నిజాలు దేవుడికెరుక: ఎలసాని చంపిందెవరు? | Funday book of the week : Elisani killed someone | Sakshi
Sakshi News home page

నిజాలు దేవుడికెరుక: ఎలసాని చంపిందెవరు?

Published Sun, Jun 8 2014 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

నిజాలు దేవుడికెరుక: ఎలసాని చంపిందెవరు?

నిజాలు దేవుడికెరుక: ఎలసాని చంపిందెవరు?

దేశం కాని దేశంలో, ఓ స్టార్ హోటల్‌లో, ఊహించని విధంగా మరణించింది ఎలిసా ల్యామ్. ఆమె మృతికి కారణాలను అన్వేషిస్తే కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి. కొన్ని నమ్మలేని వాస్తవాలు బయటపడి భయపెట్టాయి. అవి యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నాయి. అసలింతకీ ఎవరీ ఎలిసా ల్యామ్?  ఎందుకు చనిపోయింది? ఆమె మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
 
 ఫిబ్రవరి 19, 2013. లాస్ ఏంజిల్స్ (అమెరికా)లోని సెసిల్ హోటల్.  గది తలుపులు తెరచుకుని ఆవేశంగా బయటకు వచ్చాడు నెల్సన్. వడివడిగా రిసెప్షన్ వైపు నడిచాడు. నైట్‌గౌన్ కూడా మార్చుకోకుండా వస్తోన్న అతడి ముఖంలోని భావాలను బట్టి కచ్చితంగా ఏదో కంప్లయింట్ చేయడానికే వస్తున్నాడని అర్థమైంది మేనేజర్‌కి. అయినా కూడా ముఖానికి నవ్వు పులుముకుని మర్యాదగా పలకరించాడు. ‘‘గుడ్‌మార్నింగ్ సర్’’.  ‘‘వెరీ బ్యాడ్ మార్నింగ్ మేనేజర్. మీ సర్వీసెస్ ఇంత చెత్తగా ఉంటాయని అనుకోలేదు.’’
 చురుక్కుమంది మేనేజర్‌కి. ‘‘ఏం సర్... ఏదైనా సమస్యా’’ అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో.
 ‘‘నిన్నట్నుంచీ చెబుతున్నాను... నీళ్ల రుచి ఏదో తేడాగా ఉందని, కొద్దిగా వాసన కూడా వస్తున్నాయని. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఏదైనా సమస్యా అని తీరిగ్గా అడుగుతున్నావ్?’’
 నెల్సన్ అరుపులకు హాలు దద్దరిల్లింది. ‘‘సారీ సర్. ఇంకోసారి ఇలా జరగదు. ఇప్పుడే చెక్ చేయిస్తాను. కాసే పట్లో సమస్యను పరిష్కరిస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి’’ అభ్యర్థించాడు మేనేజర్.
  నెమ్మదించాడు నెల్సన్. ‘‘సరే సరే... త్వరగా కానివ్వండి’’ అనేసి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్లిపోయాడు. బీపీ పెరిగిపోయింది మేనేజర్‌కి. వెంటనే బాయ్‌ని పిలిచాడు. ఆ పిలుపు అరుపులా ఉండటంతో పరిగెత్తుకు వచ్చాడతను.
 ‘‘పిలిచారా సార్?’’.
 ‘‘అరిచాను. అది వినిపించేగా వచ్చావ్. నీళ్లు ఏదో వాసన వస్తున్నాయట. రుచి కూడా తేడాగా ఉందట. వెంటనే క్లీనింగ్ సెక్షన్‌కి ఇన్‌ఫామ్ చేసి ట్యాంకులు ఎలా ఉన్నాయో చూడమను.’’
 అతడి మాట పూర్తయ్యీ అవ్వడంతోనే పరుగున వెళ్లిపోయాడు బాయ్.
 ‘‘పేరుకి స్టార్ హోటల్. ఒక్కడూ సరిగ్గా పని చేసి చావడు. అందరి తరఫునా నేనే సమాధానం చెప్పాలి... ఖర్మ’’ విసుక్కుంటూనే తన పనిలో నిమగ్నమయ్యాడు మేనేజర్.
    
 ‘‘సార్... సార్... సార్...’’
 ఆయాసపడుతూ వచ్చిన బాయ్‌వైపు విసుగ్గా చూశాడు మేనేజర్. ‘‘ఏంటా కంగారు? ఏం కొంప మునిగింది?’’
 తన పనిని డిస్టర్బ్ చేశాడన్న కోపం ఉంది అతడి మాటల్లో.
 ‘‘ట్యాంకులు చూడమన్నారు కదా సార్. క్లీనింగ్ వాళ్లు వెళ్లి చూశారు. ఓ ట్యాంకులో నీళ్లు వాసన వస్తున్నట్టు అనిపించిందట. ఏంటా అని చూస్తే... అందులో... లోపల...’’
 ‘‘ఏముంది లోపల?’’
 ‘‘శవం ఉంది సార్’’
 ఉలిక్కిపడ్డాడు మేనేజర్. ‘‘ఏంటీ... శవమా?’’
 ‘‘అవును సార్. ఓ అమ్మాయి శవం ఉంది.’’
 ఫైల్ మూసి లేచాడు మేనేజర్. బాయ్‌తో కలిసి హోటల్ పైకి పరుగుతీశాడు. పైన నాలుగు ట్యాంకులు ఉంటాయి. వాటిలో ఒక ట్యాంకువైపు చూపించారు స్టాఫ్. అందులోకి తొంగిచూసిన మేనేజర్ అవాక్కయిపోయాడు. నీటి అడుగున వుంది ఒక అమ్మాయి మృతదేహం. నలుపురంగు స్కర్ట్, ఎరుపురంగు కోట్ వేసుకుంది. చెప్పులు కాళ్ల నుంచి విడిపోయి కాస్త దూరంగా పడి ఉన్నాయి. శరీరం ఉబ్బిపోయి గుర్తుపట్టకుండా ఉంది. దాన్ని చూస్తూనే గుండె గుభేల్‌మంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇరవై నిమిషాల్లో పోలీసులు హోటల్లో ఉన్నారు. అమ్మాయి శవాన్ని బయటకు తీయించి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. విచారణలో చనిపోయిన అమ్మాయి ఎలిసా ల్యామ్ (21) అని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ హోటల్లో దిగింది. ఉన్నట్టుండి మాయమయ్యింది. ఇప్పుడిలా శవమై తేలింది. అసలేం జరిగింది? ఎలిసా ఎందుకు మరణించింది? ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా?  
 
 ఏడు వందల గదులుండే సెసిల్ హోటల్‌లో అనుమానాస్ప దంగా మరణించినవారు ఎలిసా కంటే ముందు చాలామంది ఉన్నారు. ఓ మహిళ మూడో అంతస్తులోని తన గది నుంచి, ఇంకో మహిళ నాలుగో అంతస్తులోని గది నుంచి కింద పడి మరణించారు. మరో మహిళ అయితే పైనుండి తిన్నగా వచ్చి రోడ్డు మీద వెళుతోన్న ఒక వ్యక్తి మీద పడింది. ఇద్దరూ మరణించారు. ఇవన్నీ ఆత్మహత్యలని పోలీసులు అన్నా... ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది ఇప్పటికీ తెలీలేదు. ఎలిసా ఉదంతం మరీ భయానకంగా ఉండటంతో... సెసిల్ హోటల్లో దెయ్యాలున్నాయని, అవే ప్రాణాలు తీస్తున్నాయనే నమ్మకం బలపడింది!
    
 ‘‘నాకు తెలియదు సర్. నేను ఆ అమ్మాయిని ఒకట్రెండుసార్లు మాత్రమే చూశాను. జనవరి చివరి వారంలో తను  హోటల్లో దిగింది. జనవరి 31న బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. బిల్లు కట్టలేక వెళ్లిపోయిందేమో అనుకున్నాం.’’ ఒళ్లు మండింది ఇన్‌స్పెక్టర్‌కి. ‘‘ఏంటీ... బిల్లు కట్టలేక వెళ్లిపోయిందని అనుకున్నారా? అలాంటి అమ్మాయి ఇంత పెద్ద హోటల్లో ఎందుకు బస చేస్తుంది? అయినా మీకు మీరు ఊహించేసు కోవడమేనా? ఆమెకేమైనా అయ్యిందేమో నని ఆలోచించక్కర్లేదా? తల దించుకున్నాడు మేనేజర్. ‘‘సారీ సర్. అంత ఆలోచించలేదు. బిల్లు ఎగ్గొట్ట డానికి చాలామంది అలా చేస్తుంటారు. అందుకే అలా ఆలోచించాం.’’ మేనేజర్ మాటల్లో అబద్ధం గోచరించలేదు పోలీసులకు. అలాగని ఎలిసా మరణానికి కారణం కూడా ఎంతకీ బోధపడలేదు. నీటిలో ఊపిరాడక ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చెబుతోంది. కానీ అసలామె నీటిలో ఎలా పడింది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పైనుంచి దూకొచ్చు. ఉరి వేసుకోవచ్చు. మరేదైనా మార్గం ఎంచుకోవచ్చు. కానీ అంత ఎత్తుకు వెళ్లి, బరువైన ట్యాంకు మూతను తీసి, అంత ఎత్తయిన ట్యాంకులోకి కష్టపడి దూకి మరణించాలని ఎందుకనుకుంటుంది? పైగా ట్యాంకులో దూకిన తరువాత మూత ఎలా వేస్తుంది?
 
 చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరీ అర్థం కాని విషయం ఏమిటంటే... ఎలిసా కెనడా అమ్మాయి. ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం అమెరికాకి వచ్చింది. సెసిల్ హోటల్లో బస చేసింది. దేశం కాని దేశంలో ప్రాణాలు ఎందుకు తీసుకుంటుంది? ఒకవేళ ఎవరైనా చంపివుంటారా? ఆ దిశగా ఎంక్వయిరీ మొదలుపెట్టారు పోలీసులు. కానీ అనుమానించదగ్గ విషయాలేమీ తెలియలేదు. ఎలిసా చాలా మంచి అమ్మాయని, అజాతశత్రువని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులు చెప్పారు. అలాంటి ఆమెని ఎవరు చంపుతారు? ఒకవేళ ఇక్కడే ఎవరైనా ఆమె మీద కన్నేశారా అంటే ఆమె మీద అత్యాచారం జరగలేదు. దాంతో ఆమె మరణానికి కారణాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యారు పోలీసులు.
    
 ‘‘ఏంటి కేసు ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంది? ఒక్క క్లూ కూడా లేదు’’... నుదురు రుద్దుకుంటూ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘నాకో డౌటు సర్. బయటకు వెళ్లిన ఎలీసా తిరిగి రాలేదని మేనేజర్ చెప్పాడు. కానీ ఆమె చనిపోయింది హోటల్‌లోనేగా! లోపలకు రాకుండా బిల్డింగ్ పెకైలా వెళ్లింది?’’ సబార్డినేట్ వైపు మెచ్చుకోలుగా చూశాడు ఇన్‌స్పెక్టర్. నిజమే. బయట చంపి, శవాన్ని తెచ్చి అక్కడ పారేయడం అసాధ్యం. పైగా నీటిలో మునిగే చనిపోయిందని రిపోర్ట్ చెబుతున్నాయి. అంటే ఆమె హోటల్‌కి వచ్చింది. ఇలా ఆలోచించగానే బుర్రలో తళుక్కున మెరిసింది ఓ ఆలోచన. వెంటనే సబార్డినేట్‌ను తీసుకుని సెసిల్ హోటల్‌కి బయలుదేరాడు. కానీ అక్కడ తాను ఊహించని, ఊహించలేని విషయం ఒకటి తనకోసం ఎదురు చూస్తోందని అతడికి తెలియదు.
    
 సెసిల్ హోటల్ లిఫ్టులోని సీసీ కెమెరా ఫుటేజ్ రన్ అవుతోంది. సబార్డినేట్, మేనేజర్‌తో కలిసి చూస్తున్నాడు ఇన్‌స్పెక్టర్. ఈ దెబ్బతో కచ్చితంగా నిజం తెలిసిపోతుంది. సెసిల్ ఎప్పుడు బయటకు వెళ్లింది, ఎప్పుడు వచ్చింది అన్న స్పష్టత వస్తుంది. అందుకే ఆతృతగా చూస్తున్నాడు. వీడియోలో సమయం సరిగ్గా 1:57 అయ్యింది. నల్ల స్కర్ట్, ఎర్ర కోట్ వేసుకుని ఎలిసా లిఫ్టులోకి నడచుకుంటూ వచ్చింది. వచ్చేటప్పుడు కూల్ గానే ఉంది. కానీ లోనికి అడుగు పెట్టీ పెట్టగానే లిఫ్టులో ఉన్న బటన్స్ అన్నీ టకటకా నొక్కేయడం మొదలుపెట్టింది. లిఫ్టు తలుపు మూసుకోలేదు. దాంతో తలుపువైపే క్షణంపాటు చూసి, మళ్లీ బటన్స్ అన్నీ నొక్కేసింది. అయినా తలుపు మూసుకోలేదు. తలుపు దగ్గరకు వెళ్లి బయటకు తొంగి చూసింది. మళ్లీ లోనికొచ్చి బటన్స్ నొక్కసాగింది. ఇన్‌స్పెక్టర్ భృకుటి ముడిపడింది. ఏంటిదన్నట్టు సబార్డినేట్ వైపు చూశాడు. అతడు అయోమయంగా చూస్తున్నాడు. మేనేజర్‌కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. ముగ్గురూ ముఖాలు చూసుకుని మళ్లీ వీడియో వైపు దృష్టి సారించారు.
 
 లిఫ్టు బయటకు వెళ్లి నిలబడింది ఎలిసా. ఆ తర్వాత ఆమె ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. ఎవరితోనో మాట్లాడసాగింది. ఆమె చేతులు వంకర్లు తిరిగిపోతున్నాయి. ఎంతగా అంటే... మనుషులెవరూ తమ చేతుల్ని అలా తిప్పలేరు. ఆమె కాళ్లు కూడా వెనక్కి తిరిగి కనిపిస్తున్నాయి. ఏవోవో చేష్టలు చేస్తోంది. అక్కడ ఎవరూ లేకపోయినా ఏదేదో మాట్లాడేస్తోంది. తర్వాత మళ్లీ లిఫ్టులోకి వచ్చింది. బటన్స్ నొక్కింది. బయటకు వెళ్లింది. ఉన్నట్టుండి మాయమైపోయింది. విచిత్రం ఏమిటంటే... ఎలిసా మాయమవగానే లిఫ్టు తలుపు మూసుకుంది. ఇన్‌స్పెక్టర్ షాకైపోయాడు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఎలిసా ఎందుకలా ప్రవర్తించింది?’’ అన్నాడు అయోమయంగా. ‘‘చూస్తుంటే ఏదో దెయ్యం పట్టినట్టుగా అనిపిస్తోంది సర్...’’  సబార్డినేట్ మాటలకు విస్తుపోయాడు ఇన్‌స్పెక్టర్. దెయ్యం పట్టిందా? అంటే దెయ్యమే ఆమెని చంపిందా? అది సాధ్యమా? ఇన్‌స్పెక్టర్ మనసులో మెదిలిన ఈ ప్రశ్నలకు అతడికే కాదు... ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. ఇప్పటికీ ఎలిసా మరణం ఓ మిస్టరీనే. వైద్యులేమో ఆమె ఉన్నట్టుండి బైపోలార్ డిజార్డర్ బారిన పడిందని, అందుకే అలా ప్రవర్తించిందని అన్నారు. కానీ ప్రపంచంలో సగానికి పైగా ఎలిసాని దెయ్యమే చంపిందని నమ్ముతున్నారు. అది నిజమేనా? ఆ లిఫ్టులో దెయ్యముందా? అదే ఎలిసాని  చంపేసిందా? ఏమో... నిజాలు దేవుడికెరుక!
  - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement