కిటికీలోంచి టేకాఫ్! | soils around fly: Take off from Flight window | Sakshi
Sakshi News home page

కిటికీలోంచి టేకాఫ్!

Published Sun, Apr 27 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:33 AM

కిటికీలోంచి టేకాఫ్!

కిటికీలోంచి టేకాఫ్!

కేవలం రాబర్ట్, రెపోలే కాదు... ఆ రోజు ప్రమాదంలో చనిపోయినవారిలో మరికొందరి ఆత్మలు కూడా ఆ విమానంలో సంచరించేవట. ముఖ్యంగా ఓ మధ్య వయస్కుడు, ఓ యువతి ఎక్కువగా కనిపించేవారట. తెల్లని గౌను వేసుకుని, జుట్టు విరబోసుకుని ఉన్న ఆ యువతిని చూసి కొందరు జడుసుకోవడం కూడా జరిగిందని చెబుతారు. ఆమె ఎప్పుడూ ఒకే సీట్లో కూర్చుని మౌనంగా ఏడుస్తూ ఉండేదట. మధ్య వయస్కుడు అయితే దేని కోసమో వెతుకుతూ ఉండేవాడట. ఇవన్నీ భ్రమలు అని కొందరు కొట్టి పారేశారు కానీ... అవన్నీ నిజమేనని కొందరు విమాన సిబ్బంది కూడా చెప్పడంతో నమ్మక తప్పలేదు!
 
 ఫ్లారిడా (అమెరికా)లోని మయామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. లండన్ వెళ్లాల్సిన విమానం రన్‌వే మీద ఆగివుంది. ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ సీట్లలో కూర్చుంటున్నారు. వారికి సహాయపడుతూ ఎయిర్ హోస్టెస్ అటూ ఇటూ తిరుగుతోంది. అంతలో...
 ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ... ఓసారి ఇలా వస్తారా?’’... అరిచినట్టే వినిపించిందో స్వరం. అటువైపు చూసింది Air Hostes. ఓ లావుపాటి స్త్రీ, చేతిలో హ్యాండ్‌బాగ్‌తో నిలబడి ఉంది. ముఖంలో విసుగు, కళ్లలో కాస్త కోపం. ఏమయ్యిందోననుకుంటూ కంగారుగా అటు వెళ్లింది హోస్టెస్.
 ‘‘చెప్పండి మేడమ్... ఏం కావాలి?’’ అంది అనునయంగా.‘‘నా సీటు కావాలి. ఆ విండో సీట్ నాది. వెళ్లి కూచుందామంటే ఇతడు అడ్డుగా ఉన్నాడు. లేవమంటే లేవడు. ఎన్నిసార్లు అడిగినా కదలడం లేదు’’... చెప్పలేనంత చిరాకు కనిపించిందామె మాటల్లో.
 
 ‘‘సారీ మేడమ్. నేను చెప్తానులెండి’’ అంటూ అటువైపు చూసింది హోస్టెస్. క్షణాల్లో ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘ఎవరి గురించి చెప్తున్నారు మేడమ్?’’ అంది అయోమయంగా. ‘‘అరె... తమాషాగా ఉందా? ఎదురుగా ఉన్నాడుగా... కనిపించనట్టు అలా అడుగుతావేం’’ అందామె మరింత కోపంగా. బిక్కమొహం వేసింది హోస్టెస్. ‘‘సారీ మేడమ్. నాకెవరూ కనిపించడం లేదు’’ అంటూ గొణిగింది. ‘‘ఎందుకందరూ ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? వాడేమో లేవడు. నువ్వేమో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడే నేను ఎయిర్‌పోర్ట్ అథారిటీస్‌కి కంప్లయింట్ చేస్తాను’’ అంటూ విసవిసా పైలట్ క్యాబిన్‌వైపు నడిచిందామె. ‘‘కెప్టెన్... కెప్టెన్’’ అంటూ కేకపెట్టింది. వెంటనే కెప్టెన్ వచ్చాడు. ‘‘ఏంటి మేడమ్... ఏం జరిగింది?’’ అన్నాడు కంగారుగా.సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు ఎయిర్ హోస్టెస్‌ని కూడా కలిపి తిట్టడం మొదలుపెట్టిందామె. ఏమిటన్నట్లు హోస్టెస్ వైపు చూశాడు కెప్టెన్.
 ‘‘నా తప్పేమీ లేదు సర్. ఎవరో కూర్చున్నారని అంటున్నారు. నాకక్కడ ఎవరూ కనిపించలేదు. అలా అంటే ఆవిడకి కోపమొచ్చేస్తోంది.’’
 హోస్టెస్ మాట వినగానే కెప్టెన్ కనుబొమలు పైకి లేచాయి. భృకుటి ముడిపడింది. క్షణం తర్వాత అన్నాడు. ‘‘సారీ మేడమ్. మీరు వెళ్లి కూచోండి. ఈపాటికి అతడు వెళ్లిపోయి ఉంటాడు’’ అన్నాడు కూల్‌గా.
 ‘‘వెళ్లిపోయాడా... చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు?’’
 ‘‘చూడక్కర్లేదు. నాకు తెలుసు. కచ్చితంగా వెళ్లిపోయి ఉంటాడు. మీరు వెళ్లి కూచోండి’’ అని హోస్టెస్ వైపు తిరిగి తీసుకెళ్లమన్నట్టుగా సైగ చేశాడు. సరేనని హోస్టెస్ కదిలింది. సదరు ప్రయాణికురాలు కూడా వెంటే నడిచింది. సీటు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడెవరూ లేరు. ఆమె తన సీట్లో కూచుంది. హోస్టెస్ తిరిగి కెప్టెన్ దగ్గరకు వచ్చింది.
 ‘‘నా మాట నిజం సర్. అక్కడెవరూ లేరు’’ అంది సంజాయిషీ ఇస్తున్నట్టుగా.
 ‘‘లేదు షీబా. ఉన్నారు. నీకు కనిపించలేదు, ఆమెకు కనిపించారు... అంతే తేడా.’’
 ఉలిక్కిపడిందామె. ‘‘ఏమంటున్నారు సర్? తనకు కనిపించి నాకెందుకు కనిపించరు?’’
 ‘‘ఆత్మలు అంతే... అందరికీ కనిపించవు. వెళ్లి పని చూసుకో’’ అనేసి వెళ్లిపోతున్న కెప్టెన్ వైపు కొయ్యబారిపోయి చూస్తూండిపోయింది హోస్టెస్.
 ఆత్మా? విమానంలో ఆత్మ ఉందా? ఎవరి ఆత్మ? ఇక్కడెందుకుంది? అంత కూల్‌గా మాట్లాడుతున్నారంటే ఈ విషయం కెప్టెన్‌కి తెలుసా? ఆయన కూడా దాన్ని చూశారా? చూసి కూడా ఏమీ చేయకుండా అలా ఎలా వదిలేశారు? ఆ ఆత్మ వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే?
 ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది హోస్టెస్. భయంతో చెమటలు పోశాయి. ఓసారి విమానమంతా పరికించింది. అందరూ ఎవరి సీట్లలో వారు కూర్చు న్నారు. ప్రశాంతంగా ఉన్నారు. కానీ తను మాత్రమే ఇలా భయంతో వణుకుతోంది.
 షీబా ఆ రోజే తొలిసారి విధుల్ని నిర్వహిస్తోంది. అందుకే ఆమెను ఆ విషయం భయపెడుతోంది. కానీ రెగ్యులర్‌గా ఆ విమానంలో వెళ్లేవారికి ఇలాంటి అనుభవాలు మామూలే. ఆ సంగతి ముందే తెలిసివుంటే పాపం అంత కంగారు పడేది కాదేమో. ఇంతకీ ఎవరిదా ఆత్మ?
    
 1972, డిసెంబర్ 29... న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం.  సమయం తొమ్మిదీ ఇరవై అయ్యింది.‘ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ - 401’ మెల్లగా గాల్లోకి లేచింది. 163 మంది ప్రయాణీకులు, పదమూడు మంది సిబ్బందితో బయలుదేరింది. కెప్టెన్ రాబర్ట్ లోఫ్ (55) ఓసారి విమానమంతా పరిశీలించి చూసుకున్నాడు. ప్రయాణికులంతా సౌకర్యంగా, ప్రశాంతంగా ఉండటంతో క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు.
 రాత్రి 11.32 అవుతుండగా విమానం ఫ్లారిడాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువయ్యింది. అక్కడ దిగాల్సినవాళ్లు సమాయత్తమవుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అయ్యేదే. కానీ అంతలోనే ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. విమానాన్ని కిందికి దించేందుకు తోడ్పడే ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం మానేసింది. పెలైట్ కంగారు పడ్డాడు. ఇంజినీర్ డోనాల్డ్ రెపోని పిలిచాడు.
 
 ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు రెపో కంగారుగా.
 ‘‘ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం లేదు’’
 రెపోతో పాటు కెప్టెన్ రాబర్ట్ లోఫ్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఏదో ఒకటి చెయ్యమన్నట్టుగా రెపో వైపు చూశాడు రాబర్ట్. రెపో వేగంగా కదిలాడు. చకచకా ల్యాండింగ్ గేర్‌ని బాగు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. అతడా పని చేసేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. విమానం క్రాష్ అయ్యింది. 99 మంది ప్రాణాలు అక్కడికక్కడే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రాబర్ట్, రెపోలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాబర్ట్ మరణించాడు. మరునాడు రెపో కన్నుమూశాడు.
 
 అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఈ సంఘటన నిలిచిపోయింది. దాన్ని మర్చిపోవడానికి అందరికీ కొన్ని నెలలు పట్టింది. విమాన ప్రమాదానికి కారణాలను అన్వేషించారు అధికారులు. బ్లాక్‌బాక్స్ రికార్డింగులను బట్టి ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పనిచేయకపోవడమే అసలు కారణమని తెలిసింది. విమానం బాగా ధ్వంసమైనా... కొన్ని పరికరాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. దాంతో వాటిని తీసి మరో విమాన తయారీలో వాడారు. అలా చేయడం వల్ల ముందు ముందు ఏం జరుగుతుందో అప్పుడు వారు ఊహించలేకపోయారు.
 
 కూలిపోయిన విమాన పరికరాలను అమర్చిన ‘ఎల్-1011’ విమానంలో ఊహించని సంఘటనలు జరగడం మొదలైంది. చాలాసార్లు పెలైట్ క్యాబిన్లో కెప్టెన్ రాబర్ట్ కనిపించేవాడు. చాలామంది పెలైట్లు ఆయన్ని చూసి భయపడ్డారు. విచిత్రమేమిటంటే ఆయన వాళ్లు చూస్తుండగానే మాయమయ్యేవాడు. రెపో కూడా విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. వీళ్లిద్దరూ ఒక్కోసారి ప్రయాణికుల సీట్లలో కూర్చుని ఉండేవారు.
 
 వాళ్లు మనుషులని అంతా అనుకునేవారు. కానీ అంతలోనే మాయమైపోతుంటే కంగారు పడేవారు. ఓసారైతే విమానంలో చిన్న సమస్య తలెత్తింది. అసిస్టెంట్ ఇంజినీర్ దాన్ని బాగు చేసేందుకు తంటాలు పడుతున్నాడు. అంతలో ఓ వ్యక్తి వచ్చాడు. తాను చీఫ్ ఇంజినీర్‌నని చెప్పాడు. ఎలా బాగు చేయాలో తెలియడం లేదంటూ బిక్కమొహం వేసిన అసిస్టెంట్ ఇంజినీర్‌కి ధైర్యం చెప్పి, దాన్ని అతడే బాగు చేశాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. అసిస్టెంట్ ఇంజినీర్ ఎంత వెతికినా అతడు కనిపించలేదు. దాంతో అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అతడెలా ఉన్నాడని వాళ్లు అడిగితే గుర్తులు చెప్పాడు. అప్పటికే జరుగుతున్న సంఘటనల్ని పరిశీలిస్తున్న అధికారులు ఆ ఇంజినీర్‌కి రెపో ఫొటోని చూపించారు. తాను చూసింది అతడినే అన్నాడతడు. దాంతో రెపోనే వచ్చి రిపేర్ చేశాడని అర్థమైంది అధికారులకి. వచ్చింది మనిషి కాదు, ఆత్మ అని తెలిసిన అసిస్టెంట్ ఇంజినీర్ హడలి పోయాడు.
 
 ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చాలానే జరిగాయి. కొందరు ఆ విమానం ఎక్కడానికి కూడా భయపడే పరిస్థితి తలెత్తింది. అయితే... రాబర్ట్, రెపోలు ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. వచ్చి ఎక్కడో చోట కూర్చునేవారు. తర్వాత మాయమైపోయేవారు. అయితే అప్పుడప్పుడూ కొందరితో మాట్లాడేవారు. ‘‘మీరు కంగారుపడవద్దు. విమానానికి ఏమీ కాదు. మేము ఇక ఏ విమానాన్నీ కూలనివ్వం’’ అంటూ రాబర్ట్ కొందరితో చెప్పేవాడు. రెపో అయితే విమానంలో సమస్య తలెత్తినప్పుడు తప్పక వచ్చేసేవాడు. ఓసారయితే... ఇండికేటర్‌లో చిన్న సమస్య తలెత్తడాన్ని పైలట్ గమనించాడు. ఇంజినీర్‌తో ఆ విషయం చెప్పాడు. అతడు దాన్ని బాగుచేసేలోపే అది దానంతటదే బాగైపోయింది. దాంతో ఇంజినీర్ ఆశ్చర్యపోయాడు. కానీ అప్పటికే కొన్నేళ్లుగా పనిచేస్తోన్న పైలట్... అది రెపో పనేనని అర్థం చేసుకున్నాడు.
 
 రాబర్ట్, రెపోల వల్ల ఏ చెడూ జరగకపోయినా... ఆత్మలు కనిపించడమనేది జనాన్ని భయపెట్టే విషయమే కాబట్టి అధికారులు దాని గురించి తీవ్రంగా ఆలోచించారు. కూలిన విమాన భాగాలను అమర్చడం వల్లే ఇదంతా జరుగుతోందని అర్థం చేసుకుని వాటిని తొలగించి, కొత్త భాగాలను వేశారు. ఆ తరువాత రాబర్ట్, రెపోలు మళ్లీ కనిపించలేదు!
 - సమీర నేలపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement