మనోగళం: అంత గొప్ప ప్రశంసను ఎవరూ ఇవ్వలేరు! | Nobody can give great compliment for me: Shriya Saran | Sakshi
Sakshi News home page

మనోగళం: అంత గొప్ప ప్రశంసను ఎవరూ ఇవ్వలేరు!

Published Sun, Sep 29 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

Nobody can give great compliment for me: Shriya Saran

ఎదుటివారిలో మీకు నచ్చేది?
ఆప్యాయంగా మాట్లాడేవాళ్లను, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లను ఇష్టపడతాను.
ఎదుటివారిలో నచ్చనిది?
నిజాయతీ లేనివాళ్లు అస్సలు నచ్చరు.
మీలో మీకు నచ్చేది?
నాది చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నవాటికే సంబరపడిపోతాను. వీలైనంత హ్యాపీగా ఉంటాను. అనవసరమైన టెన్షన్లు మనసులోకి రానివ్వను.
మీలో మీకు నచ్చనిది?
కొంచెం పంక్చువాలిటీ తక్కువ. ఒక్కోసారి లేటైపోతుంటాను.
     మీ ఊతపదం?
 ఎవరేం చెప్పినా ‘రియల్లీ?’ అంటాను. ప్రతి చిన్నదానికీ ‘కూల్’ అన్నమాట వాడుతుంటాను.
     మీ గురించి ఎవరికీ తెలియని మూడు విషయాలు?
 నేను చాలా మొండిదాన్ని. పట్టు పడితే అనుకున్నది పూర్తయ్యే వరకూ వదలను. పుస్తకాలు విపరీతంగా చదువుతాను. ఎంత అలసిపోయినా సరే, తెల్లవారుజామునే లేస్తాను.
     మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది?
 నేనేంటో నాకు తెలుసు. ఇతరులు నా గురించి ఏమనుకుంటారన్నది వాళ్లనే అడగాలి.
     మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి?
 మా అమ్మమ్మ, అమ్మ. ఈ ఇద్దరి ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ముఖ్యంగా మా అమ్మ. అన్నింటినీ పద్ధతిగా చక్కబెట్టుకుంటుంది. అసలు విసుగనేదే ఉండదు. అంతేకాదు... ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుండె నిబ్బరంగా ఉంటుంది. అలా ఎలా ఉండగలదా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు!
     మనసుకు నచ్చిన పాట?
 రఘుపతి రాఘవ రాజారాం...! చిన్నప్పుడు నన్ను ఒళ్లో పడుకోబెట్టుకుని మా అమ్మ ఈ పాట పాడేది. అప్పట్నుంచీ నాకా పాటంటే చాలా ఇష్టం. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే ‘జన గణ మన’ ఎప్పుడు విన్నా, చిన్నప్పుడు స్కూల్లో పాడిన సందర్భాలు గుర్తొస్తుంటాయి.
     సంతోషపెట్టిన ప్రశంస?
 మా అమ్మ నన్నెప్పుడూ ‘డాళింగ్’ అంటూ ఉంటుంది. దాన్నే నేను ప్రశంసలా ఫీలవుతాను. నాకు తెలిసి అంతకన్నా గొప్ప ప్రసంశను నాకెవరూ ఇవ్వలేరు.
     స్పోర్టివ్‌గా ఉంటారా?
 చాలా...! అన్నీ లైట్ తీసుకుంటాను. ఎవరో నాతో పోటీపడుతున్నారని కంగారుపడను. నేను ఎవరితోనో పోటీ పడాలని అనుకోను. నేను నేనే. నా పని నాదే.
     ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకునేది ఏదైనా ఉదా?
 నాకు తెలిసి అలాంటివేమీ లేవు. ఏం చేసినా ఆలోచించుకునే చేస్తాం కదా! ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వచ్చినా దాని గురించి బాధపడి చేసేదేమీ లేదు. ఇంకోసారి అలా జరక్కుండా చూసుకుంటే సరిపోతుంది. అందుకే నేను దేని గురించీ పెద్దగా బాధపడను.
     మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా?
 నేనెప్పుడూ సారీలు బ్యాంకులో వేసుకోను. సాధారణంగా ఎవరినీ బాధపెట్టను. కనీసం కోపంగా కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంటాను. పొరపాటున ఎవరినైనా నొప్పిస్తే, వెంటనే క్షమాపణ చెప్పేస్తాను.
     మీరు నమ్మే సిద్ధాంతం?
 ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుపోవాలి. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించాలి. దీని ప్రకారమే నడుచుకుంటాను నేను. మన కంట్రోల్‌లో లేనిదాని గురించి కంగారుపడటం అనవసరం అన్నది నా ఉద్దేశం.
  మీ మనసుకు నచ్చిన ప్రదేశం?
 యూరోప్. అక్కడుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది.
  కాలం గిర్రున వెనక్కి తిరిగి, మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే... ఏం చేస్తుండేవారు?
 కచ్చితంగా డ్యాన్సర్ గా స్థిరపడి ఉండేదాన్ని. డ్యాన్‌‌స అంటే ప్రాణం నాకు. ఒక వేళ అది వీలు కాకపోయినా ఏదో ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఉండేదాన్ని!
     ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది?
 చిన్నప్పుడు మా స్కూలు ఎదురుగా ఉన్న బ్లైండ్ స్కూల్ చూసి, అంధుల కోసం ఎప్పటికైనా ఏదైనా చేయాలని అనుకున్నాను. అది నెరవేరింది. నేను చేయగలిగింది చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అవసరంలో ఉన్నవారికి చేతనైనంత చేయగలిగితే చాలు.
     దేవుడు మీకేదైనా ప్రత్యేకమైన శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు?
 ఏదయినా సాధించాలంటే దేవుడు మనకి ప్రత్యేక శక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అంటే, అంత శక్తి మన లోలోపల ఉన్నట్టే. కాబట్టి మనం తలచుకోవాలే గానీ, ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే గట్టిగా తలచుకోవాలంతే!
     మీ జీవితంలో ఒకే ఒక్కరోజు మిగిలివుందని తెలిస్తే, ఆ రోజును ఎలా గడుపుతారు?
 దేని గురించీ ఆలోచించకుండా, చావు ముందు ఉందని భయపడకుండా... నా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతాను.
 -  సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement