Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే? | The Indrani Mukerjea Story Buried Truth Review In Telugu, Controversial Series On Sheena Bora Murder - Sakshi
Sakshi News home page

Buried Truth Review In Telugu: బరీడ్ ట్రూత్… కాంటెంపరరీ స్టోరీతో కొత్త ప్రయోగం!

Published Sun, Mar 3 2024 5:28 PM

The Indrani Mukerjea Story Buried Truth Review In Telugu - Sakshi

మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

రాజ్దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్‌ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది.

2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది.

షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. 

షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై  ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. 

ప్రేక్షకులకు చివరిగా ఒక మాట…  కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్‌లా ఇంద్రాణి డైలాగ్స్‌ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే  హైలట్‌గా నిలిచింది. 


-ఇస్మాయిల్, ఇన్‌పుట్‌ ఎడిటర్, సాక్షి టీవీ


 

Advertisement
Advertisement