కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న! | Keyili ... found the answer to a question! | Sakshi
Sakshi News home page

కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న!

Published Sun, Oct 12 2014 1:13 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న! - Sakshi

కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న!

కేజీ అంత మంచిది కాదంటారు ఆమె గురించి తెలిసినవాళ్లు. పందొమ్మిదేళ్లకే గర్భం దాల్చి, కెయిలీకి జన్మనిచ్చింది కేజీ. కానీ ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అయినా వాళ్లు కెయిలీని ప్రేమగా పెంచారు. కేజీ మాత్రం పాపను పట్టించుకునేదే కాదు. పబ్బులకీ, పార్టీలకీ తిరిగేది. దాంతో ఓ రోజు కూతురి మీద కోప్పడింది సిండీ. అది కేజీకి నచ్చలేదు. వెంటనే కూతుర్ని తీసుకుని వెళ్లిపోయింది. తన స్వేచ్ఛకు అడ్డుగా ఉందని ఆమే పాపను ఏదైనా చేసివుంటుందని అందరికీ అనుమానమే. కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. దాంతో ఆమె కేసు నుంచి బయటపడింది.
 
నిజాలు దేవుడికెరుక: జూన్ 15, 2008... అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ...

ఆఫీసులో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు డిటెక్టివ్ యూరీ మెలిష్. తలుపు దగ్గర శబ్దం కావడంతో అటు వైపు చూశాడు. యాభయ్యేళ్లు దాటిన ఓ మహిళ నిలబడి ఉంది. ‘‘సర్... నా పేరు సిండీ ఆంటోనీ...’’ అంది వినమ్రంగా. ‘‘ఓ మిసెస్ ఆంటోనీ... మీ కోసమే వెయిట్ చేస్తున్నారు. రండి, కూర్చోండి’’ అన్నాడు యూరీ నవ్వుతూ. ఆమె వచ్చి అతడికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

‘‘ఏదో మాట్లాడాలని అన్నారు. చెప్పండి. ఏంటి విషయం?’’ యూరీ అలా అడగ్గానే దుఃఖం ముంచుకొచ్చింది సిండీకి. ‘‘నా రెండేళ్ల మనవరాలు కెయిలీ కనిపించడం లేదు సర్. ఏమయ్యిందో అర్థం కావడం లేదు’’ అంది బొంగురుపోయిన గొంతుతో.‘‘ఎప్పట్నుంచి?’’... వివరాలు నోట్ చేసుకోవడానికి పెన్నూ పుస్తకం చేతిలోకి తీసుకుంటూ అడిగాడు యూరీ.
 
‘‘నెల రోజుల్నుంచి?’’
‘‘వ్వా...ట్... నెల రోజుల్నుంచీనా? మరిప్పటి వరకూ కంప్లయింట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు?’’‘‘తను మిస్సయ్యిందని నాకు తెలిస్తే కద సర్ కంప్లయింట్ ఇవ్వడానికి! వాళ్లమ్మ దగ్గరే ఉందనుకున్నాను. కానీ అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది. తనేమయ్యిందో తెలియడం లేదు. మీరే నిజం తెలుసు కోవాలి... ప్లీజ్.’’‘‘అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు యూరీ. చెప్పడం ప్రారంభించింది సిండీ.
    
‘‘తెల్లవారగానే వచ్చి గార్డెన్లో పడిపోతావ్. విసుగైనా రాదా జార్జ్ నీకు’’... జ్యూస్ గ్లాసుతో వచ్చిన సిండీ విసుక్కుంది. ‘‘నో డియర్... నిన్ను ప్రేమించడం తర్వాత నాకు అంత ఇష్టమైన పని గార్డెనింగే’’... కన్నుగీటాడు జార్జ్. ‘‘చాల్లే... దీనికేం తక్కువ లేదు’’... ముద్దుగా విసుక్కుని, జ్యూస్ అతడి చేతిలో పెట్టి గేటువైపు నడిచింది. గేటుకు తగిలించివున్న పోస్ట్‌బాక్స్‌లో ఉన్న ఉత్తరం తీసుకుని వెనక్కి వచ్చింది. దాన్ని తెరచి చూస్తూనే... ‘‘జార్జ్, ఇలారా’’ అంది కంగారుగా. గబగబా ఆమె దగ్గరకు వచ్చి, ఉత్తరం అందుకుని చదివాడు.

‘‘మిస్టర్ అండ్ మిసెస్ జార్జ్ ఆంటోనీ... మీ అమ్మాయి కేజీ కారు ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో, అడవిని ఆనుకుని ఉన్న రోడ్డులో పార్క్ చేసివుంది. వెళ్లి తెచ్చుకోండి.’’ దాన్ని చదువుతూనే భృకుటి ముడిచాడు జార్జ్. మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే కూతురికి ఫోన్ చేశాడు. కనెక్ట్ కాలేదు. దాంతో పనివాణ్ని తీసుకుని వడివడిగా వెళ్లాడు. కాస్త నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో, ఓ పక్కగా పార్క్ చేసివుంది కేజీ కారు.

డోరు లాక్ చేసి లేక పోవడంతో తెరచి చూశాడు. లోపల కేజీ పర్సు ఉంది. కేజీ కూతురు కెయిలీ ఆటబొమ్మలు కూడా ఉన్నాయి. కారు ఉన్న పరిస్థితిని బట్టి, దాన్ని అక్కడ పార్క్ చేసి చాలా రోజులయ్యిందనిపిస్తోంది. దానికి తోడు ఒకలాంటి వెగటు వాసన వస్తోంది. ‘‘రాబర్ట్... డిక్కీ చెక్ చెయ్’’ అన్నాడు ఆ వాసన ఏమిటా అని అంచనా వేస్తూ. యజమాని ఆదేశం అందగానే వెళ్లి చెక్ చేశాడు రాబర్ట్. ఏమీ లేదందులో. మరి వాసన ఎందుకొస్తోందో అర్థం కాలేదు. కారు తీసుకుని ఇంటికి వచ్చేశారు.
    
‘‘ఎందుకు మమ్మీ కంగారు పడతావ్? నా కారు కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. కంప్లయింట్ కూడా ఇచ్చాను. వాళ్లే అక్కడ వదిలేసి ఉంటారు.’’కూతురి మాట నమ్మబుద్ధి కాలేదు సిండీకి. ‘‘కారు సంగతి సరే. ముందు కెయిలీని పిలు. నేను దానితో మాట్లాడి చాలా రోజులైంది’’ అంది కసిరినట్టుగా.
 ‘‘తను బేబీ సిట్టర్ దగ్గర ఉంది మామ్.’’
 ‘‘షటప్ కేజీ... నెల రోజులుగా ఇదే చెప్తున్నావ్. రాత్రీ పగలూ కూడా పాపని అక్కడే ఉంచేస్తున్నావా ఏంటి? నేను దానితో వెంటనే మాట్లాడాలి.’’
‘‘ఓ మామ్... యు ఆర్ క్రేజీ... ఎంత చెప్పినా అర్థం కాదు నీకు’’ అంటూనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది కేజీ. దాంతో ఏదో అనుమానం కలిగింది సిండీకి. వెంటనే కంప్లయింట్ ఇవ్వడానికి బయలుదేరింది.
    
సిండీ చెప్పిదంతా విని ఆలోచనలో పడ్డాడు యూరీ. కేజీ ఏదో దాచిపెడుతోందనిపించింది. దాంతో సిండీని తీసుకుని కేజీ దగ్గరకు బయలుదేరాడు. అరగంట తిరిగేసరికి ఆమె ఇంటి దగ్గరున్నాడు. పోలీసులతో వచ్చిన తల్లిని చూస్తూనే షాకయ్యింది కేజీ. ‘‘ఏంటి మమ్మీ ఇదంతా’’ అంది షాక్ తిన్నట్టుగా. ‘‘నేను చెప్తాను కేజీ ఆంటోనీ... మీ అమ్మగారు తన మనవరాలి కోసం బెంగ పెట్టుకున్నారు. తనని చూపిద్దామని తీసుకొచ్చాం. ఓసారి పాపని పిలవండి.’’ యూరీ మాటలు వింటూనే తత్తర పడింది కేజీ.

‘‘పాప లేదు.. బేబీ సిట్టర్ జేనీ ఫెర్నాండెజ్ దగ్గర ఉంది’’ అంది తడబడుతూ. ‘‘ఏం ఫర్లేదు. అక్కడికే వెళ్దాం’’ అన్నాడు యూరీ కూల్‌గా. కదల్లేదు కేజీ. ఏదో నసిగింది. బిత్తర చూపులు చూసింది. టెన్షన్‌గా అటూ ఇటూ తిరిగింది. ‘‘ఇక చాలు కేజీ... ఏం జరిగిందో చెప్పేస్తే మంచిది’’... ఈసారి యూరీ మాట కఠినంగా వచ్చింది. దాంతో కేజీ కంగారుపడింది. ‘‘అదీ... మరీ... నేను... మమ్మీ వాళ్ల దగ్గర్నుంచి వచ్చేశాక నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూర్‌కి వెళ్లాలనుకున్నాను. అందుకే పాపని జేనీ దగ్గర ఉంచాను. కానీ తను పాపను తీసుకుని ఎక్కడికో పారిపోయింది. వెతికినా దొరకలేదు.’’
 
అది వింటూనే ఆవేశంగా వెళ్లి కూతురి చెంప పగులగొట్టింది సిండీ. ‘‘బుద్ధి లేదా నీకు? పాప విషయంలో ఇంత నిర్లక్ష్యమా?’’ అంటూ చీవాట్లు వేసింది. యూరీకి మాత్రం ఏదో తేడా కొట్టింది. కేజీ చెబుతోన్నదాంట్లో నిజం లేదని అతడి అనుభవం పదే పదే చెప్పసాగింది. దాంతో తన టీమ్‌ని రంగంలోకి దింపాడు. అతడు అనుమానించిందే నిజమైంది. మూడు రోజుల తర్వాత... సిండీ, జార్జ్‌ల ఇంటి వెనుక ఉన్న పెద్ద తోటలో... ఓ పాలిథీన్ సంచిలో ఒక పుర్రె, కొన్ని ఎముకలు దొరికాయి. అవి కెయిలీవే అని తెలుసుకోవడానికి యూరీకి పెద్ద సమయం పట్టలేదు. వెంటనే కేజీ చేతికి బేడీలు వేశాడు.
    
మూడేళ్ల తర్వాత... జూలై 17, 2011...
‘‘తన కూతురు కెయిలీని కేజీయే హత్య చేసిందనడానికి తగిన ఆధారాలు లేవు. కాకపోతే కూతురి అదృశ్యం గురించి గోప్యంగా ఉంచడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటికి శిక్షార్హురాలు. కానీ ఇప్పటికే మూడేళ్లు జైల్లో గడిపింది కాబట్టి ఆమెను విడుదల చేయడమైనది.’’
 
తీర్పు వింటూనే అమెరికా మొత్తం షాకైపోయింది. న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ఎలా ఎంచిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే, ఏ రకంగా చూసినా కేజీయే నేరస్తురాలనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. గార్డెన్లో దొరికిన కెయిలీ పుర్రెను పరిశీలించినప్పుడు నోటిమీద టేపు కనిపించింది. ఎముకల మీద కూడా టేపు ఉంది. అంటే అరవకుండా, కదలకుండా పాపను బంధించారు. అధిక మొత్తంలో క్లోరోఫామ్ ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఉంది. దానికి తగ్గట్టుగా కేజీ కారులో క్లోరోఫామ్ ప్యాకెట్ కనిపించింది. కేజీ కంప్యూటర్ హిస్టరీని చెక్ చేసినప్పుడు... క్లోరోఫామ్ గురించి ఆమె నలభైసార్లకు పైగా సెర్చ్ చేసినట్టు తెలిసింది.
 
పైగా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. పాపను జేనీ ఫెర్నాండెజ్ దగ్గర పెట్టానంది. కానీ అసలలాంటి వ్యక్తే లేదని విచారణలో తేలింది. అడిగితే.. ‘ఎవరో స్త్రీ ప్లాన్ ప్రకారం నాతో ఆ పేరు చెప్పిందేమో. నేను నమ్మి పాపను అప్పగించాను, ఎత్తుకుపోతే నేనేం చేయను’ అంది. తాను యూనివర్సల్ స్టూడియోస్‌లో పని చేస్తున్నానని కేజీ పోలీసులతో చెప్పింది. అది కూడా అబద్ధమని, ఆమె ఉద్యోగం పోయి అప్పటికి చాలా కాలమే అయ్యిందని తెలిసింది. కారును ఎత్తుకుపోవడం అనేది కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. కారు అక్కడుందని కేజీ తల్లిదండ్రులకు ఉత్తరం ఎవరు పంపారో కూడా తెలీలేదు. దానికి తోడు విచారణ సమయంలో కేజీ ప్రవర్తన సందేహాలను పెంచింది. కూతుర్ని పోగొట్టుకున్న బాధ లేకుండా నవ్వుతూ తుళ్లుతూ ప్రవర్తించడం ఆశ్చర్యపరిచేది.
 
ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే, ప్రతి విషయమూ అనుమానాస్పదంగా కనిపిస్తుంటే కేజీని నిర్దోషి అని ఎలా అంటారు అంటూ చాలామంది న్యాయస్థానాన్ని, ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కేజీ ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతోంది. కెయిలీ గురించి ఓ తల్లిగా ఆమె ఎప్పుడూ ఎక్కడా మాట్లాడదు. కానీ ప్రపంచం మాత్రం ఇప్పటికీ కెయిలీ గురించి మాట్లాడుతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెడుతోంది. ముద్దులొలికే ఆ చిన్నారి ఉదంతం... జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది!
 
అయితే కెయిలీ కేసు చూసిన తర్వాత అమెరికా ప్రభుత్వం ‘కెయిలీ లా’ పేరుతో ఓ చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం... పన్నెండేళ్లలోపు పిల్లలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయినా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా, ఇరవై నాలుగ్గంటల లోపు పోలీసులకు తెలియజేయాలి. లేదంటే మొదటి అనుమానితులు తల్లిదండ్రులే అవుతారు. ఈ చట్టాన్ని కొందరు తప్పుబట్టారు. తల్లిదండ్రుల్ని అనుమా నించడం కరెక్ట్ కాదు అన్నారు. కానీ ప్రభుత్వం తమ చట్టాన్ని సమర్థించుకుంది. చిన్నపిల్లలు అదృశ్యమవడం, వారి మరణాలు ఎక్కువ కావడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించుకుంది.
 - సమీర నేలపూడి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement