విషాద గీతిక | A sad story of the week | Sakshi
Sakshi News home page

విషాద గీతిక

Published Sun, Jun 29 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

విషాద గీతిక

విషాద గీతిక

ప్రేమించడం తప్పు కాదు. గుడ్డిగా ప్రేమించడం తప్పు.
ప్రేమ పేరుతో తప్పటడుగులు వేయడం తప్పు.
గీతికాశర్మ... ఆ తప్పే చేసింది. కళ్లు మూసుకుని అడుగు వేసేసింది.
ఆ అడుగును వెనక్కి తీసుకోలేక శాశ్వతంగా కన్నుమూసింది.
 కొన్ని తప్పులంతే...  పరిహారంగా జీవితాలను కోరతాయి!!

 
 ‘‘ఆడపిల్లని పువ్వుతో పోలుస్తారు... సుకుమారంగా ఉంటుందని కాదు, పదిలంగా చూసుకోవాలని. కానీ ఈ మగవాళ్లకు ఆ సౌకుమార్యం బలహీనతలా కనిపిస్తున్నట్టుంది. అందుకే నలిపి పారేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. నా కూతురేం పాపం చేసింది... దానినెందుకిలా చేశారు? వాళ్లని వదలకూడదు. కఠినంగా శిక్షించాలి. నా చిట్టితల్లి గుర్తొచ్చినప్పుడల్లా కడుపులో పేగు కదులుతున్నట్టుంది. తన స్వరం పదే పదే నా చెవులకు వినిపిస్తోంది. నాకు అన్యాయం జరిగిందమ్మా అని ఘోష పెడుతున్నట్టుగా ఉంది. తన రూపం నిరంతరం కళ్లముందు కనిపిస్తోంది. నాకు న్యాయం చేయలేవా అని దీనంగా ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ నరక యాతన నేను భరించలేను. ఈ మనోభారాన్ని ఇక మోయలేను.
 
 జ్ఞాపకాలు బతికిస్తాయంటారు. కానీ నా కూతురి జ్ఞాపకాలు నాకు బతికే ధైర్యాన్నివ్వడం లేదు. తను లేని శూన్యంలో బతుకీడ్చలేనేమోనన్న భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే వెళ్లిపోతున్నాను. ఈ లోకం నుంచి, కడుపు శోకం నుంచి... శాశ్వతంగా వెళ్లిపోతున్నాను.’’
 కూతురికి జరిగిన అన్యాయాన్ని సహించలేక, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఓ కన్నతల్లి రాసిన మరణలేఖ ఇది. ఈ అక్షరాల వెనుక అంతులేని ఆవేదన ఉంది. ఆ ఆవేదన వెనుక వంచితురాలైన ఓ ఆమాయక ఆడపిల్ల కథ ఉంది.
    
 ఆగస్ట్... 2012... హర్యానా...  కాలింగ్‌బెల్ మోగుతోంది.
 ‘‘ఏవండీ... తలుపు తీయొచ్చుగా. ఏరా... కాసేపు టీవీ దగ్గర్నుంచి లేచి వస్తే కొంపలు మునిగిపోతాయా’’... వంటింట్లోంచి విసుక్కుంటూ వచ్చింది అనూరాధ. భర్త, కొడుకుల బద్దకం చూసి కోపమొచ్చిందామెకి. ‘‘తలుపు తీయడం కూడా పెద్ద పనిలా ఫీలైపోతున్నారిద్దరూ’’ అని గొణుక్కుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
 
 ‘‘గీతూ.. ఏంట్రా, మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేశావ్’’ అంది ఆనందం, అనురాగం కలగలిసిన గొంతుతో. ఆ మాట వింటూనే భర్త, కొడుకు కూడా గబగబా లేచి వచ్చేశారు. గుమ్మంలో నిలబడి ఉన్న గీతికను చూడగానే వాళ్ల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అనూరాధ కళ్లు చాలాకాలం తర్వాత కూతుర్ని చూసిన ఆనందంలో వర్షిస్తూనే ఉన్నాయి.  ‘‘ఏంటమ్మా నువ్వు... వెళ్లినా ఏడుస్తావ్, వచ్చినా ఏడుస్తావ్’’ అన్నాడు గీతిక తమ్ముడు తల్లిని ఆటపట్టిస్తూ. నవ్వుతూ అనూరాధ కళ్లొత్తుకుంది. అందరూ కలిసి గీతికను లోనికి తీసుకెళ్లారు. గీతిక రాకతో  అందరి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూసినట్టయ్యింది. ఇల్లంతా వెన్నెల విరజిమ్మినట్టయ్యింది. కానీ గీతిక కళ్లలో మాత్రం చీకటి. దాన్ని అనూరాధ మాత్రమే గుర్తించగలిగింది. కూతుర్ని పక్కకు తీసుకెళ్లి అడిగింది... ‘‘ఏమైందిరా.. అలా ఉన్నావేం?’’
 తల్లి అలా అడగడంతోనే బావురుమంది గీతిక. గుండె బరువు తీరేలా వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత మెల్లగా అంది... ‘‘నేను ఉద్యోగం మానేసి వచ్చేశానమ్మా.’’
 అనూరాధ షాకయ్యింది. గీతిక పనిలో ఎంత నిజాయతీగా, నిబద్ధ్దతతో ఉంటుందో కూడా తెలుసు. అలాంటిది పని మానేసి వచ్చేసిందంటే ఏమై ఉంటుంది! అదే అడిగింది.
 ‘‘సమస్యేమీ లేదమ్మా. చేయబుద్ధి కావట్లేదు. ఇంకోటేదైనా ట్రై చేస్తాలేమ్మా.’’
 గీతిక నిజం చెప్పట్లేదేమో అనిపిం చింది అనూరాధకి. తర్వాత చెబుతుందిలే అని ఇక రెట్టించలేదు. ‘‘నువ్వేమీ చేయకపోయినా మాకు నష్టం లేదురా. నీకెలా నచ్చితే అలా చెయ్’’ అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకుంది.
    
 ‘‘గీతూ... టిఫిన్ చేద్దువుగాని రా’’... అప్పటికి మూడోసారి అనూరాధ పిలవడం. దిగులుగా ఉంది కదా, వస్తుందిలే అనుకుంది. కానీ ఎంతకీ తను రాకపోవడంతో కూతురి గదికి వచ్చింది. లోపలంతా చీకటిగా ఉంది. గీతికకి రూమ్ చీకటిగా ఉంటే ఇష్టం. పగటిపూట కూడా వెలుతురు లోనికి రాకుండా మూసేస్తుంది. ‘‘ఈ పిల్ల ఇంత చీకట్లో ఎలా ఉంటుందో ఏమో’’ అంటూ లైట్ వేసింది అనూరాధ. అంతే... ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. గీతిక నిర్జీవ శరీరం ఫ్యానుకు వేళ్లాడుతోంది. మెడచుట్టూ చున్నీ బిగుసుకుని ఉంది. కనుగుడ్లు పొడుచుకు వచ్చి భీతిగొల్పుతున్నాయి.
 
 ‘‘గీతూ’’... అనూరాధ అరుపుతో ఇల్లు దద్దరిల్లిపోయింది. భర్త, కొడుకు కంగారుగా వచ్చారు. ఆ దృశ్యం చూసి వాళ్లు కూడా కుప్పకూలిపోయారు. ఏదో జరిగి వుంటుందనుకున్నారు కానీ, ప్రాణాలు తీసుకునేంత దారుణం ఏదో గీతిక పట్ల జరిగిందని ఊహించలేదు వాళ్లు. లేదంటే ఆమెను ఒంటరిగా వదిలేవారు కాదు. ఇలా తమని వదిలి వెళ్లనిచ్చేవారూ కాదు. అసలు గీతిక విషయంలో ఏం జరిగిందో... ఆమె రాసిన సూసైడ్ నోట్ చూసేవరకూ వాళ్లకు తెలియనే లేదు. ఏముందా నోట్‌లో?
 
 గీతికాశర్మ... అందమైనది, తెలివైంది. ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కంది. ఆ కలల్ని నిజం చేసుకుంది. 2006లో ఎం.డి.ఎల్.ఆర్. గ్రూప్‌లో చేరింది. అప్పటికామెకి నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేవు. అయినా ఆమె కల నెరవేరింది. దానికి కారణం... గోపాల్ గోయెల్ కందా. ఎం.డి.ఎల్.ఆర్. ఎయిర్‌లైన్స్ అధినేత. ఇంటర్వ్యూకి వెళ్లినరోజే గోపాల్ కళ్లు గీతికమీద పడ్డాయి. సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతడు గీతికకు ఉద్యోగం ఇచ్చాడు. బాగా పని చేస్తున్నావంటూ గిఫ్టులిచ్చాడు. తెలివైనదానివంటూ అందరికంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. కుటిలమైన ఆలోచనలతో ఆమె కుటుంబానికి కూడా దగ్గరయ్యాడు. అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టిన గీతిక అతడిలోని మరో మనిషిని గుర్తించలేకపోయింది. తెలిసీ తెలియని వయసు... ఎదిగీ ఎదగని మనసు... పెళ్లయ్యి, పిల్లలున్నవాడని తెలిసి కూడా ఆమెను గోపాల్ వలలో పడేలా చేశాయి. తనకంటే ఎన్నో యేళ్లు పెద్దవాడైన వ్యక్తికి దగ్గరైంది... అన్ని రకాలుగా. ఫలితంగా గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. కానీ అతడు ఒప్పుకోలేదు. ఏదో చెప్పి కన్విన్స్ చేశాడు. కడుపులో బిడ్డను కరిగించేశాడు.
 
 ఇంత జరిగినా గోపాల్ మీద సందేహం రాలేదు గీతికకి. అతడు తనను పెళ్లి చేసుకుంటాడనే నమ్మింది. ఎయిర్ హోస్టెస్‌గా పని చేయవద్దు, తన ట్రస్ట్ పనులు చూసుకోమంటే సరే అంది. తాను ఎన్ని కలలు కని ఆ ఉద్యోగంలో చేరిందో కూడా మర్చిపోయి అతడు చెప్పిన చోటికి వెళ్లింది. కానీ అక్కడికెళ్లాక తెలిసింది... గోపాల్ నిజ స్వరూపం. ట్రస్ట్ ఆఫీసు అప్పటికే మరో మహిళ అధీనంలో ఉంది. ఆమె పేరు అంకిత... గోపాల్ రెండవ భార్య. వాళ్లకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. హతాశురాలైంది గీతిక. తానెంత దారుణంగా మోసపోయిందో అర్థమైంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. గోపాల్‌కి ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్లిపోయింది. అతడు చేసిన గాయం మానడానికి చాలా రోజులే పట్టింది. కానీ ఎలానో తేరుకుంది. మళ్లీ ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్‌ని పునఃప్రారంభించింది. ఆ సంగతి తెలిసి రగిలిపోయాడు గోపాల్. ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. తనతో రమ్మని బలవంత పెట్టాడు. కాదంటే బ్లాక్‌మెయిల్ చేశాడు.
 
 గోపాల్ గోయెల్ కందా తండ్రి మురళీధర్ ఎం.డి.ఎల్.ఆర్. కంపెనీని 2007లో స్థాపించారు. అయితే అది రెండేళ్లకే మూతబడింది. తర్వాత దాని బాధ్యతను గోపాల్ చేపట్టాడు. 2010లో తమ కంపెనీని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశాడు. గీతిక చనిపోయేనాటికి హర్యానా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్‌గా ఉన్నాడు గోపాల్ కందా. అరెస్టయిన తరువాత తన పదవికి రాజీనామా చేశాడు. 2013లో గీతిక తల్లి ఆత్మహత్య చేసుకున్న తరువాత 2014 మార్చిలో బెయిల్ మీద బయటికొచ్చాడు. ఇది అన్యాయమని, అతడే నేరస్తుడని స్పష్టంగా తెలుస్తున్నా విడుదల చేయడమేంటని మానవతావాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ కోర్టు పట్టించుకోలేదు.
 
 సరేమిరా అంటే పగతో బుసలు కొట్టాడు. తన కంపెనీ హెచ్.ఆర్.మేనేజర్ ద్వారా గీతిక పని చేస్తోన్న కంపెనీకి ఆమె గురించి తప్పుడు రిపోర్టులు పంపించాడు. ఆమె క్వాలిఫైడ్ కాదని, ఆమెవన్నీ తప్పుడు సర్టిఫికెట్లు అని, ఆమె ప్రవర్తన మంచిది కాదని అపనిందలు వేశాడు. దాంతో ఆ కంపెనీ గీతికను ఉద్యోగం నుంచి తొలగించింది. వచ్చి తన కంపెనీలో చేరమని మేనేజర్ అరుణా చద్దా ద్వారా గీతిక మీద ఒత్తిడి తెచ్చాడు గోపాల్. ఆ హింస తట్టుకోలేకపోయింది గీతిక. తనలో తనే కుమిలిపోయింది. తన బాధ ఇంట్లోవాళ్లకి చెప్పలేక, ఎలా దిగమింగుకోవాలో తెలియక, గోపాల్ చేతికి మళ్లీ చిక్కకుండా తనను తాను ఎలా కాపాడుకోవాలో తోచక అల్లాడిపోయింది. లోకాన్ని వదిలిపోవడమే పరిష్కారమని భావించింది. 2012 ఆగస్టు 5, న తన గదిలోని ఫ్యానుకు శవమై వేలాడింది. ఆమె సూసైడ్ నోట్‌లో రాసినదాన్ని బట్టి గోపాల్ గోయెల్ కందా, అరుణా చద్దాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 గీతిక తల్లి కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. గీతిక మాదిరిగానే అదే గదిలో, అదే ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. గీతిక జీవితాన్ని నాశనం చేసినవారిని శిక్షించమని సూసైడ్ నోట్‌లో కోరింది. కానీ అనూరాధ కోరిక నెరవేరలేదు. గోపాల్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తన భార్యాపిల్లలతో సంతోషంగా బతుకుతున్నాడు. కనీసం ఎప్పటి కైనా అతడికి శిక్ష పడుతుందా అన్నది అందరికీ సందేహమే. అయినా మన దేశంలో ఆడపిల్లకి న్యాయం జరిగిందె ప్పుడు! అన్యాయంగా బలైపోయిన అమ్మాయిల కేసులు తేలిందెప్పుడు!
  - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement