల్లేదంటూ కండిషన్ కూడా పెట్టింది. ప్రస్తుతం నోరా జైల్లో ఉంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన ఆమె... ఇనుప ఊచల వెనుక ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. జీవితం నేర్పిన పాఠాన్ని జైలు గోడల మధ్య చదువుకుంటోంది. కానీ ఇప్పటికీ ఆమె తాను నిర్దోషిననే అంటోంది. ఆమే కాదు... నోరా నేరస్తురాలు కాదు అనేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఏ ఆధారం దొరకనందుకు నోరాని నేరస్తురాలిని చేశారని కొందరు అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో జెన్నీ మాత్రమే చెప్పగలదు. కానీ ఆమె తిరిగిరాదు. మరి నిజం ఎలా తెలుస్తుంది? నోరా నేరం చేసిందో లేదో ఎలా తేలుతుంది? ఆమె నిర్దోషే అయితే ఏ శక్తి ఆమెను కాపాడుతుంది? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక!
- సమీర నేలపూడి